Sebi: సెబీ మాట చద్దన్నం మూట, వినకుంటే కాలేది మీ కడుపే!
నకిలీ కంపెనీలు, ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్స్ సంఖ్య వేగంగా పెరుగుతోందని హెచ్చరించింది.
Stock Market Updates: స్టాక్ మార్కెట్‌లో రిటైల్ ఇన్వెస్టర్స్ నుంచి బిగ్ బాయ్స్ వరకు చాలా కేటగిరీ వ్యక్తులు ఉన్నారు, ఎవరి ప్లాన్ ప్రకారం వాళ్లు ట్రేడ్/ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఈ తరహా వ్యక్తులు/సంస్థలు, పక్కవాళ్లను ఇబ్బంది పెట్టకుండా తమ పనేదో తాము చేసుకుంటారు. వీళ్లు కాకుండా.. మార్కెట్‌లో మరో జాతి కూడా ఉంది. పక్కవాడిని అడుగంటా ముంచి, తాము పైకి ఎదగడం ఈ జాతి వ్యక్తులు/సంస్థలు నైజం. మార్కెట్ పండితులు, నిపుణులు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, ట్రేడింగ్ కంపెనీలు, ఫ్లాట్‌ఫామ్స్ రూపంలో ఈ జాతి మనుగడ సాగిస్తోంది. మార్కెట్‌లో ఉన్న అందరూ మోసగాళ్లేనని మేము చెప్పడం లేదు. మోసగాళ్ల కూడా ఉన్నారని చెబుతున్నాం, అర్ధం చేసుకోగలరు.
ఇలాంటి మోసగాళ్లు, మోసపూరిత ఫ్లాట్‌ఫామ్స్ విషయంలో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. సెబీ వద్ద రిజిస్టర్ కాని కంపెనీల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అలాంటి నకిలీ కంపెనీలు, ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్స్ సంఖ్య వేగంగా పెరుగుతోందని హెచ్చరించింది. సెబీలో రిజిస్టర్ అయినట్లు కూడా ఆయా కంపెనీలు/ఫ్లాట్‌ఫామ్స్ చెప్పుకుంటున్నాయని, పెట్టుబడిదార్లు వాటికి దూరంగా ఉండాలని చెబుతూ ఒక అడ్వైజరీని జారీ చేసింది.
పెట్టుబడికి ముందు సొంత పరిశోధన అవసరం
సెక్యూరిటీస్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే ముందు, ప్రతి వ్యక్తి సొంతంగా పరిశోధన చేయాలని సెబీ ఇన్వెస్టర్లను కోరింది. సెబీలో రిజిస్టర్ అయినట్లు క్లెయిమ్ చేస్తున్న కంపెనీలను గురించి కూడా తనిఖీ చేయాలని చెప్పింది. సెబీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి తనిఖీ చేస్తే, ఆ కంపెనీ/ఫ్లాట్‌ఫామ్ నిజంగానే రిజస్టర్ అయిందో, లేదో తెలుస్తుంది. సెబీని సంప్రదించడం ద్వారా కూడా ఒక కంపెనీ/ఫ్లాట్‌ఫామ్ గురించి వివరాలు తెలుసుకోవచ్చు. నకిలీ కంపెనీ/ఫ్లాట్‌ఫామ్‌పై సెబీ ఎలాంటి చర్య తీసుకుంటుందో కూడా పెట్టుబడిదార్లు తెలుసుకోవాలి.
కొసరు కోసం వెళ్తే అసలు ఆవిరవుతుంది
అధిక రాబడి వస్తుందని అత్యాశ పడితే, పెట్టుబడి పెట్టిన డబ్బును కూడా కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని సెబీ తన అడ్వైజరీలో పేర్కొంది. అధిక రాబడికి హామీ ఇచ్చే కంపెనీలను అస్సలు నమ్మొద్దని గట్టిగా చెప్పింది. అలాంటి క్లెయిమ్‌లు చేసే కంపెనీలు మీ కష్టార్జితాన్ని వృథా చేస్తాయని స్పష్టం చేసింది. అంటే, అవి ఇన్వెస్టర్లను మోసం చేస్తున్నాయి. సెబీ నిబంధన ప్రకారం, సెక్యూరిటీస్ మార్కెట్‌లో స్థిరమైన రాబడికి ఏ కంపెనీ/ఫ్లాట్‌ఫామ్ కూడా హామీ ఇవ్వకూడదు.
మార్కెట్‌లోని కొన్ని కంపెనీలు/ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు, తమకు సెబీ గుర్తింపు ఉన్నట్లు నకిలీ సర్టిఫికేట్‌లను చూపించి ప్రజలను మోసం చేస్తున్నాయని నియంత్రణ సంస్థ గుర్తించింది. ఇలాంటి కంపెనీలు/ఫ్లాట్‌ఫామ్‌లు మొదట ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటాయి. ఆ తర్వాత.. అధిక రాబడి వచ్చే మార్గాలున్నాయంటూ అరచేతిలో స్వర్గం చూపిస్తాయి. ఎక్కువ ఆదాయం సంపాదించి పెడతామంటూ హామీ కూడా ఇస్తాయి. మార్కెట్‌లో ఎంత రిటర్న్ వస్తుందో ఎవరూ అంచనా వేయలేరు కాబట్టి, అలాంటి తప్పుడు క్లెయిమ్‌ల ఆధారంగా ఇన్వెస్ట్ చేయవద్దని సెబీ సూచించింది.
సెబీలో రిజిస్టర్ అయిన కంపెనీల్లో మాత్రమే పెట్టుబడి
పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, తెలివిగా పెట్టుబడి పెట్టాలని సెబీ ఇన్వెస్టర్లను కోరింది. పూర్తిగా పరిశోధన చేసిన తర్వాత, సెబీలో రిజిస్టర్ అయిన కంపెనీల్లో మాత్రమే డబ్బును పెట్టుబడి పెట్టాలని చెప్పింది. ఈ మార్గదర్శకాలను పాటిస్తే పెట్టుబడిదార్లు మోసపోరని స్పష్టం చేసింది.
మరో ఆసక్తికర కథనం: గోల్డ్ ఈటీఎఫ్‌ల మీద జనం మోజు, ఒక్క నెలలోనే 7 రెట్లు పెరిగిన డబ్బు