Old CS New Adviser : నేటి చీఫ్ సెక్రటరీలు రేపటి సలహాదారులు ! ఏ సేవలకు ఈ ప్రతిఫలాలు ?
సీఎస్‌లుగా పని చేసిన వారు రిటైరైన వెంటనే అదే ప్రభుత్వంలో సలహాదారులుగా చేరిపోతున్నారు. విధుల్లో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం ద్వారా ఇలా ప్రయోజనం పొందుతున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీగా పని చేశారంటే తరవాత అదే ప్రభుత్వంలో సలహాదారు పదవి రెడీగా ఉంటుంది. ఇంకా సమయం , సందర్భం కలసి వస్తే అంత కంటే మంచి పదవే లభించవచ్చు. కొంత కాలంగా ఈ ట్రెండ్ జోరుగా సాగుతోంది. గతంలో ఇలా ఉండేది కాదు. సీఎస్‌గా రిటైరైతే ఎక్కడ ఉండేవారో కూడా తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడ రిటైరైతే ఆ రాష్ట్రంలోనే ఉంటున్నారు. కీలక పదవుల్లో ఉంటున్నారు. ఇదంతా వారు చేస్తున్న సేవలకే ప్రతిఫలంగా లభిస్తోంది. అయితే ఆ సేవలు ప్రభుత్వానికి చేస్తున్నవా..? ప్రజలకా ? అన్నదే ఇక్కడ ధర్మ సందేహం.
బెంగాల్‌లో బందోపాధ్యాయ్ నుంచి ఆదిత్యనాథ్ దాస్ వరకూ !
బెంగాల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న అలాపన్ బందోపాధ్యాయ్‌ను కేంద్ర సర్వీసులకు రావాలని ఆదేశించింది. అప్పటికి రిటైరవ్వాల్సిన ఆయన పదవీ కాలాన్ని బెంగాల్ ప్రభుత్వం అడిగిందని కేంద్రం పొడిగించింది. కానీ ప్రధానమంత్రి పర్యటన వివాదం కారణంగా ఆయనను బెంగాల్ సీఎస్‌గా కొనసాగనీయకుండా కేంద్ర సర్వీసులకు రావాలని ఆదేశించింది. కానీ ఆయన ఢిల్లీలో రిపోర్ట్ చేయలేదు. పదవికే రాజీనామా చేశారు. పొడిగింపు అవసరం లేదని తేల్చేశారు. వెంటనే సీఎం మమతా బెనర్జీ బందోపాధ్యాయ్‌ని బెంగాల్ ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా నియమించారు. ఆ తర్వాత ఆ వివాదం ఎమయిందనేది తర్వాత సంగతి కానీ సీఎస్‌గా ఉన్న బందోపాధ్యాయ్ సలహాదారుగా మారి కొత్త పదవిని అలంకరించారు. ఇక్కడ ఆయన ప్రజలకు చేసిన సేవలకు ఫలితం దక్కలేదు. కేవలం ముఖ్యమంత్రి - ప్రధానమంత్రి జరిగిన పొలిటికల్ గేమ్‌లో ఆయన ముఖ్యమంత్రి వైపు ఉండటం వల్ల దక్కిన ప్రయోజనం.
Also Read : స్వరూపానంద వ్యతిరేకత ! ఆ నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా ?
తెలంగాణలో రిటైరయ్యే ప్రతి సీఎస్ సలహాదారుడే !
అలాంటి బందోపాధ్యాయ్‌లు తెలుగు రాష్ట్రాల్లో లెక్క లేనంత మంది ఉన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ రిటైరైన ప్రతి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సలహాదారుగా పెట్టుకోవడం రివాజుగా మార్చుకున్నారు. ప్రస్తుతం ముఖ్యసలహాదారుగా ప్రభుత్వ విధుల్లో కీలకంగా వ్యవహరిస్తున్న రాజీవ్ శర్మ మాజీ సీఎస్సే. ఇక ప్రస్తుతం సీఎస్‌గా సోమేష్ కుమార్ ఉన్నారు. ఆయనకు ముందు శైలేంద్ర కుమార్ జోషి సీఎస్. ఆయన ప్రస్తుతం నీటి పారుదల వ్యవహారాల సలహాదారుడిగా జీతభత్యాలు పొందుతున్నారు. ప్రభుత్వానికి నమ్మకంగా పని చేసిన వారికి కేసీఆర్ ఇలా రిటైరైన తర్వాత కూడా జీతభత్యాలతో కూడిన మంచి పదవులు ఇస్తూ అందర్నీ దగ్గరగా ఉంచుకుంటున్నారు. ఎవర్నీ దూరం చేసుకోడం లేదు.
