Telangana News: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, వారికి సైతం సమానంగా చెల్లింపు
Telangana Employees | తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. రెగ్యూలర్ ఉద్యోగులతో పాటు సహకార సొసైటీలు, యూనివర్సిటీ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులకు సమానంగా ఐఆర్ ఇవ్వాలని నిర్ణయించారు
Telangana govt announces grant of IR to Employees | హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్నిరోజులుగా ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లతో సమానంగా సహకార సొసైటీలు, ప్రభుత్వ రంగ సంస్థలు, యూనివర్సిటీ ఉద్యోగులకు ఐఆర్/మధ్యంతర భృతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మూల వేతనంపై 5 శాతం ఐఆర్ (మధ్యంతర భృతి) మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
మధ్యంతర భృతి విడుదల చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు
ప్రభుత్వ రంగ సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం మధ్యంతర భృతి (ఐఆర్) విడుదల చేయడం పట్ల ప్రభుత్వ రంగ ఉద్యోగుల సమాఖ్య తరఫున అధ్యక్షుడు బాలకృష్ణ , వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం గోపికృష్ణ, ప్రధాన కార్యదర్శి జీవన్ హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం వలే కాకుండా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ భృతి విడుదల చేయడంపై వీరు ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ఏమాత్రం పట్టించుకోలేదని , ప్రస్తుత ప్రభుత్వం ఈ రకంగా ఆదరించడం తమకు ఆనందం కలిగించిందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Also Read: Lagacharla Land Acquisition:: లగచర్ల భూసేకరణ రద్దు- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
కాగా, తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు కచ్చితంగా భర్తీ చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు. ఆరు గ్యారంటీలతో పాటు ఉద్యోగాల భర్తీ లాంటి కీలక హామీలు ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణలో తొలిసారి అధికారం చేపట్టింది. అయితే తమ పాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన విజయోత్సవాలు జరుపుతోంది. కానీ ఎన్నికల హామీ ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిషికేషన్ల ఉద్యోగాలు, తాము నిర్వహించిన పరీక్షల ఫలితాలు విడుదల చేయడం తప్పా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు చేసిందేమీ లేదని ఆరోపిస్తున్నారు.