Budget 2025: కొత్త పన్ను విధానం Vs పాత పన్ను విధానం - బడ్జెట్ ముందు వీటి తేడాలు తెలుసుకోండి
Income Tax Budget 2025: భారత ప్రభుత్వం పాత & కొత్త పన్ను విధానాల కింద వ్యక్తిగత పన్ను చెల్లింపుదార్లకు కొన్ని ప్రత్యేక రాయితీలు ఇచ్చింది, దీని లక్ష్యం ఆదాయ పన్ను భారాన్ని తగ్గించడం.

New Tax System Vs Old Tax System: 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను, ఫిబ్రవరి 01న, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) సమర్పించబోతున్నారు. ఈ బడ్జెట్‌లో, కేంద్ర ప్రభుత్వం, దేశ ఆర్థిక విధానాల బ్లూప్రింట్‌ను వెల్లడిస్తుంది. పన్ను చెల్లింపుదార్లు ఈసారి బడ్జెట్‌పై అధిక అంచనాలతో ఉన్నారు. పన్ను రేట్లు, రాయితీలు & మినహాయింపులపై ప్రకటనల కోసం ఎదురు చూస్తున్నారు.
పాత ఆదాయ పన్ను విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ఫిబ్రవరి 01న ఆర్థిక మంత్రి ప్రకటించవచ్చన్న చర్చ కూడా జరుగుతోంది. గత కొన్నేళ్లుగా, భారతీయ పన్నుల విధానంలో చాలా కీలక మార్పులు వచ్చాయి. ప్రస్తుతం, మన దేశంలో రెండు ఆదాయ పన్ను వ్యవస్థలు ఉన్నాయి. సంప్రదాయంగా వస్తున్న పాత పన్ను విధానానికి ప్రత్యామ్నాయంగా, 2020లో, కేంద్ర ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ డేటా ప్రకారం, ఆదాయ పన్ను పత్రాలు దాఖలు చేస్తున్న వ్యక్తిగత పన్ను చెల్లింపుదార్లలో 73 శాతం మంది కొత్త పన్ను విధానాన్ని అనుసరిస్తున్నారు.
బడ్జెట్ రానున్న నేపథ్యంలో, పాత & కొత్త పన్ను వ్యవస్థల మధ్య తేడాలు & మీ ఆదాయంపై చూపే ప్రభావాన్ని అర్ధం చేసుకోవడం ముఖ్యం.
పాత పన్ను విధానం:
- రూ.5 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేదు.
- ఆదాయ పన్ను చట్టంలో సెక్షన్ 80C కింద, రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడులను మీ మొత్తం ఆదాయం నుంచి తీసివేయవచ్చు. తద్వారా పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం తగ్గుతుంది. ఉదాహరణకు, మీ ఆదాయం రూ.6 లక్షలు & మీరు రూ. 1.5 లక్షలను 80C కింద పెట్టుబడి పెడితే, పన్ను పరిధిలోకి వచ్చే మీ ఆదాయం రూ.4.50 లక్షలు అవుతుంది, మీరు పను చెల్లించాల్సిన అవసరం లేదు.
- ఒకవేళ, మీ వార్షికాదాయం రూ. 6.50 లక్షల వరకు ఉన్నా మీరు పన్ను నుంచి పూర్తి మినహాయింపు పొందవచ్చు. రూ. 5 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేదు & సెక్షన్ 80C కింద రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడిపై మినహాయింపు లభిస్తుంది. అంటే మీ రూ. 6.50 లక్షల ఆదాయంపై ఎలాంటి పన్ను ఉండదు.
పాత పన్ను విధానంలో స్లాబ్ రేట్లు
- రూ. 2.50 లక్షల వరకు ఆదాయంపై పూర్తిగా పన్ను మినహాయింపు
- రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల మధ్య ఆదాయంపై 5% పన్ను
- రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్య ఆదాయంపై 20% పన్ను
- రూ. 10 లక్షల కంటే ఎక్కువ ఆదాయంపై 30% పన్ను
- సీనియర్ సిటిజన్ (60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు) కొన్ని అదనపు తగ్గింపులు పొందవచ్చు
పాత పన్ను విధానం వల్ల ప్రయోజనం
పాత పన్ను విధానంలో, మీ ఖర్చులను లెక్కించడంలో మీకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. మీ ఆదాయాన్ని ప్లాన్ ప్రకారం ఖర్చు చేస్తే, పన్ను ఆదా చేయడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. కానీ ఇది సంక్లిష్టమైన ప్రక్రియ & అందరికీ సులంభంగా అర్థం కాదు.
