Lagacharla Land Acquisition:: లగచర్ల భూసేకరణ రద్దు- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Lagacharla News Today: లగచర్ల వివాదంలో ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంది. భూసేకరణ నోటిఫికేష్ ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది.
Telangana Latest News: తెలంగాణ రాజకీయాల్లో కాక రేపిన లగచర్ల భూ వివాదంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూసేకరణ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం వికారాబాద్ జిల్లా లగచర్ల దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అక్కడ పారిశ్రామిక వాడ నిర్మించాలని భావించిన ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. దీన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు.
ప్రజల అభిష్ఠాం మేరకు లగచర్లలో భూసేకరణ ప్రకటన వెనక్కి తీసుకున్నట్టు ప్రభుత్వం చెప్పింది. దీని కోసం ఇచ్చిన నోటిఫికేషన్ వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. దీని వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉన్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిన్న దిలావర్పూర్ ఇథనాల్ పరిశ్రమ పనులు నిలిపివేత నేడు లగచర్లలో భూసేకరణ నోటిఫికేషన్ రద్దు అషామాషీగా చేసిందికాదనే టాక్ వినిపిస్తోంది. ప్రతిపక్షాల వద్ద ఉన్న అస్త్రాలను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసిందని అంటున్నారు.
వ్యూహాత్మక అడుగు
త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. దీన్నే ప్రధానాస్త్రంగా ప్రతిపక్షం మార్చుకోనుందని గ్రహించిన ప్రభుత్వం ముందుగానే వారికి వాయిస్ లేకుండా చేయడానికే ఇలా చేసిందని అంటున్నారు. అంతే కాకుండా ఈ లగచర్ల విషయంలో ముఖ్యమంత్రి ఫ్యామిలీపైనే ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి వాటిన్నిటికి ఒక్క దెబ్బకు ఈ నోటిఫికేషన్ రద్దుతో ప్రభుత్వం సమాధానం చెప్పిందని అంటున్నారు.
లగచర్లలో అసలేం జరిగింది... ఎందుకు వివాదం జాతీయ స్థాయికి వెళ్లింది
భూసేకరణ విషయంపై చర్చించేందుకు రావాలని స్థానికులు పిలుపు మేరకు వెళ్లిన జిల్లా కలెక్టర్ ఇతర సిబ్బందిపై ప్రజలు దాడి చేయడంతో వివాదం మరో మలుపు తిరిగింది. అప్పటి వరకు శాంతియుత ధర్నాలకు పరిమితమైన ప్రజలు ఇలా దాడి చేయాన్ని ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకుంది. అధికారులపై దాడి చేసిన వారిపై అరెస్టు చేసింది.
ఈ దాడి కుట్ర పూరితంగా జరిగిందని ఇందులో బీఆర్‌ఎస్ నేతలు భాగమై ఉన్నారని పోలీసుల విచారణలో తేలింది. సురేష్ అనే వ్యక్తి పదే పదే అధికారులను పిలిచింది దాడి చేయించడానికేనని గుర్తించారు. అతని కాల్ రికార్డ్స్ పరిశీలించిన పోలీసులు ఇందులో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్ర పాత్ర ఉన్నట్టు తేల్చారు. పట్నం నరేంద్రను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. ప్రథమ ముద్దాయిగా ఉన్న సురేష్ కోసం మూడు రోజుల పాటు గాలించారు. చివరకు సురేష్ ఓ రోజు న్యాయమూర్తి ముందు లొంగిపోయారు. ఇప్పుడు ఈ కేసు విచారణ వేగంగా సాగుతోంది. కేసులో అరెస్టు అయిన వారంతా జైలులో ఉన్నారు. నరేంద్రపై నమోదు అయిన మూడు కేసుల్లో రెండింటిని హైకోర్టు కొట్టేసింది.
దీనిపై బీఆర్‌ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో పోరుబాట పట్టింది. జాతీయ ఫోరమ్‌లకు ఫిర్యాదు చేసింది. వివిధ సంఘాలను ఇక్కడకు రప్పించి మరీ పరిస్థితి అంచనా వేయాలని సూచించింది. లగచర్ల బాధితులు, బీఆర్‌ఎస్ నేతల ఫిర్యాదులో జాతీయ సంఘాలు కూడా కదిలాయి. ఇక్కడకు వచ్చి బాధితుల గోడు విన్నాయి.
Also Read: అధికారులపై దాడి కేసులో కీలక పరిణామం, లొంగిపోయిన కీలక నిందితుడు - 14 రోజులపాటు రిమాండ్