Also Read : టిక్కెట్ రేట్లా ? ఆన్ లైన్ టిక్కెట్లా ? ఏపీ ప్రభుత్వంతో సినీ పరిశ్రమకు పేచీ ఎక్కడ ?
ఏపీలో రాజ్యాంగబద్ధ పదవులు కూడా అదనం !
ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే ట్రెండ్ ఉంది. విభజిత ఏపీ మొదటి సీఎస్‌గా పని చేసిన ఐవైఆర్ శర్మ.. రిటైరైన తర్వాత అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి తన ఆసక్తి మేరకు ప్రత్యేకంగా బ్రాహ్మణ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయించుకుని రూ. వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయింప చేసుకుని మరీ దానికి చైర్మన్ పదవి పొందారు. మధ్యలో ఆయనకు ప్రభఉత్వంతో విబేధాలొచ్చాయి. ఇక ప్రభుత్వం మారిన తర్వాత కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. నెలాఖరున రిటైరవుతున్న ఆదిత్యనాథ్ దాస్‌కూ సలహాదారు పదవిని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. గతంలో నీలం సహానిని కూడా ఇలాగే గౌరవించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆమె చేసిన సేవలకు గుర్తుకు పదవి విరమణ చేసిన వెంటనే సలహాదారు పదవి ఇచ్చారు. అయితే ఆమె ఇంకా గొప్పగా సేవలు చేశారు కాబట్టి ఉన్నతమైన పదవి ఇవ్వాలని నిర్ణయించి ఎస్‌ఈసీ పదవి ఇచ్చేశారు.
Also Read : "బ్రాండ్ న్యూ కేబినెట్"కు ముహుర్తం ఖరారైందా ? సీనియర్లను జగన్ ఎలా డీల్ చేస్తారు ?
సీఎస్‌గా రిటైరైనా పదవి ఇవ్వకపోతే ఏం చేయగలరో అజేయకల్లామే ఎగ్జాంపుల్ !
సీఎస్‌గా చేసిన వారిని సలహాదారుగా పెట్టుకుని సముచిత గౌరవం ఇవ్వకపోతే వారు రెబల్‌గా మారే ప్రమాదం ఉంది. తమను దూరం పెట్టిన ప్రభుత్వంపై అప్పటి వరకూ పని చేసినప్పటికీ రాజకీయ విమర్శలు చేసే అవకాశం ఉంది. దీనికి సాక్ష్యంగా అజేయ కల్లాం ఉన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సీఎస్‌గా పని చేసిన ఆయనకు పొడిగింపు రాలేదు.. తర్వాత సలహాదారు పదవి కూడా ఇవ్వలేదు. దాంతో ఆయన తాను సీఎస్‌గా పని చేసిన ప్రభుత్వంపైనే ఆవినీతి ఆరోపణలు చేస్తూ ఊరూరా ప్రచారం చేశారు. ఆయన కృషి ఫలించి అప్పటి ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ ముఖ్యసలహాదారు పదవి పొందారు. ఇలాంటి అనుభవాలు చూస్తే ఎవరికైనా సీఎస్ గా చేసిన వారికి ఏదో ఓ పదవిని ఇచ్చేస్తే పోతుందిగా ఎందుకు రిస్క్ అనుకోక తప్పదు. అందుకే సీఎస్ అంటే తర్వాత సలహాదారు అని అనుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
Also Read : సజ్జనార్‌కు ఎన్‌కౌంటర్ చిక్కులు .. విచారణకు పిలిచిన సిర్పూర్కర్ కమిషన్ !