![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Kurma Jayanti 2022 : ఈ ఆలయం నుంచి వారణాసికి సొరంగ మార్గం! ఇక్కడ పుష్కరిణిలో అస్తికలు కలిపితే గంగలో కలిపినట్టే!
ఆలయంలో కొలువైన స్వామివారి మొదలు శిల్పాలు, గోడలపై చిత్రాలు, పుష్కరిణి వరకూ అణువణువూ ప్రత్యేకమే. పితృకార్యాలు చేసేందుకు కాశీతో సమానమైన క్షేత్రంగా భావిస్తారు. కూర్మజయంతి సందర్భంగా శ్రీకూర్మంపై స్పెషల్ ..
![Kurma Jayanti 2022 : ఈ ఆలయం నుంచి వారణాసికి సొరంగ మార్గం! ఇక్కడ పుష్కరిణిలో అస్తికలు కలిపితే గంగలో కలిపినట్టే! Kurma Jayanti 2022 History siginificance And Interesting Story about SRI KURMAM Temple, know in details Kurma Jayanti 2022 : ఈ ఆలయం నుంచి వారణాసికి సొరంగ మార్గం! ఇక్కడ పుష్కరిణిలో అస్తికలు కలిపితే గంగలో కలిపినట్టే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/23/ce28a52ccb3929e7317528d22b7108dc_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
జ్యేష్ఠ బహుళ ద్వాదశి ( జూన్ 25) రోజు కూర్మ జయంతి
శ్రీ మహా విష్ణువు దశావతారాల్లో రెండోది కూర్మావతారం. ఈ రూపంలో ఉన్న ఏకైక ఆలయం శ్రీకూర్మం. శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి 13 కిలోమీటర్ల దూరంలో ఆముదాలవలస రైల్వేస్టేషన్‌కు 27 కిలోమీటర్ల దూరంలో గార మండలంలో ఉందీ ఆలయం. బ్రహ్మ దేవుడు ప్రతిష్ఠించిన పంచలింగ క్షేత్రంగానూ ఈ ఆలయం ప్రసిద్ధి. ఇంకా ఈ ఆలయంలో మరెన్నో విశిష్టతలున్నాయి. ఎక్కడా లేని విధంగా ఇక్కడ రెండు ధ్వజస్తంభాలు ఉంటాయి. స్వామివారు కూడా పడమటి ముఖంగా ఉండడం మరో ప్రత్యేకత. కూర్మనాథుడి ఆలయంతో పాటు శ్రీరామానుజాచార్యులు, శ్రీ వరద రాజస్వామి, శ్రీ మధ్వాచార్యులు, శ్రీ కోదండరామస్వామి వారి ఆలయాలు కూడా ఈ ప్రాంగణంలోనే ఉంటాయి. పవిత్ర పుష్కరిణి, విశాలమైన ప్రాకారంతో పాటు కూర్మవతారానికి నిజరూపమైన తాబేళ్లు భక్తులకు కనిపిస్తాయి ఇక్కడ.
స్థల పురాణం
పూర్వం దేవ దానవులు అమృతం కోసం క్షీర సాగరాన్ని మధించేటప్పుడు మందర పర్వతాన్ని కవ్వంగా మార్చుకున్నారు. కింద ఎలాంటి ఆధారం లేకపోవడంతో ఆ పర్వతం నిలవలేదు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా తాబేలు అవతారమెత్తి మందర పర్వతానికి ఆధారంగా నిలిచాడని కూర్మ పురాణం చెబుతోంది. ఆ రూపాన్ని బ్రహ్మదేవుడే స్వయంగా శ్రీకూర్మంలో ప్రతిష్ఠించాడని చెబుతారు. ఈ క్షేత్ర ప్రస్తావన పద్మ పురాణం, బ్రహ్మాండ పురాణంలోనూ ఉంది.
Also Read: దొంగతనం, కామశాస్త్రం, వశీకరణం, శకునశాస్త్రం సహా 64 కళలివే
వారణాశి తర్వాత..
