Encounter in Karregutta: తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టలో ఎన్కౌంటర్- ఏజెన్సీనీ అధీనంలోకి తీసుకున్న భద్రత బలగాలు
Encounter in Karregutta:ములుగు జిల్లాకు సమీపంలో ఉన్న కర్రెగుట్టలో మావోయిస్టుల పని పట్టేందుకు భద్రతా బలగాలు సిద్ధమయ్యాయి. మరికొన్ని గంటల్లోనే భారీ యాక్షన్ సీన్ జరగే సూచనలు కనిపిస్తున్నాయి.

Encounter in Karregutta: తెలంగాణ, ఛత్తీస్‌గడ్, మహారాష్ట్రకు సరిహద్దుగా ఉన్న కర్రెగుట్టలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. కేంద్రబలగాలు,మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. దీన్ని అధికారులు ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది. ఇక్కడ కీలకమైన మావోయిస్టు అగ్రనేతలు తలదాచుకున్నారనే సమాచారంతో భద్రతా దళాలు నిఘా పెట్టి ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు.
తెలంగాణ, ఛత్తీస్‌గడ్, మహారాష్ట్రకు సరిహద్దుగా ఉన్న వెంకటాపురం, వాజేడు ఏజెన్సీ ఇప్పుడు భద్రతాబలగాల ఆధీనంలోకి వెళ్లిపోయింది. చాలా కాలంగా ఈ కర్రెగుట్టపై ల్యాండ్‌మైన్స్ పేలుతున్నాయి. ఆ ప్రాంతానికి వెళ్లాలంటేనే భద్రతా బలగాలు భయపడే పరిస్థితికి వచ్చింది. వ్యూహం మార్చిన భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. వెంకటాపురం మండలంలోని గుట్ట సమీపంలో ఉండే గ్రామాల్లోకకి బలగాలు చేరుకున్నాయి.
ఆపరేషన్ కగార్‌లో భాగంగా భద్రతాదళాలు రెండు రోజుల నుంచి కర్రెగుట్ట లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇక్కడ హిడ్మా మడవి దళం సభ్యులు ఉన్నారని సమాచారం తెలుసుకున్న అధికారులు కూంబింగ్ నిర్వహించారు. కోబ్రా, డిఆర్జి,బస్టర్ ఫైటర్స్ అందరూ ఇక్కడ మాటు వేసి ఈ ప్రాంతాన్ని పూర్తిగా అష్టదిగ్బంధం చేశారు.
ఈ కర్రెగుట్ట వైపునకు బలగాలు రాకుండా ఉండేందుకు మావోయిస్టులు చుట్టుపక్కల మందుపాత్రలు పెట్టారు. ఇవి తరచూ పేలుతున్న ఘటనలు చూసిన బలగాలు వాటిని నిర్వీర్యం చేస్తూ ముందుకు సాగుతున్నాయి. రోజుల తరబడి ఇక్కడ ఆపరేషన్‌లో ఉన్న సిబ్బందికి హెలికాప్టర్ ద్వారా ఫుడ్, వాటర్, మెడిసన్ సప్లై చేస్తున్నారు. ఈ ప్రాంతంలోనే చాలా మంది మావోయిస్టులు తలదాచుకుంటున్నారని సమాచారం అందుతోంది. అందుకే పూర్తిగా ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకోవాలని పంతంతో భద్రతా దళాలు ఆపరేషన్ సాగిస్తున్నాయి.
కర్రెగుట్టలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారాన్ని ముందుగానే తెలుసుకున్న బలగాలు అటుగా ఎవర్నీ వెళ్లనీయకుండా కట్టడి చేశారు. మావోయిస్టులకు మందులు, నీళ్లు, ఆహారం సరఫరా కాకుండా చేశారు. దాదాపు ఐదారు రాష్ట్రాల నుంచి బలగాలు ఈ ఆపరేషన్‌లో పని చేస్తున్నాయి. భారీ సంఖ్యలో బలగాలు అన్ని వైపుల నుంచి చుట్టు ముడితే తప్పించుకునే మార్గం మావోయిస్టులకు లేదని అధికారులు భావిస్తున్నారు. మరికొన్ని గంటల్లోనే కర్రెగుట్టలో ఉన్న మావోయిస్టుల వద్దకు చేరుకుంటామని అధికారులు చెబుతున్నారు.





















