YS Jagan: వ్యక్తిగతంగా హాజరవుతా - వారం గడువు ఇవ్వండి - సీబీఐ కోర్టును కోరిన జగన్
Jagan asks CBI: వారం రోజులు గడువిస్తే వ్యక్తిగతంగా హాజరవుతానని జగన్ సీబీఐ కోర్టును కోరారు. దీంతో కోర్టు అనుమతి ఇచ్చింది.

Ys Jagan Case in CBI court: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. ఈ నెల 21వ తేదీలోపు వ్యక్తిగా హాజరవుతానని కోర్టుకు తెలిపారు. యూరప్ పర్యటనకు వెళ్లాలనే ఉద్దేశంతో హైదరాబాద్ స్పెషల్ సీబీఐ కోర్టుకు దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో జగన్ తన అభ్యర్థనను వెనక్కితీసుకుని, వారం రోజుల సమయం కోరారు. సీబీఐ కోర్టు ఆ అభ్యర్థనను అంగీకరించి, నవంబరు 21 వరకు మినహాయింపు ఇచ్చింది.
జగన్ మోహన్ రెడ్డి యూరప్ పర్యటనకు అనుమతి కోసం సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో యూరప్ పర్యటనకు వెళితే వచ్చిన తర్వాత నవంబర్ 14వ తేదీ వరకు తప్పక హాజరు కావాలని ఆదేశించింది. యూరప్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత జగన్ తాను వ్యక్తిగతంగా హాజరు కాలేనని పిటిషన్ వేశారు. తాను కోర్టుకు హాజరు కావాలంటే ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందన్నారు. అందుకే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతానని వాదించారు. ఈ అభ్యర్థనపై సీబీఐ మంగళవారం కౌంటర్ దాఖలు చేసింది. "వ్యక్తిగత హాజరు తప్పనిసరి. మినహాయింపు ఇవ్వకూడదు" అంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో కోర్టులో ట్రయల్ ప్రారంభం కావాల్సి ఉంది.






















