Activa Petrol Vs Electric: పెట్రోల్ లేదా ఎలక్ట్రిక్ - డైలీ అప్-డౌన్‌కు ఏ స్కూటర్ బెటర్? ఏది డబ్బు ఆదా చేస్తుంది?
Honda Activa Petrol VS Electric Scooter: ఎలక్ట్రిక్, పెట్రోల్ వెర్షన్‌లతో స్కూటర్లు మన దేశ రోడ్లపై తిరుగుతున్నాయి. ఈ రెండు రకాల స్కూటర్లలో దేనివల్ల తక్కువ ఖర్చు అవుతుంది?.

Activa Petrol Vs Electric - Which One Saves Money: నేటి కాలంలో, వాహనం రోజువారీ అవసరంగా మారింది. కారు లేదా స్కూటర్/ బైక్ తప్పనిసరిగా మారింది. తక్కువ దూరం ప్రయాణించడానికి ప్రజలు స్కూటర్ లేదా బైక్‌ను ఉపయోగిస్తారు. ఈ బిజీ రోడ్లపై బైక్ కంటే స్కూటర్ ఇంకా కంఫర్ట్‌గా ఉంటుంది. ఆకుకూరలు కొనడం దగ్గర నుంచి ఆఫీసుకు వెళ్లడం వరకు ప్రతి పనికీ స్కూటర్ ఒక మంచి ఆప్షన్. కొంతకాలం క్రితం చూస్తే, భారతీయ మార్కెట్‌లో పెట్రోల్‌తో నడిచే స్కూటర్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు, ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా ఎక్కడంటే అక్కడ కనిపిస్తున్నాయి. దాదాపు అన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేశాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ (EVలు) రాకతో ప్రజల ఆలోచనల్లో మార్పు రావడంతో పాటు ఒకింత అమోమయం కూడా పెరిగింది. ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలా లేదా పెట్రోల్ స్కూటర్ కొనాలా, ఏది తమకు ప్రయోజనకరంగా ఉంటుందో తెలియక కన్‌ఫ్యూజ్ అవుతున్నారు.
పెట్రోల్ స్కూటర్ Vs ఎలక్ట్రిక్ స్కూటర్
భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లలో హోండా యాక్టివా (Honda Activa) ఒకటి. ఈ స్కూటర్ పెట్రోల్ మోడల్‌తో పాటు ఎలక్ట్రిక్ మోడల్ కూడా మార్కెట్లోకి వచ్చింది. చాలా మంది పెట్రోల్ స్కూటర్లు దిగి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎక్కుతున్నారు. సాధారణంగా, ప్రజలు ఏదైనా స్కూటర్ కొనుగోలు చేసేటప్పుడు దాని ధరను ఇతర స్కూటర్లతో పోల్చి చూస్తారు. వాహనాన్ని కొనుగోలు చేసిన తర్వాత దాని నిర్వహణకు అయ్యే ఖర్చు గురించి ఆలోచించడం లేదు, ముఖ్యంగా చూడాల్సిన విషయం ఇదే. ఏ స్కూటర్ నిర్వహణ ఖర్చు తక్కువో & ఏ స్కూటర్‌ను నడపడానికి తక్కువ ఖర్చు సరిపోతుందో చెక్ చేసుకోవడం అవసరం. స్కూటర్ కొనుగోలు కోసం మీరు చెల్లించిన డబ్బుకు విలువను ఆపాదించే విషయం ఇదే.
హోండా యాక్టివా పెట్రోల్ స్కూటర్ Vs ఎలక్ట్రిక్ స్కూటర్ పోలికలు
* హోండా యాక్టివా పెట్రోల్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర (Honda Activa Petrol Variant Ex-Showroom Price) రూ. 78,684 నుంచి ప్రారంభమై రూ. 84,685 వరకు ఉంటుంది. యాక్టివా E ఎక్స్-షోరూమ్ ధర (Activa E ex-showroom price) రూ. 1,17,000 నుంచి ప్రారంభమై రూ. 1,15,600 వరకు ఉంటుంది.
* యాక్టివా పెట్రోల్ వెర్షన్‌తో పోలిస్తే యాక్టివా E వెర్షన్‌లో రన్నింగ్ కాస్ట్ తక్కువగా ఉంటుంది. మీ ఎలక్ట్రిక్ టూ వీలర్‌ను ఎక్కడైనా ఛార్జ్ చేసుకునే అవకాశం మీకు లభిస్తే, అది మీ కరెంటు బిల్లు ఖర్చును మరింత తగ్గిస్తుంది.
* ఎలక్ట్రిక్ స్కూటర్ల నిర్వహణ కూడా చౌకగా ఉంటుంది. ఎందుకంటే, పెట్రోల్ వేరియంట్‌ల కంటే EVలలో కదిలే భాగాలు తక్కువగా ఉంటాయి.
* ఏదైనా రిపేర్ వస్తే, పెట్రోల్ వెర్షన్ మెకానిక్‌లు దొరికినంత సులభంగా ఎలక్ట్రిక్ వెర్షన్ మెకానిక్‌లు దొరక్కపోవచ్చు. ఇదొక మైనస్ పాయింట్.
* మన దేశంలో ఇప్పటికీ EVల మౌలిక సదుపాయాలు సరిగా లేవు. పెట్రోల్ వెర్షన్ స్కూటర్ ఇంధనం లేక ఆగిపోతే, పెట్రోల్ పంప్ అతి దగ్గరలోనే కనిపించవచ్చు. ఛార్జింగ్ లేక ఎలక్ట్రిక్ వెర్షన్ మధ్యలో ఆగిపోతే, ఛార్జింగ్ స్టేషన్‌లు అందుబాటులో ఉండదు. ఇది మరొక మైనస్ పాయింట్.
ఎలక్ట్రిక్ వెర్షన్‌లో ఎప్పుడూ తగినంత ఛార్జింగ్ ఉండేలా చూసుకుంటే, పెట్రోల్ స్కూటర్ కంటే ఎలక్ట్రిక్ స్కూటర్ కొనడం మరింత తెలివైన & డబ్బు ఆదా చేసే ఆప్షన్ అవుతుంది. పెట్రోల్ పంప్‌ల తరహాలో EV ఛార్జింగ్ స్టేషన్‌లు కూడా ఎక్కువగా అందుబాటులోకి వచ్చినప్పుడు మన దేశ రోడ్ల మీద EVలే అధికంగా కనిపిస్తాయి. గతంలో ప్రజలు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల పనితీరు గురించి ఆందోళన చెందేవాళ్లు. నేడు భారతీయ మార్కెట్లో లాంచ్ అవుతున్న ఎలక్ట్రిక్ వాహనాలు పెట్రోల్ స్కూటర్ల మాదిరిగానే పని చేస్తున్నాయి, దగ్గర దూరాలకు తిరిగే వాళ్లను టెన్షన్ పెట్టడం లేదు. భారత ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాల మౌలిక సదుపాయాలను పెంచడంపై సీరియస్‌గా దృష్టి పెట్టింది.





















