Prasant Kishore New Party : రాజకీయ నేతగా ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే ఫెయిల్ ! కొత్త పార్టీతో సక్సెస్ ఎలా !?
రాజకీయ నేతగా స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ రాణించడానికి తక్కువే చాన్సులు ఉన్నాయి. ప్రత్యక్ష రాజకీయాల్లో ఇప్పటికే ఆయన ఫెయిలయ్యారు.
మోస్ట్ సక్సెస్‌ఫుల్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ రాజకీయ ఆరంగేంట్రం చేస్తున్నారు. నిజానికి ఇది ఆరంగేట్రం కాదు. ఇప్పటికే ఓ పార్టీలో చేరి ఇమడలేక బయటకు వచ్చారు. మరో పార్టీలో చేరేందుకు ప్రయత్నించి ఫెయిలయ్యారు. తానే తిరస్కరించానని ఆయన గౌరవంగా చెప్పుకోవచ్చు.. ఆయన గౌరవాన్ని కాపాడేందుకు ఆ పార్టీ కూడా అలాంటి ప్రకటన చేసి ఉండవచ్చు. కానీ అక్కడ జరిగింది మాత్రం వేరు. అయినప్పటికీ ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పగానే కాస్త "బజ్" వచ్చింది. సొంత పార్టీ అనగానే మరింత చర్చ జరుగుతోంది. కానీ నిపుణుల దగ్గర్నుంచి సామాన్యుల వరకు ఎంత మంది చర్చించినా చివరి ఫలితం.." అబ్బే.. సాధ్యం కాదు" అనే వాదనే వస్తోంది. ఎందుకంటే ?
పొలిటికల్ స్ట్రాటజీలు చెప్పడం వేరు పాటించడం వేరు !
చపాతీలు ఎలా చేయాలో క్లాసులో చెబుతారు. నిజంగా ఎలా చేయాలో ప్రాక్టికల్‌గా చేసినప్పుడే తెలుస్తోంది. క్లాసులో తెలుసుకున్నాం కదా అని నేరుగా వెళ్లి చపాతీలు చేస్తే చేతకావు. ఇది ఏ అంశంలో అయినా ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్లు పనులు చేస్తే ఉదాహరణగా చెబుతూంటారు. ఇప్పుడుప్రశాంత్ కిషోర్‌కు కూడా అలాంటి పరిస్థితే. ప్రశాంత్ కిషోర్ గొప్ప వ్యూహకర్త. ఆయన వ్యూహాలు ఇతర పార్టీలకు ఉపయోగపడతాయి కానీ.. ఆయన పార్టీకి ఉపయోగపడే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆయన ఇప్పటి వరకూ సేవలందించిన పార్టీలు ప్రజల్లో పలుకుబడి సాధించాయి. ఓ ఇమేజ్ తెచ్చుకున్నాయి. అంతే కానీ ఆయన వల్ల ఇమేజ్ రాలేదు. కానీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సొంత పార్టీతో ప్రారంభం కాబోతున్నారు. దానికి ఎలాంటి ణమేజ్ లేదు సరి కదా పీకేకూడా గొప్ప ప్రజాదరణ ఉన్న నాయకుడు కాదు. ఓ స్ట్రాటజిస్ట్‌గా ఆయనకు వచ్చిన పబ్లిసీటీనే ఆయనకు గుర్తింపు.
ఇప్పటికే ఓ సారి ప్రత్యక్ష రాజకీయాల్లో ఫెయిల్ !
