Uttarkashi Tunnel Rescue Operation: రూ.18 వేల జీతం కోసం సొంతూరు వదిలి, కన్నీళ్లు పెట్టిస్తున్న కార్మికుల కథలు
Uttarkashi Tunnel Rescue Operation: ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల కుటుంబాలది ఒక్కొక్కరికీ ఒక్కో కథ.
Uttarkashi Tunnel Rescue Operation Success:
17 రోజుల తరవాత బయటకు..
ఉత్తరకాశీలోని సిల్కియారా టన్నెల్‌లో (Uttarakashi Tunnel Rescue Operation Successful) చిక్కుకున్న 41 మంది కార్మికులు సురక్షితంగా బయటకు వచ్చిన వార్త వాళ్ల కుటుంబ సభ్యుల్నే కాదు మొత్తం దేశ ప్రజలందరికీ సంతోషాన్నిచ్చింది. దాదాపు 17 రోజులుగా ఆ చీకట్లోనే గడిపిన వాళ్లు ఇన్నాళ్లకు వెలుగు చూశారు. రెస్క్యూ ఆపరేషన్‌లో ఎన్నో సార్లు అవాంతరాలు ఎదురయ్యాయి. డ్రిల్లింగ్ కోసం తెప్పించిన మెషీన్‌లు విరిగిపోయాయి. అయినా సరే...వాళ్లు ఏ మాత్రం చెక్కుచెదరకుండా ఈ ఆపరేషన్‌కి సహకరించారు. చివరకు నవ్వుతూ బయటకు వచ్చారు. ఎక్కడెక్కడి నుంచో పొట్ట పోసుకునేందుకు ఇక్కడి వరకూ వచ్చారు. ఉన్నట్టుండి ఇలా చిక్కుకుపోయారు. ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, బిహార్, ఉత్తరప్రదేశ్..ఈ నాలుగు రాష్ట్రాల నుంచి కార్మికులు వచ్చి ఈ Char Dham National Highway Project కోసం పని చేస్తున్నారు. సిల్కియారా టన్నెల్ నిర్మాణం (Silkyara Tunnel) ఈ ప్రాజెక్ట్‌లో భాగమే. మొత్తం ఈ ప్రాజెక్ట్ కోసం రూ.1.5 బిలియన్ డాలర్ల మేర కేటాయించింది కేంద్రం. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో నవంబర్ 12న ఉదయం 5.30 గంటలకు ఉన్నట్టుండి సొరంగం కుప్ప కూలిపోయింది. అప్పటి నుంచి మొదలయ్యాయి కార్మికుల కష్టాలు. కుటుంబ సభ్యులకు ఈ వార్త చేరగానే గాబరా పడిపోయారు. ఎక్కడెక్కడో మారు మూల గ్రామాల్లో ఉన్నారంతా.
టికెట్‌కి డబ్బుల్లేక..
చిక్కుకుపోయిన వాళ్లలో ఒకరి కొడుకు ఉన్నాడు. మరొకరి తమ్ముడున్నాడు. ఎవ్వరికీ ఏ ప్రమాదం జరగలేదని తెలిసినా "ఎలా ఉన్నారో" అన్న ఆందోళన మొదలైంది. వెంటనే ఊరి నుంచి బయల్దేరదామని అనుకున్నా ఉత్తరకాశీ వరకూ రావాలన్నా టికెట్ కొనుక్కోడానికి కూడా డబ్బుల్లేవు. ఎలాగోలా అక్కడి వరకూ వెళ్లినా అక్కడ ఎక్కడ ఉండాలో తెలియని అయోమయంలో పడిపోయారు. కొందరు బంగారం అమ్ముకున్నారు. ఇంకొందరు విలువైన వస్తువులు అమ్మేసి డబ్బులు పోగు చేసుకున్నారు. చెవి పోగులు, గాజులు, పట్టీలు ఇలా ఒంటి మీద ఏవి ఉంటే అవన్నీ కుదవ పెట్టి ఇంకొందరు టికెట్‌లు బుక్ చేసుకున్నారు. రూ.9 వేలతో ఉత్తరకాశీకి వచ్చిన వాళ్లు...రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యే సమయానికి చేతుల్లో రూ.200తో మిగిలారు. అంతా నిరుపేద కుటుంబాలే. రోడ్డు నిర్మాణం అంటే పర్లేదు కానీ...సొరంగం తవ్వడం అంటే చాలా రిస్క్‌తో కూడుకున్న పని. అయినా సరే ఇల్లు గడవాలంటే ఎంత రిస్క్ అయినా చేయాల్సిందే అని వచ్చారు ఈ కార్మికులంతా. వీళ్ల జీతం నెలకు రూ.18 వేలు. "మా కుటుంబం చాలా కష్టాల్లో ఉంది. అందుకే జీతం తక్కువే అయినా సరే మా వాడు ఇక్కడికి వచ్చేశాడు" అని కొందరు కన్నీళ్లు పెట్టుకుంటూ చెబుతున్నారు. "ఈ కాస్త పని కూడా చేయకపోతే పేదరికంతో, ఆకలితో చనిపోయేవాళ్లం" అని మరి కొందరు భావోద్వేగానికి లోనవుతున్నారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉండి సొరంగంలో చిక్కుకుపోయినా సరే ఎవరూ ధైర్యం కోల్పోలేదు. ఎలాగైనా బయటకు వస్తామని, తమ వాళ్లను కలుసుకుంటామన్న పాజిటివ్ థాట్ వాళ్లను ఇన్ని రోజుల పాటు కాపాడింది.