Vijayasai Reddy CID investigation: రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
liquor scam News: లిక్కర్ స్కాంలో రాజ్ కసిరెడ్డే అన్నీ చెప్పగలరని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. సీఐడీ విచారణ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

Vijayasai Reddy comments On Raj Kasireddy: రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్ అని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఏపీలో జరిగిన లిక్కర్ స్కాం వ్యవహారంలో ఆయన సీఐడీ ఎదుట హాజరయ్యారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ ప్రశ్నించారు. విచారణ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజ్ కసిరెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలివైన క్రిమినల్ అని.. ఆయన తనను మోసం చేశారన్నారు. తాను రాజ్ కసిరెడ్డికి అరబిందో నుంచి వంద కోట్ల రూపాయలు అప్పుగా ఇప్పించానన్నారు. రాజ్ కసిరెడ్డి మూడు కంపెనీలు పెట్టి లిక్కర్ తయారు చేశారన్న విషయం తనకు తెలియదు కానీ.. అందులో రెండు కంపెనీలకు మాత్రం వంద కోట్లు ఇప్పించానన్నారు. పన్నెండు శాతం వడ్డీకి చెల్లింపులు జరిగేలా ఈ అప్పు ఇప్పిచాననిచెప్పారు.
రాజ్ కసిరెడ్డిని తనకు పార్టీ నేతలే ప్రచారం చేశారని.. ఆయనను తాను ప్రోత్సహించి తప్పు చేశానన్నారు. లిక్కర్ పాలసీకి సంబంధించి తన ఇంట్లో రెండు సమావేశాలు జరిగాయని.. విజయసాయిరెడ్డి సీఐడీ అధికారుల ఎదుట అంగీకరించారు. ఆ సమావేశాల్లో రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డి కూడా పాల్గొన్నారని తెలిపారు. అయితే లిక్కర్ విక్రయాల అంశంలో తాను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదన్నారు. దుర్మార్గమైన రాజ్ కసిరెడ్డి చేతిలో మోసపోయానని బాధపడుతున్నాన్నారు. రాజ్ కసిరెడ్డి వసూలు చేసినవి ఎవరికి వెళ్లాయో తనకు తెలియదన్నారు. రాజ్ కసిరెడ్డి మాత్రమే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగలరని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.
లిక్కర్ స్కాంలో బిగ్ బాస్ ఉన్నాడో లేడో తనకు తెలియదన్నారు. విచారణలో అధికారులు లంచాల గురించి అడిగారని.. తనకు తెలియదని చెప్పానని తెలిపారు. రెండు కంపెనీలకు సిఫారసు చేశానని చెప్పానని.. ఒకరికి రూ.60 కోట్లు, మరొకరికి రూ.40 కోట్లు ఇచ్చారని చెప్పానని వెల్లడించారు. రుణం మాత్రమే ఇప్పించానని.. నిధుల వినియోగం గురించి తెలియదని చెప్పానని పేర్కొన్నారు. సిట్ అధికారులు తనను అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పానన్నారు. మరో సారి పిలిచినా వస్తానన్నారు. మరోసారి ఆయన జగన్ కోటరీపై విరుచుకుపడ్డారు. తాను నెంబర్ టు స్థానంలో ఉండేవాడినని.. తర్వాత రెండు వేల స్థానానికి పడిపోయానన్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనది రెండో స్థానమని అధికారంలోకి వచ్చాక ఆ స్థానం మిథ్య అని తేలిందని నిరాశ వ్యక్తం చేశారు.
పార్టీ అధికారంలో లేనప్పుడు అన్నీ తానే చూసుకున్నానన్నారు. తాను వెన్నుపోటుదారుడినని జగన్‌కు చెప్పారన్నారు. కోటరీ వల్లే తాను పార్టీని వీడానని చెప్పుకొచ్చారు. తాను వేల కోట్లు దోచుకున్నానని జగన్ కు చెప్పారని మండిపడ్డారు. వైసీపీకి చెందిన మీడియాలో తనపై వస్తున్న వార్తలపైనా విజయసాయిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. సాక్షి పత్రికను తానే పెట్టించానని ఇప్పుడు ఆ పత్రికలో తనపై దుష్ప్రచారం చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను బీజేపీ తరపున రాజ్యసభ స్థానం అడగలేదన్నారు. రాజకీయాల్లో లేనని.. ప్రజలు కోరుకుంటే రాజకీయాల్లోకి వస్తానని వ్యాఖ్యానించారు. ఎంపీ పదవి కావాలని తాను ఎవర్నీ అడగలేదని స్పష్టం చేశారు.





















