Karthika Masam Ending Poli Swargam 2023 Date: కార్తీకమాసం ఎప్పటితో పూర్తవుతుంది - ఆఖరి రోజు చదువుకోవాల్సిన కథ ఇదే!
Poli Swargam 2023 date: కార్తీకమాసం నెలంతా ప్రత్యేకమే అయినా ఉత్థాన ఏకాదశి నుంచి కార్తీక పౌర్ణమి వరకూ అత్యంత ప్రత్యేకం. ఆ తర్వాత మళ్లీ కార్తీకమాసం చివరిరోజైన పోలిపాడ్యమి మరింత విశేషమైంది.
Karthika Masam ending Poli Swargam 2023 Date : డిసెంబరు 12 కార్తీక అమావాస్య వచ్చింది...డిసెంబరు 13 పోలి పాడ్యమి అంటారు. ఈ రోజుతో కార్తీకమాసం పూర్తై మార్గశిర మాసం మొదలవుతుంది. కార్తీకమాసంలో నెలరోజుల పాటూ నియమంగా పాటించినవారు...కార్తీక అమావాస్య మర్నాడు.. మార్గశిర మాసం మొదటి రోజు అయిన పాడ్యమి రోజు దీపాలు వెలిగిస్తారు. ఆ రోజుతో కార్తీకమాసం పూర్తైనట్టు..ఈ రోజునే పోలిపాడ్యమి లేదా పోలిస్వర్గం అంటారు. అసలు ఆ పేరు ఎలా వచ్చింది..పోలి అంటే ఎవరు?ఆమె కథేంటి?
పోలిపాడ్యమి కథ ఇదే!
పూర్వం ఓ గ్రామంలో ఓ ఉమ్మడి కుటుంబంలో ఐదుగురు కోడళ్లు ఉండేవారు. వారిలో చిన్నకోడలి పేరు పోలి. ఆమెకు చిన్నప్పటి నుంచీ దైవ భక్తి ఎక్కువ. కానీ అదే భక్తి అత్తగారికి నచ్చలేదు. ఎందుకంటే తనకంటే భక్తురాలు మరొకరు ఉండకూడదు, తనే నిజమైన భక్తురాలు అనే అహంకారంతో ఉండేది. అందుకే చిన్నకోడలైన పోలితో పూజలు చేయనిచ్చేది కాదు. కార్తీకమాసం వచ్చినప్పుడు కూడా మిగిలిన కోడళ్లను తీసుకుని నదికి వెళ్లి స్నానమాచరించి దీపాలు వెలిగించుకుని పూజలు చేయించి వచ్చేది కానీ పోలిని పట్టించుకునేది కాదు..పైగా తనకు ఎలాంటి సౌకర్యం లేకుండా చేసేది. కానీ పోలి మాత్రం బాధపడేది కాదు..అత్తగారు, తోడికోడళ్లు అటు వెళ్లగానే పెరట్లోని పత్తి చెట్టు నుంచి కాస్త పత్తి తీసుకుని కవ్వానికి ఉన్న వెన్నను తీసి పత్తికి రాసి దీపం వెలిగించేది. ఆ దీపం ఎవరి కంటా పడకుండా దానిపై బుట్ట బోర్లించేంది. ఇలా కార్తీకమంతా సూర్యోదయానికి ముందే స్నానమాచరించి నిత్యం దీపారాధన చేసేది. చివరికి కార్తీక అమావాస్య పూర్తై పోలిపాడ్యమి రానే వచ్చింది. ఆ రోజు కూడా అందరూ నదికి వెళ్లిపోతూ...పోలికి చేతినిండా పని అప్పగించి వెళ్లిపోయారు. కానీ ఎప్పటిలా ఇంటి పనులు పూర్తిచేసుకుని కార్తీకదీపం వెలిగించింది.
Also Read: ఈ పత్రాలు త్రిశూలానికి సంకేతం - అందుకే శివపూజలో ప్రత్యేకం!
కరుణించిన దేవుడు
ఎన్ని అడ్డంకులు ఎదురైనా పోలి భక్తి తప్పకపోవడం చూసి దేవతలంతా ఆమెను దీవించారు. ఆమెను ప్రాణం ఉండగానే స్వర్గానికి తీసుకెళ్లేందుకు పుష్పకవిమానంతో వచ్చారు దేవదూతలు. అప్పుడే ఇంటికి చేరుకున్న అత్తగారు...మిగిలిన తోడికోడళ్లు పోలిని విమానాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అది తమకోసమే వచ్చిందనుకున్నారు. కానీ అందులో పోలిని చూసి నిర్ధాంతపోయారు. తాము కూడా స్వర్గానికి వెళ్లాలనే తాపత్రయంతో పోలి కాళ్లు పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. విమానంలోని దేవదూతలు, పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన భక్తి ఉందని చెప్పి వారిని కిందనే వదిలేసి పోలిని తీసుకెళ్లిపోయారు.
Also Read: అష్టాదశ పురాణాలు ఏవి - ఏ పురాణంలో ఏముంది!
స్వర్గ ద్వారం ప్రవేశం కోసమే దీపం
కార్తీక అమావాస్య మర్నాడు వచ్చే పాడ్యమి రోజు దీపం వెలిగింది...పోలి కథను చెప్పుకుని ఆమెలా స్వర్గ ద్వార ప్రవేశం కల్పించాలని ప్రార్థిస్తారు భక్తులు. నెల రోజులూ ఎలాంటి నియమాలు పాటించని వారు కనీసం పోలి పాడ్యమి రోజైనా 30 ఒత్తులను వెలిగించి అరటి దొప్పల్లో పెట్టి నీటిలో వదులుతారు. ఇదే రోజు బ్రాహ్మణులకు దీపదానం చేస్తారు.
Also Read: శివుడికి ఈ ద్రవ్యంతో అభిషేకం చేస్తే సర్వ సంపద వృద్ధి
గమనిక: స్వర్గం నరకం ఉన్నాయో లేదో అనే వాదన కన్నా...భగవద్గీతలో శ్రీ కృష్ణుడు చెప్పినట్టు మీరు ఆచరించాల్సిన పద్ధతులు, నియమాలు భక్తితో ఆచరిస్తే దక్కాల్సిన ఫలితం తప్పకుండా వస్తుందనేదే పోలి స్వర్గం కథలో ఉన్న ఆంతర్యం...