Telangana Crime News: హోటల్‌లో కుక్కను తరుముతూ వెళ్లిన యువకుడు- మూడో అంతస్తు నుంచి పడి దుర్మరణం
Telangana News: హైదరాబాద్‌లో కుక్కను తరుముతూ ఓ యువకుడు హోటల్‌లోని మూడో అంతస్తు నుంచి పడిపోయి చనిపోయాడు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Hyderabad News: హైదరాబాద్‌లో కుక్కను తరుముతూ ఓ యువకుడు ఎత్తైన భవనంపై నుంచి దూకేశాడు. అంత ఎత్తు నుంచి పడటంతో మృతి చెందాడు. హైదరాబాద్‌లోని చందానగర్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. తెనాలి 23 ఏళ్ల ఉదయ్ రామచంద్రాపురంలోని అశోక్‌నగర్‌లో ఉంటున్నాడు. ఆదివారం స్నేహితులతో కలిసి చందానగర్‌లోని వీవీప్రైడ్ హోటల్‌లో దిగాడు.
మూడో అంతస్తులోని బాల్కనీలో తిరుగుతుండగా కుక్క కనిపించింది. దాన్ని చూసి వెంటపడ్డాడు ఉదయ్. అతన్ని చూసిన కుక్క భయంతో పరుగులు తీసింది. దాన్ని ఆట పట్టించిన ఆ యువకుడు అలా తరుముతూ వెళ్లాడు. కుక్క తెలివిగా కుడివైపునకు తిరిగింది. అయితే వేగంగా పరుగెడుతూ వెళ్లిన ఉదయ్ సడెన్‌గా ఆగలేకపోయాడు. పక్కకి కూడా తిరగలేకపోయాడు. పరుగెడుతూనే కిటికీ నుంచి బయటకు పడిపోయాడు.
అలా కిటికిలో నుంచి బయటకు దూకేసి ఉదయ్ కింద పడిపోయాడు. మూడు అంతస్తుల నుంచి దూకడంతో రక్తపు మడుగులో పడి మరణించాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ విషయం ఆదివారం రాత్రి జరిగినప్పటికీ బయటకు రాకుండా హోటల్ నిర్వాహకులు జాగ్రత్త పడ్డారు. ఉదయ్ స్నేహితులు బయటకు చెప్పడంతో విషయం బయటపడింది. దీంతో రియాక్ట్ అయిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.