Transgender Love Affair: ట్రాన్స్ జెండర్‌తో ఆరేళ్లుగా ప్రేమాయణం, పెళ్లి చేసుకోవాలని కోరడంతో ట్విస్ట్, ఊహించని విషాదం
ప్రేమించిన యువకుడు మోసం చేశాడని మనస్థాపనంతో ట్రాన్స్ జెండర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజమహేంద్రవరంలో సంచలనం కలిగించింది.
ఈ మధ్య కాలంలో ప్రేమ వేధింపులు అధికమయ్యాయి. విచిత్రమైన ప్రేమ కథలు తెర మీదకు వస్తుంటాయి. సగం వయసు తక్కువ వారిని ఒకరు ప్రేమిస్తే, ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసుకుంటున్న వారు ఉన్నారు. కిడ్నాప్ జరిగిందేమోనని కుటుంబం హైరానా పడటం చివరికి విషయం తెలిసి షాక్ అయిన ఘటనలు చూస్తున్నాం. తాజాగా మరో ప్రేమ కథ విషాదాంతమైంది. ప్రేమించిన ట్రాన్స్ జెండర్ ను దూరం పెట్టడం, పెళ్లికి నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.
ప్రేమ పేరుతో జరుగుతున్న మోసాలు అన్నీ ఇన్నీ కావు. ఓ ట్రాన్స్ జెండర్ ను ప్రేమించానని తిరిగిన ఓ యువకుడు చివరకు కాదు పొమ్మనే సరిగి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమించిన యువకుడు మోసం చేశాడని మనస్థాపనంతో ట్రాన్స్ జెండర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజమహేంద్రవరంలో సంచలనం కలిగించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజమహేంద్రవరం సింహాచలానికి చెందిన మిద్దె ప్రణీత (29), సింహాచల నగర్ ప్రాంతానికి చెందిన పట్టా శ్రీను అనే వ్యక్తి గత ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమ వ్యవహారం ఓకే కానీ పెళ్లి ఎప్పుడు చేసుకుందామని ప్రణీత, తన ప్రియుడు శ్రీనును కొంతకాలం కిందట అడిగింది. అప్పటినుంచి అతడు ప్రణితకు ముఖం చాటేస్తున్నాడు. ఇక లాభం లేదని భావించిన ట్రాన్స్ జెండర్ ప్రణీత తనను పెళ్లి చేసకోవాలని ప్రియుడు శ్రీనును నిలదీయడంతో తనకు సంబంధం లేదన్నాడు.
ఆమెను ప్రేమించి మోసం చేయడంతో పాటు, నీ చావు నువ్వు చావు అని హేళన చేశాడు. ప్రియుడు శ్రీను అన్న మాటలతో మనస్తాపం చెందిన ప్రణీత ఈనెల 19వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అపరస్మారక స్థితిలో ఉన్న ప్రణితను హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం తాడితోటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున ప్రణీత మృతి చెందింది. విషయం తెలుసుకున్న ట్రాన్స్ జెండర్ సంఘాలు తాడితోటలోని ఆసుపత్రికి చేరుకుని ఆందోళనకు దిగారు. ట్రాన్స్ జెండర్ మృతికి కారుకుడైన శ్రీను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనకు దళిత సంఘాల నాయకులు మద్దతు ప్రకటించారు.
కుటుంబ కలహాలతో మూడో భార్యపై కొడవలితో దాడి
కుటుంబ కలహాలతో భార్యపై కొడవలితో దాడి చేసిన సంఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ఫిరంగడ్డ ప్రాంతానికి చెందిన రామచంద్రుకి ముగ్గురు భార్యలు. చిన్న భార్య ఎల్లమ్మతో కొంతకాలంగా గొడవలు జరుగుతుంది. శనివారం తెల్లవారు జామున గొడవ జరగడంతో భార్య ఎల్లమ్మపై కొడవలితో దాడి చేశాడు రామచంద్రు. రక్తపు మడుగులో పడిఉన్న తల్లిని చూసిన కూతురు అరవడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి బాధితురాలిని ఎంజీఎం హాస్పటల్ తరలించారు.
మద్యం మత్తులో తలెత్తిన గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలో చోటుచేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన చెవ్వల్ల రాజు అనే వ్యక్తి శుక్రవారం ఊళ్లోని ఓ మద్యం షాపునకు వెళ్లి మద్యం సేవిస్తుండగా సాంబరాజు అనే వ్యక్తితో గొడవ తలెత్తింది. ఈ క్రమంలో సాంబరాజు అనే వ్యక్తి రాజుపై దాడి చేయగా తలకు బలమైన గాయలు కావడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మృతుని బంధువులు తెలిపారు. రాజు మృతికి కారణమైన సాంబరాజు ఇంటి ఎదుట రాజు మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.