Ruturaj Gaikwad: టెస్ట్ సిరీస్ నుంచి రుతురాజ్ అవుట్, అతని స్థానంలో ఎవరంటే?
Ruturaj Gaikwad: దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో గాయపడిన రుతురాజ్ గైక్వాడ్ గాయం తీవ్రత కారణంగా టెస్టు సిరీస్ నుంచి కూడా వైదొలిగినట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో గాయపడిన రుతురాజ్ గైక్వాడ్ గాయం తీవ్రత కారణంగా టెస్టు సిరీస్ నుంచి కూడా వైదొలిగినట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. చేతి వేలికి గాయం కారణంగా రుతురాజ్ గైక్వాడ్ రెండు టెస్టుల సిరీస్ నుంచి వైదొలిగాడని స్పష్టం చేసింది. రుతురాజ్ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని... అతనికి విశ్రాంతి అవసరమని బీసీసీఐ వెల్లడించింది. రుతురాజ్ గైక్వాడ్ దక్షిణాఫ్రికా నుంచి తిరిగి భారత్‌కు వస్తాడని... జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుంటాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో బెంగాల్ ప్లేయర్ అభిమన్యు ఈశ్వరన్‌ను జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, బెంగాల్ క్రికెటర్ అభిమన్యు ఈశ్వరన్ ఎన్నో ఏళ్లుగా టీమిండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్నారు. రుతురాజ్ గైక్వాడ్ టెస్ట్ సిరీస్‌కు దూరం కావడంతో ఈశ్వరర్‌కు లక్కీగా ఛాన్స్ వచ్చింది. సర్ఫరాజ్‌కు మాత్రం మరోసారి మొండిచేయే ఎదురైంది.
తాజాగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.దక్షిణాఫ్రికా నుంచి ఆకస్మికంగా తిరిగి భారత్‌కు వచ్చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ‘ఫ్యామిలీ ఎమర్జెన్సీ’ కారణంగా కోహ్లీ సౌతాఫ్రికా నుంచి భారత్‌కు వచ్చినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్ 26 నుంచి మొదలయ్యే మొదటి టెస్టు నాటికి కోహ్లీ జట్టుతోపాటు చేరే అవకాశం ఉంది. ఇప్పటికే గాయాలు భారత జట్టును వేధిస్తుండగా ఇప్పుడు మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఇప్పటికే గాయం కారణంగా స్టార్ పేసర్ మహ్మద్ షమీ టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. షమీ జట్టుకు దూరమైన కొన్ని రోజులకే టీం ఇండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇషాన్ కిషన్ టెస్ట్ జట్టు నుంచి తప్పుకున్నాడు. ఇప్పటికే రెండు టెస్టు మ్యాచ్ సిరీస్ కోసం ఎంపికైన భారత ఆటగాళ్లు దక్షిణాఫ్రికా వెళ్లారు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్ ఆటగాళ్లు జస్‌ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, నవదీప్ సైనీ, హర్షిత్ రాణా దక్షిణాఫ్రికాలో ఉన్నారు.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌లో భాగంగా దక్షిణాఫ్రికా జట్టుతో భారత్ రెండు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ రెండు మ్యాచుల్లో గెలుపొందడం భారత్‌కు చాలా కీలకం. అయితే.. దక్షిణాఫ్రికా గడ్డపై భారత జట్టు ఇంత వరకు టెస్టు సిరీస్ గెలవలేదు. ఈ సారి అయిన అందని ద్రాక్షగా ఉన్న సిరీస్‌ను సొంతం చేసుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఇలాంటి సమయంలో సూపర్ ఫామ్‌లో ఉన్న షమీ సిరీస్‌కు దూరం అయితే నిజంగానే టీమ్ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లే. సఫారీ గడ్డపై తొలి టెస్టు డిసెంబర్ 26 నుంచి 30 వరకు సెంచూరియన్ వేదికగా, రెండో టెస్టు జవనరి 3 నుంచి 7 వరకు కేప్‌టౌన్ వేదికగా జరగనుంది.
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు టీమిండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, అభిమన్యు ఈశ్వరన్.