Posani Krishna Murali Remand: పోసానికి 14 రోజుల రిమాండ్, రాజంపేట సబ్ జైలుకు తరలించిన పోలీసులు
Actor Posani Krishna Murali Remand News | టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు ఆయనను రాజంపేట సబ్ జైలుకు తరలించారు.

14 days remand for Actor Posani Krishna Murali | రైల్వే కోడూరు: టాలీవుడ్ నటుడు, వైసీపీ సానుభూతిపరుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు రాజంపేట సబ్ జైలుకు తరలించారు. కులాలు, రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టేలా గతంలో కామెంట్లు చేసిన కేసులో అరెస్ట్ అయిన పోసానికి అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు కోట్లు రెండు వారాల రిమాండ్ విధించింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఇరువైపుల వాదనలు కొనసాగాయి.
బీఎన్‌ఎస్ చట్టం (BNS ACT) ప్రకారం పోసానికి 41ఏ నోటీసులు ఇచ్చి బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అందుకు మేజిస్ట్రేట్ నిరాకరించి, 14 రోజుల రిమాండ్ విధించారు. మార్చి 12 వరకు రిమాండ్ లో ఉండనున్నారు. మేజిస్ట్రేట్ రిమాండ్ విధించిన అనంతరం పోలీసులు పోసానిని రాజంపేట సబ్ జైలుకు తరలించారు. పోసానిని తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.
పోసానిపై కేసు నమోదు, హైదరాబాద్‌లో అరెస్ట్
అన్నమయ్య జిల్లాలోని ఓబులవారిపల్లి మండలం కొర్లకుంటకు చెందిన జనసేన నేత జోగినేని మణి నటుడు పోసానిపై ఫిబ్రవరి 24న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కులాలు, సామాజికవర్గాలు, రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా కామెంట్లు చేశారంటూ పోసానిపై జనసేన నేత ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఆయనపై బీఎన్ఎస్ చట్టం 196, 353(2), 111 రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పోసానిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఏపీకి తరలించి, అన్నమయ్య జిల్లాలోని ఓబులవారిపల్లె పోలీస్‌స్టేషన్‌కు తరలించడం తెలిసిందే. అరెస్ట్ సమయంలో పోలీసులతో పోసాని వాగ్వాదానికి దిగారు. మీరు పోలీసులు అని గ్యారంటీ ఏంటి, ఈ సమయంలో ఎలా వస్తారు అని ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్లి నిందితులను అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉందని వారు స్పష్టం చేశారు.






















