(Source: ECI/ABP News/ABP Majha)
శ్వేత పత్రాలు కావు, హామీలు ఎగవేసేందుకు కుట్రలు: హరీష్‌రావు
Harish Rao On Telangana Govt White Paper: తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు తీవ్ర విమర్శలు చేశారు.
Harish Rao Comments On Economic Situation Of Telangana: రాష్ట్రం అప్పులకుప్ప అంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారంతో తెలంగాణ భవిష్యత్‌ను ప్రమాదకరంలో పడేస్తోందని ఆరోపించారు ఎమ్మెల్యే హరీష్‌రావు. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రంపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ హడావుడి చూస్తుంటే ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలను ఎగవేసేందుకు దారులు వెతుక్కుంటున్నట్టుగా ఉందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై మాజీమంత్రి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు మండిపడ్డారు. గురుశిష్యులు వండి వార్చినట్టు ఉందని ఎద్దేవా చేశారు. తయారు చేసిన వారిలో ఏపీ విశ్రాంత ఐఏఎస్ అధికారి ఉన్నారని తీవ్ర కామెంట్స్ చేశారు. అందులో పేర్కొన్న అంశాలు తప్పులని తేల్చేశారు. అప్పులను జీఎస్టీడీపీతో పోల్చేలేదని రెవెన్యూతో పోల్చడాన్ని హరీష్ తప్పుపట్టారు. తెలంగాణలో పెరిగిన అప్పులు వివరించిన ప్రభుత్వం పెరిగిన ఆస్తుల సంగతి మాత్రం పట్టించుకోలేదన్నారు.
కరోనా సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకోవడాన్ని హరీష్ తప్పుపట్టరు. గత ప్రభుత్వంపై బురద జల్లేందుకు చేస్తున్న ప్రయత్నమే తప్ప ఇంకొకటి కాదన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆదాయంతోపాటు ఆస్తులు కూడా పెంచామని ఆ విషయాన్ని దాచి పెట్టారని ఆరోపించారు. తెలంగాణ సొంత ఆదాయం ఎలా పెరిగిందన్నది చూపలేదన్నారు. ఆరోగ్యంపై తక్కువగా ఖర్చు పెట్టామనేది తప్పుడు ప్రచారం అన్నారు. కరోనా వల్ల ఎక్కువ అప్పులు తీసుకునే వెసులుబాటు కేంద్రం కల్పించిందని తెలిపారు. కేంద్రం తీసుకున్న విధానాల వల్ల కరోనా నష్టాన్ని పూడ్చనందు వల్ల రాష్ట్రంపై భారం పడిందని వివరించారు. ఆర్థికంగా ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమానికి లోటు లేకుండా చూశామని పేర్కొన్నారు.
కేంద్రం నిధులు అన్ని రాష్ట్రాలతో సమానంగా రావాలంటూ బీఆరఎస్ ఎంపీలు కేంద్రంతో కొట్లాడారాని గుర్తు చేశారు హరీష్‌రావు. అదే సభలో ఉన్న కాంగ్రెస్ ఎంపీలు కేంద్రాన్ని ఒక్కసారైనా దీనిపై ప్రశ్నించారా అని నిలదీశారు. మొదటి నుంచి తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తూ వచ్చిందని పన్నుల్లో వాటా సెస్‌లను రూపంలో ఎగ్గొట్టిందని తెలిపారు. ఏపీ చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు కేంద్రం వల్లే రాలేదన్నారు. లక్షల కోట్లు కేంద్రం రాకుండా పోయాయని ఇవి వచ్చి ఉంటే కచ్చితంగా రాష్ట్రం అప్పులు తగ్గేవని వివరించారు.