Rudrankksh Patil World Record: శెభాష్ రుద్రాంక్ష్ పాటిల్- షూటింగ్ లో ప్రపంచ రికార్డు.. సీనియర్ విభాగంలో మెరిసిన తెలంగాణ షూటర్
జాతీయా జూనియర్ షూటింగ్ చాంపియన్ షిప్ లో సంచలనం నమోదైంది. యువ షూటర్ రుద్రాంక్ష్ ప్రపంచ రికార్డుతో మెరిశాడు. సీనియర్ విభాగంతో తెలంగాణ ప్లేయర్ కు రజతం దక్కింది.

Shooting News: మహారాష్ట్రకు చెందిన యువ షూటర్ రుద్రాంక్ష్ పాటిల్ సత్తా చాటాడు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో జరిగిన జాతీయ షూటింగ్ చాంపియన్ షిప్ లో అదరగొట్టాడు. ప్రపంచ రికార్డు స్కోరుతో పసిడి పతకాన్ని ఎగరేసుకు పోయాడు. తాజాగా జరిగిన 10మీ. ఎయిర్ రైఫిల్ ఫైనల్లో 254.9 పాయింట్లతో టాప్ లేపాడు. దీంతో చైనాకు చెందిన షెంగ్ లిహావో (254.2 పాయింట్లు) పేరుతో ఉన్న జూనియర్ వరల్డ్ రికార్డు కనుమరుగై పోయింది. ఇదే విభాగంలో కర్ణాటకు చెందిన అభిషేక్ శేఖర్ (251.4 పాయింట్లు) సెకండ్ ప్లేస్ తో సిల్వర్ మెడల్, హర్యానాకు చెందిన హిమాంశు (229.9 పాయింట్లు) మూడో స్థానం పొంది కాంస్య పతకాన్ని సాధించారు. మరోవైపు జూనియవర్ విభాగంలో పసిడి పతకాన్ని ప్రపంచ రికార్డుతో కొల్లగొట్టిన రుద్రాంక్ష్ ను అందరూ అభినందిస్తున్నారు.
తెలంగాణ షూటర్ శ్రీకాంత్ కు రజతం..
మరోవైపు ఇదే చాంపియన్ షిప్ లో పది మీటర్ల ఎయిర్ రైఫిల్ సీనియర్ విభాగంలో పోటీ పడిన తెలంగాణ షూటర్ శ్రీకాంత్ కు లక్కు కలిసి రాలేదు. త్రుటిలో అతను బంగారు పతకాన్ని కోల్పోయాడు. ఈ మ్యాచ్ లో 252.3 పాయింట్లతో శ్రీకాంత్ రెండోస్థానంలో నిలిచాడు. తొలుత పోటీల్లో ఆదిపత్యం ప్రదర్శించిన శ్రీకాంత్.. తర్వాత దశల్లో పట్టు విడువడంతో రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఈ విభాగంతో సాహు తుషార్ గోల్డెన్ మెడల్ కైవసం చేసుకున్నాడు. 252.3 పాయింట్ల తేడాతో టాప్ ర్యాంకు దక్కించుకున్నాడు. రెండోస్థానంలో ఉన్న శ్రీకాంత్ కు, అతనికి మధ్య తేడా కేవలం 0.1 పాయింట్లే కావడం గమనార్హం. రైల్వేస్ కి చెందిన తుషార్ కి ఇదే తొలి సినియర్ టైటిల్ కావడం విశేషం. రాజస్థాన్ కు చెందిన యశోవర్ధన్ (230 పాయింట్లు) కాంస్య పతకాన్ని సాధించాడు.
ఒలింపిక్స్ లో ఆడిన విలువ లేదు..
మరోవైపు సీనియర్ షూటర్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజతే మనూ భాకర్ వివాదం కొత్త ములుపు తిరిగింది. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకు మనూ అప్లై చేసిందని ఆమె తండ్రి రామ్ కిషన్ తెలిపారు. ఒలింపిక్స్ లో ఆడిన విలువుండదని, మెగాటోర్నీలో రెండు పతకాలు సాధించినప్పటికీ ఖేల్ రత్న పురస్కారానికి మనూను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం కోసం విజయాలు సాధిస్తూ, గుర్తింపు కోసం దేవురించాల్సిన పరిస్థితి దాపురించిందని స్పందించారు. రెండు మూడేళ్లుగా ప్రతిష్టాత్మక పద్మశ్రీ, పద్మ భూషణ్, ఖేల్ రత్న పురస్కారాల కోసం మనూ ధరఖాస్తు చేస్తూనే ఉందని, అయినా తనను పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. ఒకవేళ ఈ ఏడాది మను అప్లై చేయకపోయినప్పటికీ, కేంద్ర క్రీడా శాఖ కమిటికీ ప్రతిపాదించాల్సిందని వాపోయారు.
మరోవైపు ఖేల్ రత్న పురస్కారానికి తుది ప్రతిపాదనల జాబితా రెడీ కాలేదని, అందులో ఆమె పేరు ఉంటుందని లీకులిస్తూ కేంద్ర క్రీడా శాఖ నష్ట నివారణ చర్యలకు దిగినట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు వచ్చిన ప్రతిపాదనలపై కేంద్ర క్రీడామంత్రి మన్సూఖ్ మాండవీయ నిర్ణయం తీసుకుంటున్నారని మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఇక పురస్కారాల కోసం ఏర్పాటు చేసిన కమిటీకి సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ వి. రామసుబ్రమణ్యన్ నాయకత్వం వహిస్తుండగా, మొత్తం 12 మంది సభ్యులు ఉన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