కొత్త పన్ను విధానం:
కొత్త పన్ను విధానం పాత పన్ను స్లాబ్‌లకు భిన్నంగా ఉంటుంది. తక్కువ రేట్లతో ఎక్కువ స్లాబ్‌లు ఉన్నాయి.
కొత్త పన్ను విధానంలో స్లాబ్ రేట్లు
రూ. 3 లక్షల వరకు ----- పన్ను లేదు
రూ. 3 లక్షల నుంచి రూ. 6 లక్షల మధ్య ఆదాయంపై 5% పన్ను
రూ. 6 లక్షల నుంచి రూ. 9 లక్షల మధ్య ఆదాయంపై 10% పన్ను
రూ. 9 లక్షల నుంచి రూ. 12 లక్షల మధ్య ఆదాయంపై 15% పన్ను
రూ. 12 లక్షల నుంచి రూ. 15 లక్షల మధ్య ఆదాయంపై 20% పన్ను
రూ. 15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే 30% పన్ను
కొత్త & పాత పన్ను విధానాల మధ్య తేడా ఏంటి?
టాక్స్ స్లాబ్‌లు - పాత విధానంలో, తక్కువ పన్ను స్లాబ్‌లు & ఎక్కువ రేట్లు ఉన్నాయి. కొత్త విధానంలో పన్ను శ్లాబులు ఎక్కువగా ఉన్నాయి & రేట్లు తక్కువగా ఉంటాయి.
మినహాయింపులు & పెట్టుబడులు - పాత విధానంలో, సెక్షన్ 80C కింద రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడులపై పన్ను మినహాయింపు పొందవచ్చు. కొత్త సిస్టమ్‌లో అలాంటి మినహాయింపులు లేవు. కానీ తక్కువ పన్ను స్లాబ్‌ల కారణంగా మీ పన్ను రేటు తగ్గుతుంది.
పన్ను దాఖలు చేయడం సులభం - కొత్త వ్యవస్థలో పన్ను దాఖలు చేయడం సులభం. ఇందులో మీరు ఎలాంటి పెట్టుబడి లేదా వ్యయానికి సంబంధించిన లెక్కలు సమర్పించాల్సిన అవసరం లేదు. పాత విధానంలో, మీ పెట్టుబడులు & ఖర్చుల వివరాలు ఇవ్వాలి, ఇది కొంచెం గజిబిజిగా ఉంటుంది.
పన్ను రేట్లు - పాత విధానంలో, పన్ను రేట్లు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. కొత్త విధానంలో పన్ను రేట్లు తక్కువగా ఉండగా, రూ. 3 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేదు, రూ. 6 లక్షల వరకు ఆదాయంపై కేవలం 5% పన్ను మాత్రమే.
ఫ్లెక్సిబిలిటీ- పాత విధానంలో, వివిధ పెట్టుబడులు & ఖర్చుల ద్వారా పన్నును తద్వారా మీ ఆదాయాన్ని ఆదా చేసుకోవచ్చు. కొత్త వ్యవస్థలో ఈ సౌలభ్యం లేదు. కానీ. పన్ను స్లాబ్‌లలో తగ్గింపు కారణంగా పన్ను తక్కువ పడుతుంది.
ఏ పన్ను స్లాబ్‌ను ఎంచుకోవడం ప్రయోజనకరం?
మీ ఆదాయం, ఖర్చులు & పెట్టుబడి పద్ధతులపై ఇది ఆధారపడి ఉంటుంది. మీ ఆదాయం తక్కువగా ఉంటే & పన్ను ఆదా చేసే ఎలాంటి పెట్టుబడి లేకపోతే, కొత్త పన్ను విధానం అతనికి ప్రయోజనకరంగా ఉంటుందని టాక్స్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. మీరు పన్ను ఆదా చేయడానికి PPF, ELSS, NPS లేదా ఇతర పథకాలలో పెట్టుబడి పెడితే, పాత పన్ను విధానాన్ని ఎంచుకోవడం సమంజసం. ఇందులో, పన్ను మినహాయింపుల ద్వారా ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు.
మరో ఆసక్తికరక కథనం: ఆదాయ పన్ను పూర్తిగా రద్దు, రూ.కోట్లు సంపాదించినా నో టాక్స్ - ఈ రాష్ట్ర ప్రజలకు బంపర్ ఆఫర్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

