MMTS Rape Case : ఎంఎంటీఎస్ రేప్ కేసు అంతా భోగస్ - నిజం చెప్పేసిన యువతి - అసలు జరిగింది ఇదీ !
Hyderabad news: హైదరాబాద్ ఎంఎంటీఎస్‌లో రేప్ అంటూ జరిగిన ప్రచారంలో నిజం తేలిపోయిది. రీల్స్ చేస్తూ ట్రైన్‌లో నుంచి పడిపోయిన అమ్మాయి కట్టుకథ అల్లింది.

MMTS Rape Case Truth : ఎంఎంటీఎస్ రైల్లో తనపై అత్యాచార యత్నం జరిగిందని వారి నుంచి రక్షించుకోవడానికి తాను కిందకు దూకేశానని ఓ యువతి గత నెల చివరి వారంలో ఫిర్యాదు చేసింది. ఈ ఘటన జంట నగరాల్లో కలకలం రేపింది. రైల్వే పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఉలిక్కిపడ్డారు. రైల్లో అత్యాచార యత్నం ఘటనను సీరియస్ గా తీసుకున్నారు. రైలు నుంచి జారిపడిన యువతి దగ్గర వివరాలు తీసుకుని మొత్తం పరిశోధన చేశారు. కొంత మంది అనుమానితుల్ని కూడా ప్రశ్నించారు. అయితే పోలీసులకు చివరికి ఎలాంటి క్లూ దొరకలేదు. కానీ గాయపడిన యువతి ఎప్పటికప్పుడు సమాచారం మారుస్తూండటంతో పోలీసులకు డౌట్ వచ్చింది. అక్కడే వారికి అసలు క్లూ లభించింది.
గాయపడిన యువతిని పోలీసులు అసలేం జరిగింది.. అత్యాచారం ఎలా జరగబోయిందో చెప్పమని పోలీసులు అడిగే సరికి.. ఆమె పొంతనలేని మాటల్ని పదే పదే చెప్పారు. చివరికి పోలీసులు ఎంత దర్యాప్తు చేసినా అత్యాచారం చేసినట్లుగా ఆనవాళ్లు కనిపించడం లేదని.. కింద పడ్డావో చెప్పాలని సూచించారు. చివరికి ఆ యువతి నిజం చెప్పింది. ఎంఎంటీఎస్ గేటు వద్ద నిలబడి ఆ యువతి రీల్స్ తీసుకోవాలని ప్రయత్నించింది. కానీ జారి కిందపడిపోయింది. తీవ్రంగా గాయాలయ్యాయి. రీల్స్ తీసుకోవడానికి ప్రయత్నించానని చెబితే పరువు పోతుందని.. పోలీసులు కూడా కేసులు పెడతారన్న ఉద్దేశంతో అత్యాచారం కథ అల్లింది.
తనపై అత్యాచారం చేయబోరని.. అబద్దం చెప్పానని నిజానికి తానే జారి పడ్డానని ఆ యువతి పోలీసులకు చెప్పడంతో వారు కూడా అవాక్కయ్యారు. బాధిత యువతి అనంతపురం జిల్లాకు చెందినట్లుగా తెలుస్తోంది. ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్న ఆమె సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ కు వెళ్లే ఎంఎంటీఎస్‌లో ప్రయాణించింది. మహిళా బోగీలోనే ఆమె ఎక్కింది. అయితే ఆ సమయంలో చాలా తక్కువ మంది ఉన్నారు. ఉన్న మహిళలు అల్వాల్ స్టేషన్ లో దిగిపోవడంతో ఆమె ఒక్కటే ఉంది. ఆ సమయంలో ఓ యువకుడు వచ్చి తనపై అత్యాచారం చేయబోయాడని..కాపాడుకోవడానికి దూకేశానని ఆమె చెప్పారు.
పోలీసులు ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్నారు. కేటీఆర్ తో పాటు చాలా మంది హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిస్థితి ఇలా ఉందని విమర్శలు గుప్పిస్తూ ట్వీట్లు పెట్టారు. పోలీసులు ఈ కేసులో చాలా సీసీ కెమెరాలను పరిశీలించారు. ఎలా చూసినా.. మహిళా బోగీలోకి ఎవరూ వచ్చినట్లుగా గుర్తించలేకపోయారు. ఆ బోగీలోకి ఎక్కిన వాళ్లు.. దిగిన వాళ్లతో పాటు.. అన్ని స్టేషన్ల ఫుటేజీని విశ్లేషించారు. చివరికి ఆమెకు చేసిన పరీక్షల్లోనూ.. ఇతరులు బలవంతం చేసినట్లుగా గుర్తులు కానీ.. ఇతర సాక్ష్యాల కానీ లభించలేదు. దాంతో పోలీసులు ఆ యువతి కట్టుకథ అల్లిందని అనుమానించారు. చివరికి అదే నిజం అయింది. రీల్స్ కోసం ప్రయత్నించి కిందపడి.. దానికి అత్యాచారం కథ అల్లినట్లుగా స్పష్టమయింది.





















