Nidadavole Municipality : నిడదవోలు మున్సిపాలిటీ జనసేన కైవసం- జనసేన ఖాతాలో తొలి పురపాలక సంఘం
Nidadavole Municipality : నిడదవోలు మున్సిపాలిటీని జనసేన కైవసం చేసుకుంది. కనీసం ఒక్క కౌన్సిలర్ స్థానాన్ని గెలుచుకోలేకపోయినా ఈ మున్సిపాలిటీ జనసేన ఖాతాలో చేరింది.

Nidadavole Municipality : తూర్పుగోదావరి జిల్లాలోని ముఖ్యమైన పట్టణాల్లో ఒకటైన నిడదవోలు మున్సిపాలిటీని జనసేన కైవసం చేసుకుంది. జనసేన ఖాతాలో ఇది తొలి మున్సిపాలిటీ. వైసీపీకి చెందిన 13 మంది కౌన్సిలర్లు జనసేన పార్టీలో చేరారు. దీనికి తోడు టీడీపీకి ఉన్న ఒక స్థానం, లోకల్ ఎమ్మెల్యే, మంత్రి దుర్గేష్ ఎక్స్ ఆఫీషియో ఓటు కలిపి 15కు బలం పెరగడంతో నిడదవోలు జనసేన వశమైంది. జీరో సభ్యుల నుంచి మున్సిపాలిటీ తమ తమ పరం చేసుకునేలా స్థానిక ఎమ్మెల్యే మంత్రి కందుల దుర్గేష్ చక్రం తిప్పారు. గత కొన్నాళ్లుగా నిడదవోలు మున్సిపల్ ఛైర్మన్ పీఠం విషయంలో రేగిన ఉత్కంఠకు తాజా పరిణామాలతో తెర పడింది. దీంతో జనసేన పార్టీ శ్రేణులు, కూటమి శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి.
నిడదవోలులో మొత్తం 28 కౌన్సిలర్లకుగానూ జనసేన పార్టీకి ఒక్క కౌన్సిలర్ కూడా లేరు. గడిచిన ఎన్నికల్లో వైసిపి 27 స్థానాల్లో విజయం సాధించగా, టిడిపి ఒక్క స్థానంలో గెలిచింది. దీంతో.. వన్ సైడ్‌గా వైసిపి ఈ మున్సిపాలిటీని సొంతం చేసుకుంది. 2024 ఎన్నికల్లో పాలకులు మారారు. అంతే నిడదవోలులో కౌన్సిలర్లలో చాలామంది గోడ దూకేశారు.
తొలుత చైర్మన్, వైస్ చైర్మన్ సహా మరో పదకొండు మంది వైసీపీ సభ్యులు జనసేనలో చేరిపోయారు. దీంతో 13 మంది కౌన్సిలర్లు జనసేన పార్టీకి ఏర్పడ్డారు. కూటమి భాగస్వామ్యంలో ఉన్న టిడిపి కౌన్సిలర్‌ని కలుపుకుంటే 14 మంది బలం ఇక్కడ జనసేనకు చేరింది. మంత్రిగా ఉన్న దుర్గేష్‌కి ఎక్స్ అఫీషియో మెంబర్ ఓటు హక్కు ఉండటంతో ఆ బలం 15కి పెరిగింది.
ఏప్రిల్ 3న మునిసిపల్ చైర్మన్‌పై అవిశ్వాసానికి తీర్మానం పెట్టాలంటూ వైసీసీ కౌన్సిలర్లు ఆర్డీవో, కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేశారు. అయితే.. ఇంతలోనే మరి కొంతమంది జనసేనలో చేరుకోవడంతో వారికి అవిశ్వాస తీర్మానానికి తగ్గ బలం కూడా సరిపడని పరిస్థితి ఏర్పడింది. దీంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఈ క్రమంలో జనసేన పార్టీ ఇక్కడి ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది.
జీరో స్థాయి నుంచి పీఠం అధిష్టించే స్థాయికి చేరడం వెనుక మంత్రి కందుల దుర్గేష్ చక్రం తిప్పారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఏదైనా జనసేన పార్టీకి కైవసమైన తొలి మున్సిపాలిటీగా నిడదవోలుకు గుర్తింపు దక్కింది.





