పితృ కార్యాలయాలంటే ముందుగా గుర్తొచ్చేది కాశీ. అయితే వారణాసితో సమానంగా ఈ క్షేత్రాన్ని భావిస్తారు. కాశీ వెళ్లలేని వారు చాలామంది శ్రీ కూర్మం క్షేత్రంలోనే పితృకార్యాలు నిర్వహిస్తుంటారు. వారణాసి నుంచి గంగామాత ప్రతి మాఘ శుద్ధ చవితికి ఇక్కడకు వచ్చి శ్వేతపుష్కరిణిలో స్నానమాచరిస్తుందని చెబుతారు. భక్తులు విడిచిన పాపాలను అమ్మవారు ప్రక్షాళన చేస్తారని విశ్వసిస్తారు. అందుకే అంత పవిత్రత ఉన్న పుష్కరిణిలో అస్తికలు కలిపితే పితృదేవతలు కొంతకాలానికి సాలగ్రామ శిలగా మారుతారని నమ్ముతారు. శ్రీకూర్మనాథ స్వామి దేవాలయంలో ఓ సొరంగమార్గం ఉందని..దీనిద్వారా వారణాసి చేరుకోవచ్చంటారు. అయితే ప్రస్తుతం దీన్ని మూసివేశారు.
ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగిందంటే..
శ్రీ కూర్మం ఆలయాన్ని రెండో శతాబ్ధానికి ముందు నిర్మించారని చెబుతారు. కృతయుగంనాటి శాసనాల ఆధారంగా ఈ విషయం తెలుస్తుంది. నిర్మాణ విషయంలో భిన్న వాదనలున్నాయి. వాస్తవానికి ఈ ఆలంయ ఎవరు నిర్మించారన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. ఏడో శతాబ్దం నుంచి ఆలయం ప్రాధాన్యత వెలుగులోకి వచ్చింది.అప్పటి నుంచి తరతరాలుగా రాజవంశాలు అభివృద్ధి చేస్తున్నాయి. కళింగ, ఆంధ్ర, చోళుల రాజవంశ పాలనలో దీన్ని అభివృద్ధి చేశారు. 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు, 11వ శతాబ్దంలో రామానుజాచార్యులు, 13వ శతాబ్దంలో మధ్వాచార్యుల శిష్యులైన శ్రీనరహరితీర్థులు సందర్శించినట్లు చరిత్రకారులు చెబుతారు. సీతారాముల సంతానం అయిన లవకుశలు కూడా ఈ ఆలయాన్ని సందర్శించారని చెబుతారు.
Also Read: శబరిమల, అరుణాచలం తర్వాత అతిపెద్ద జ్యోతి కనిపించే ఆలయం ఇదే
శిల్ప సౌందర్యం వర్ణనాతీతం
ఆలయ పైభాగం అష్టదళ పద్మాకారంలో ఉంటుంది. తూర్పు, దక్షిణ ద్వారాలపై శిల్పాలు కనువిందు చేస్తాయి. అబ్బుపరిచే శిల్పాలు, కుడ్య చిత్రాలు ఇక్కడ ప్రత్యేకాకర్షణ. మొత్తం 108 రాతి స్తంభాలు ఉన్నాయి. ఒక దానితో మరొకటి పోలిక ఉండకపోవడం మరో విశేషం.
సౌకర్యాలు
కూర్మనాథ క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి సత్రం ఉంది. దీంతో పాటు శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం అరసవెల్లి కూడా ఇక్కడకు పది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ రెండు ఆలయాలను చూడాలనుకునేవారు శ్రీకాకుళంలో స్టే చేయొచ్చు.
బస్సులో వెళ్లేవారికోసం శ్రీకాకుళం పాత బస్టాండ్ నుంచి ప్రతి 15 నిమిషాలకు అరసవల్లి మీదుగా బస్సు సౌకర్యం ఉంది. దీంతో పాటు ఆటోలు, టాక్సీలు అందుబాటులో ఉంటాయి. రైళ్లలో వెళ్లేవారు శ్రీకాకుళం రోడ్డు స్టేషన్‌లో దిగాల్సి ఉంటుంది.
ఆలయంలో పూజలు-దర్శనవేళలు
జ్యేష్ఠ బహుళ ద్వాదశినాడు స్వామివారి జయంతి. ఈ రోజు స్వామివారికి ఉదయం క్షీరాభిషేకం నిర్వహించి అనంతరం ప్రత్యేక పూజలు చేస్తారు.
అభిషేకం (తిరుమంజనం): ప్రతిరోజూ ఉదయం 4.30 నుంచి 6 గంటల వరకు
ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7.45 గంటల వరకూ స్వామివారిని దర్శించుకోవచ్చు.
Also Read: అప్పులు,కష్టాలు, ఆర్థిక నష్టాలు, అనారోగ్యం తొలగిపోవాలంటే ఈ తిథుల్లో ఇలా చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)