Stock Market: స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తారా?, ఎన్ని రకాల ఛార్జీలు కట్టాలో ముందు తెలుసుకోండి
ఏ వ్యక్తి అయినా, షేర్లు కొనాలన్నా లేదా అమ్మాలన్నా బ్రోకింగ్ కంపెనీ ద్వారా లావాదేవీ నిర్వహించాలి.
Stock Market Updates: స్టాక్ మార్కెట్‌లోని ప్రతి ఇన్వెస్టర్/ట్రేడర్ మీద కొన్ని రకాల ఛార్జీలు పడతాయి. ఏ వ్యక్తి అయినా, షేర్లు కొనాలన్నా లేదా అమ్మాలన్నా బ్రోకింగ్ కంపెనీ ద్వారా లావాదేవీ నిర్వహించాలి. ట్రాన్జాక్షన్ సమయంలో.. బ్రోకింగ్ కంపెనీ, స్టాక్ ఎక్సేంజ్, సెబీ, కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ ఛార్జీలు, ఫీజులు, పన్నులు వసూలు చేస్తాయి.
షేర్లు అమ్మే సమయంలో లేదా కొనే సమయంలో ఏ రకమైన ఖర్చులు ఉంటాయన్న విషయాన్ని ప్రతి ఇన్వెస్టర్ తప్పక తెలుసుకోవాలి. అప్పుడే, ఆ లావాదేవీలోని నిజమైన ధర అర్ధం అవుతుంది.
షేర్లు కొనే/అమ్మే సమయంలో వర్తించే ఛార్జీలు, ఫీజులు, పన్నులు (Charges, Fees and Taxes on Stock Market Trading)
బ్రోకరేజ్ రుసుము (Brokerage fee): కాంట్రాక్ట్ విలువ ఆధారంగా లేదా పార్టీల మధ్య కుదిరిన అంగీకారం ప్రకారం ఫ్లాట్ రేట్‌లో స్టాక్ బ్రోకర్ విధించే ఛార్జీ ఇది.
సెక్యూరిటీల లావాదేవీల పన్ను (Securities transaction tax): ఇది శాతం రూపంలో ఉంటుంది, తప్పనిసరిగా చెల్లించాలి. ప్రస్తుతం, డెలివరీ రూపంలో చేసిన ఈక్విటీ షేర్ ట్రేడ్ విలువలో STT రేటు 0.1%గా ఉంది.
స్టాంప్ డ్యూటీ & జీఎస్‌టీ (Stamp Duty & GST): స్టాంప్ డ్యూటీని రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది. జరిగిన లావాదేవీపై బ్రోకరేజ్ శాతం రూపంలో GST (సెంట్రల్ జీఎస్‌టీ & స్టేట్ జీఎస్‌టీ) ఉంటుంది. ప్రస్తుతం, రేటు 9% CGST & 9% SGST వసూలు చేస్తున్నారు.
లావాదేవీ ఛార్జీలు (Transaction charges): షేర్లు కొనుగోలు లేదా అమ్మకం సమయంలో, నిర్దిష్ట రేటుతో సంబంధిత స్టాక్ ఎక్స్ఛేంజ్ ఛార్జీలు విధిస్తుంది. జరిగిన లావాదేవీ మొత్తంలో 0.0002% టర్నోవర్ ఫీజ్‌ను సెబీ (SEBI) తీసుకుంటుంది.
డిపాజిటరీ పార్టిసిపెంట్ ఛార్జీ (Depository participant charges): పెట్టుబడిదారుడి సెక్యూరిటీలను సురక్షితంగా ఉంచడం కోసం డిపాజిటరీ పార్టిసిపెంట్ (NSDL లేదా CDSL) ఈ ఛార్జీలను విధిస్తుంది.
మూలధన లాభాలపై పన్ను (Tax on capital gains): షేర్లను హోల్డ్ చేసిన వ్యవధిని బట్టి, షేర్ల విక్రయంపై 'లాభంపై పన్ను' వర్తిస్తుంది. షేర్లను కొన్న తేదీ నుంచి ఒక సంవత్సరం లోపులో వాటిని తిరిగి అమ్మితే, స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను (STCG) వర్తిస్తుంది. షేర్లను కొన్న తేదీ నుంచి ఒక సంవత్సరం తర్వాత అమ్మితే, దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (LTCG) కట్టాలి.
షేర్ల లావాదేవీలు సమయంలో బ్రోకరేజ్ ఛార్జీలు బ్రోకింగ్ కంపెనీని బట్టి మారుతుంటాయి. ఎక్కడ తక్కువ ఖర్చులు ఉంటాయని మీరు భావిస్తే, ఆ బ్రోకింగ్ కంపెనీ ద్వారా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: సెబీ మాట చద్దన్నం మూట, వినకుంటే కాలేది మీ కడుపే!