Weather Alert: ఆ ప్రాంతాలకు వెళ్లాలనుకుంటున్నారా.? - బీ అలర్ట్. 2 వారాలు ప్రయాణం వాయిదా వేసుకోండి
భారీ వర్షాల నేపథ్యంలో ఊటీ, కొడైకెనాల్ పర్యటనకు వచ్చే వారు 2 వారాలు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని తమిళనాడు ప్రభుత్వం, వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఊటీ, కొడైకెనాల్.. ఈ పేర్లు వింటేనే మనకు ప్రకృతి సౌందర్యంతో అలరారే కొండ ప్రాంతాలు గుర్తొస్తాయి. నిత్యం వేలాది మంది పర్యాటకులు ఇక్కడ పర్యటిస్తారు. ఇక్కడ తేయాకు, కాఫీ తోటలు, పచ్చని పర్యావరణం, చల్లని వాతావరణం అందరినీ విశేషంగా ఆకట్టుకుంటుంది. మండు వేసవిలో సైతం ఇక్కడి మంచు దృశ్యాలు పర్యాటకులను కట్టి పడేస్తుంటాయి. ఈ ప్రాంతాల్లో ప్రధానంగా అక్టోబర్ నుంచే పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే అక్కడ హోటళ్లు, అతిథి గృహాలు పూర్తిగా బుక్కయ్యాయి. అయితే, అక్కడ పర్యటనకు సిద్ధమవుతున్న పర్యాటకులకు తమిళనాడు ప్రభుత్వ ప్రకటన షాకిచ్చింది. భారీ వర్షాల నేపథ్యంలో 2 వారాలు పర్యటన వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించడంతో పర్యాటకులు నిరుత్సాహానికి గురవుతున్నారు.
వాయిదా వేసుకోండి
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో చాలా జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం నుంచి మరింత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాంచీపురం, కార్తెక్కల్, కడలూరు, దిండుగల్, నీలగిరి, కోయంబత్తూర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలర్ట్ జారీ చేసింది. దీంతో పాటు గాలుల వేగం కూడా ఎక్కువగా ఉంటుందని తెలిపింది. కాబట్టి, పర్యాటకులు ముందు జాగ్రత్తగా మరో 2 వారాలు తమ పర్యటన వాయిదా వేసుకుంటే మంచిదని అధికారులు సూచిస్తున్నారు. తదుపరి ప్రకటన తర్వాత ఊటీ, కొడైకెనాల్ కు రావొచ్చని స్పష్టం చేస్తున్నారు. దీంతో కొందరు ప్రస్తుత పరిస్థితి గమనించి తమ పర్యటనను వాయిదా వేసుకుంటున్నారు.
కొండ చరియలు విరిగి పడొచ్చు
ఊటీ నీలగిరి కొండల్లో ఉండగా, కొడైకెనాల్ దిండుగల్ సమీపంలోని కొండల్లో ఉన్న మరో పర్యాటక ప్రాంతం. అయితే, భారీ వర్షాల నేపథ్యంలో ఇక్కడ కొండ చరియలు విరిగి పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. గతంలోనూ కొండ చరియలు విరిగి పర్యాటకుల కార్లపై పడి చాలా మంది మృత్యువాత పడిన సందర్భాలూ ఉన్నాయని పేర్కొంటున్నారు. అందుకే ముందు జాగ్రత్త చర్యగా పర్యాటకులు వర్షాల సమయంలో ఈ ప్రాంతాల్లో పర్యటించక పోవడమే మంచిదంటూ, ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని కోరుతున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