ప్రశాంత్ కిషోర్‌కు మొదటి నుంచి ప్రత్యక్ష రాజకీయాలపై ఆసక్తి ఉంది. ఆయన గతంలో తన ఐ ప్యాక్ కంపెనీని స్నేహితులకు అప్పగించి బీహార్‌లో రాజకీయం చేయడానికి వెళ్లారు. అక్కడ నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూలో చేరారు. రాజకీయ వారసులు లేని నితీష్ కుమార్..తన తదనంతరం జేడీయూ పార్టీని ప్రశాంత్ కిషోరే నిర్వహిస్తారని.. తన రాజకీయ వారసునిగా కూడా ప్రకటించారు. ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు. కానీ ప్రశాంత్ కిషోర్ ... జేడీయూ అంతర్గత రాజకీయాలను తట్టుకోలేకపోయారు. ఎంతగా అంటే.. చివరికి వారసుడిగా అంగీకరించిన నితీష్ కుమారే ..ప్రశాంత్ కిషోర్ తమ పార్టీకి అవసరం లేదనుకునేంతగా. దీంతో మనసు గాయపడిన పీకే.. మళ్లీ స్ట్రాటజిస్ట్‌గా కాంట్రాక్టులు పొంది తృణమల్, డీఎంకే వంటి పార్టీలకు పని చేశారు.
కాంగ్రెస్‌లో చేరికనూ సక్సెస్ ఫుల్ చేసుకోలేకపోయారు..!
కాంగ్రెస్ పార్టీ ప్రశాంత్ కిషోర్‌ను చేర్చుకునేందుకు ఆసక్తిగా ఉంది. కానీ పీకే కాంగ్రెస్ పార్టీ మొత్తం తాను చెప్పినట్లుగా నడవాలనుకున్నారు. అక్కడే కాంగ్రెస్ సీనియర్లకు నచ్చలేదు. నిజానికి ఏ రాజకీయ పార్టీలో అయినా తానే పెత్తనం చేస్తానని కొత్త నాయకుడు అంటే... పై నుంచి కింది వరకూ ఎవరూ అంగీకరించరు. ఈ చిన్నలాజిక్ పీకే మిస్సయ్యాడు.అందుకే కాంగ్రెస్‌లోకీ ఎంటర్ కాలేకపోయారు. ఆయన తనకు లభించిన ఇమేజ్‌తో తాను అత్యున్నత స్థాయిలో ఉండాల్సిన వ్యక్తిగా ఊహించుకుంటూ ఉంటారు. అందుకే ఆయన ఇమడలేని సన్నిహితులు చెబుతూ ఉంటారు. కాంగ్రెస్‌లో చేరినా ఆయన జేడీయూ తరహాలోనే త్వరలోనే బయటకు వచ్చి ఉండేవారని అంటున్నారు.
బీహార్‌లో పార్టీని బలోపేతం చేసుకునే దాన్ని బట్టే భవిష్యత్ !
ప్రశాంత్ కిషోర్ బీహార్ వ్యక్తి. అందుకే అక్కడే తన పార్టీకి హోం టర్ఫ్ ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు పీకే ఇంట గెలవాల్సి ఉంది. అయితే బీహార్‌లో పార్లమెంట్ ఎన్నికలే్ ముందురానున్నాయి కాబట్టి.. ఆయనకు అసెంబ్లీ ఎన్నికల్లాంటి సవాళ్లు లేవు. తన పొలిటికల్ స్ట్రాటజీలన్నీ ఉపయోగించి బీహార్‌లో తానుపెట్టబోయే పార్టీని బలంగా నిలబడితే ఆయన రాజకీయ భవిష్యత్‌పై ప్రజలకు కొంత నమ్మకం కలుగుతుంది. లేకపోతే అసలుకే మోసం వస్తుంది. రాజకీయ నేతగా ఆయన బలంగా ఉన్నారంటేనే కాంగ్రెస్ అయినా మరో కూటమిఅయినా ఆయనను దగ్గరకు రానిస్తుంది. బీజేపీని ఓడించాలంటే...కాంగ్రెస్‌తో కూడిన ఫ్రంట్ ఉండాలని వాదిస్తున్నారు కాబట్టే.. ఆయన కూడా కూటమిలో భాగం కావాల్సిందే. అందుకే ఇప్పుడు రాజకీయాల్లో తననో ధృవతారగా నిరూపించుకోవాలంటే..ఇంట గెలవాలి. లేకపోతే.. స్ట్రాటజిస్ట్‌గా కూడా ఇమేజ్ మసకబారిపోతుంది. అంటే రెంటికి చెడ్డ రేవడి అవుతారు.