Stock Market Opening: యూఎస్-చైనా ప్రతీకారాలతో మార్కెట్లు మళ్ళీ పతనం - ఆసియా, యూఎస్‌లోనూ రెడ్ కలర్
Stock Market Updates Today: చైనాపై 54%, కంబోడియాపై 49%, థాయిలాండ్‌పై 36% సుంకం విధించిన ట్రంప్, వియత్నాంపైనా 46% వడ్డించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Indian Stock Markets Fall Today: డొనాల్డ్ ట్రంప్ సుంకాల ప్రకటనలతో అమెరికా - చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తత నిరంతరం పెరుగుతోంది. ఇది అమెరికన్ స్టాక్ మార్కెట్‌పైనే ఎక్కువ ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ప్రపంచ మార్కెట్లు కూడా కుప్పకూలుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ చైనాపై 104% సుంకం విధిస్తూ ఆకస్మిక నిర్ణయం తీసుకోవడంతో, అమెరికన్ స్టాక్ మార్కెట్లలో వరుసగా మూడో ట్రేడింగ్ రోజు (మంగళవారం, 08 ఏప్రిల్ 2025) మంగళవారం నాడు కూడా పతనాన్ని కొనసాగింది.
భారతీయ స్టాక్ మార్కెట్లు
యూఎస్, ఆసియా మార్కెట్ల ప్రతికూల ప్రభావంతో, ఈ రోజు (బుధవారం, 09 ఏప్రిల్ 2025) BSE సెన్సెక్స్ & NSE నిఫ్టీ నష్టాలతో ట్రేడ్ ప్రారంభించాయి. నిన్న (మంగళవారం) 74,227 దగ్గర ముగిసిన సెన్సెక్స్ ఈ రోజు 123 పాయింట్ల నష్టంతో వద్ద ఓపెన్ అయింది. నిన్న 22,536 వద్ద ఆగిన నిఫ్టీ ఈ రోజు 76 పాయింట్ల నష్టంతో 22,460 దగ్గర ట్రేడ్ ప్రారంభించింది.
ఆసియా మార్కెట్లు
యూఎస్ మార్కెట్ల పతన ప్రభావం, టారిఫ్‌ల యుద్ధం ముదరడంతో ఈ రోజు ప్రారంభంలో ఆసియా మార్కెట్లు క్షీణించాయి, నిన్నటి లాభాలను వదులుకున్నాయి. ఈ ఉదయం జపాన్ ప్రధాన సూచీ నిక్కీ 4 శాతానికి పైగా క్షీణించింది. దక్షిణ కొరియాకు చెందిన కోస్పి 1 శాతం పడిపోయింది. ఆస్ట్రేలియాకు చెందికన ASX ఇండెక్స్ దాదాపు 2 శాతం జారిపోయింది. చైనా, హాంకాంగ్, న్యూజిలాండ్ సూచీలు కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
అమెరికన్ మార్కెట్లు
మంగళవారం, వరుసగా వచ్చి పడ్డ బాంబ్‌ల్లాంటి సుంకాల అప్‌డేట్స్ కారణంగా అమెరికన్ మార్కెట్లు ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి, నష్టాల్లోకి జారుకున్నాయి. S&P 500 సూచీ 90 పాయింట్లు లేదా 1.6% తగ్గి 4,982.77 వద్దకు చేరుకుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.8% తగ్గి 37,645.59 వద్ద ఆగింది. నాస్‌డాక్ కాంపోజిట్ ఇండెక్స్ 2.2% లేదా దాదాపు 300 పాయింట్లు పడిపోయి 4,982.77 దగ్గర ముగిసింది. దాదాపు ఒక సంవత్సరం క్రితం ఇది 5,000 కంటే తక్కువగా ఉంది, ఇప్పుడు మళ్లీ 5,000 స్థాయికి దిగువన ఉంది.
డొనాల్డ్ ట్రంప్ కంబోడియాపై 49 శాతం, థాయిలాండ్‌పై 36 శాతం, చైనాపై 54 శాతం సుంకాలు విధించారు. జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు ట్రంప్ సుంకాల వల్ల ప్రభావితమవుతాయి, వాటిపై విధించిన 26 శాతం సుంకం ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. వియత్నాం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపైనా 46 శాతం సుంకం విధించేందుకు కూడా ట్రంప్ సిద్ధమయ్యాయి. భారత్, సింగపూర్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సహా 60 దేశాలపై 10 శాతం బేస్‌లైన్ సుంకాలు ఇప్పటికే అమలవుతున్నాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.





















