(Source: ECI/ABP News/ABP Majha)
AP TG CMs Meeting: ముగిసిన సీఎంల భేటీ, విభజన సమస్యల పరిష్కారం కోసం కమిటీల ఏర్పాటుకు నిర్ణయం
Latest Telugu breaking News: ఇవాళ తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపైనే ప్రధానంగా చర్చ నడుస్తోంది. దీంతోపాటు ఏపీ, తెలంగాణ జాతీయ, అంతర్జాతీయ లేటెస్ట్ అప్‌డేట్స్ ఇక్కడ తెలుసుకోండి.
LIVE
Background
Chandra Babu Revanth Reddy Meeting: హైదరాబాద్‌లోని ప్రజాభవన్ వేదికగా నేడు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. సాయంత్రం ఆరు గంటలకు జరిగే సమావేశంలో ఏం చర్చిస్తారు. ఎలాంటి అవుట్‌పుట్ వస్తుందనే ఆసక్తి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా నెలకొంది. విభజన జరిగి పదేళ్లు గడుస్తున్నా చర్చకు రాని కీలకాంశాలు ఈ భేటీలో పరిష్కారమవుతాయని అంతా భవిస్తున్నారు. ఆ దిశగానే ఇరు రాష్ట్రాల అధికార యంత్రాంగం సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.
ఆరు గంటలకు రేవంత్, చంద్రబాబు సమావేశం
ఈ సమావేశం శనివారం సాయంత్రం ఆరు గంటలకు బేగంపేటలోని జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో జరగనుంది. ఇందులో రాష్ట్ర విభజన చట్టంలోని 9,10 షెడ్యూల్లో పరిష్కారం కాని సమస్యలే చర్చించనున్నారు. సుదీర్ఘకాలం పరిష్కారం కాని సమస్యలు కాబట్టి ఈ భేటీ రాత్రి పది గంటల వరకు సాగే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ఈ కీలక సమావేశంలో సీఎం రేవంత్, చంద్రబాబుతోపాటు తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తెలంగాణ మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఏపీ మంత్రులు కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, ప్రభుత్వ సీఎస్‌లు కూడా హాజరుకానున్నారు.
చర్చించే అశాలు ఇవే
సమావేశంలో ఏఏ అంశాలు చర్చించాలని ఎలాంటి పరిష్కార మార్గాలు ఉన్నాయనే విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు క్లారిటీతో ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే అధికారులు, సీనియర్ మంత్రులతో సమావేశమై ముఖ్యమంత్రులు వీటిపై మాట్లాడుకున్నారు. రాజ్‌భవన్, హైకోర్టు, లోకాయుక్త, కార్మిక సంక్షేమ నిధి, వాణిజ్య పన్నులు, విద్యుత్ సంస్థల బకాయిలు పదేళ్లుగా పరిష్కృతంగానే ఉన్నాయి. షెడ్యూల్‌లో తొమ్మిదిలో ఉన్న ఆర్టీసీ, ఫైనాన్స్ కార్పొరేషన్ లాంటి 23 కార్పొరేషన్ల ఆస్తులపై ఇంత వరకు ఎటూ తేలకుండా ఉంది. పదో షెడ్యూల్‌లో ఉన్న తెలుగు అకాడమీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ, వంటి 30 సంస్థల ఆస్తులపై కూడా పేచీ నెలకొని ఉంది. ఈ సమావేశం తర్వాత ఒక్కసారిగా కాకపోయినా దఫాలుగా వీటిపై ఓ క్లారిటీ వస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
వీటిపై పదేళ్లుగా కేంద్ర హోంశాఖ చర్చలు జరుపుతూనే ఉంది. ఇందులో మూడో పార్టీ జోక్యం అవసరం లేదని తెలుగు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అవుతుందని చాలా సార్లు చెప్పింది. అయితే తెలుగు రాష్ట్రాల సీఎంలు ఒకట్రెండు సార్లు సమావేశాలు అయినా ఈ స్థాయిలో చర్చలు జరిపి పరిష్కరించుకోవాలనే ఆలోచన చేయలేదు. మొొదటి ఐదేళ్లు సీఎంలుగా ఉన్న కేసీఆర్‌కు చంద్రబాబుకు అభిప్రాయభేదాలు ఉండటం తర్వాత వచ్చిన జగన్‌కు కేసీఆర్‌తో ఉన్న అతి స్నేహం కూడా సమస్యల పరిష్కారానికి అడ్డంకిగా మారాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల సీఎంలుగా ఉన్న చంద్రబాబు రేవంత్ మధ్య మంచి సఖ్యత ఉందని కచ్చితంగా కొన్ని విషయాలు ఒకరు మరికొన్ని విషయాల్లో ఇంకొకరు వెనక్కి తగ్గి పరిష్కరించుకుంటారని అంటున్నారు.
ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాలకు ఈ ఆస్తులు ఇప్పుడు చాలా అవసరం. అందుకే కచ్చితంగా సమస్యను ఎలాగైనా ఇరు రాష్ట్రాల సీఎంలు పరిష్కరించుకుంటారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఆర్థిక పరిస్థితిపై ముందే అవగాహన ఉన్న చంద్రబాబు అపరిష్కృత సమస్యలపై కలుద్దాం పరిష్కరించుకుందామని తెలంగాణ సీఎంకు లేఖరాయడం... రేవంత్ కూడా సరే కలుద్దాం అంటు ఓకే చెప్పడంతో ఈ సమావేశానికి మార్గం సుగమమైంది.
ఆస్తులు, బకాయిలపై ఆరా
ఇప్పటికే ఉమ్మడి రాజధాని బంధం తెగిపోయింది. దీంతో కీలకమైన భవనాలు ఏపీ ఆధీనంలో ఉన్నాయి. వాటిని స్వాధీనం చేసుకొని తమ అవసరాలకు వాడుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. దీంతోపాటు తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల బదిలీ కూడా అపరిష్కృతంగానే ఉంది. వాటిపై కూడా భేటీ తర్వాత క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా సందిగ్ధంలో ఉన్న 18 వందల మంది విద్యుత్ ఉద్యోగుల విషయంలో కూడా స్పష్టత రానుంది.
అన్నింటికంటే చాలా ముఖ్యమైంది విద్యుత్ బకాయిలు. తమకు 24 వేల కోట్లు రావాలని తెలంగాణ వాదిస్తుంటే... తమకు ముందు ఏడు వేల కోట్లు రావాలని ఏపీ వాదిస్తోంది. దీని విషయంలో రెండు రాష్ట్రాల సీఎంలు మాట్లాడుకుంటారని సమాచారం. వీటితోపాటు రావాల్సిన ఇతర బకాయిలపై కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దృష్టి పెట్టాయి. తెలుగు రాష్ట్రాల మధ్య తరచూ గొడవలకు కారణమయ్యే డిస్కంలు, నీటి ప్రాజెక్టుల పంచాయితీలు భవిష్యత్‌లో లేకుండా చేసుకోవడం కూడా ఈ భేటీ అజెండాలో ఉన్నట్టు తెలుస్తోంది.
'సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు' - భట్టి విక్రమార్క
AP And TG CMs Meeting: సీఎంల భేటీలో అనేక అంశాలపై లోతుగా చర్చలు జరిగాయని.. పదేళ్లుగా పరిష్కారం కాని అంశాలపై చర్చించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీలో సీఎస్, ముగ్గురు సభ్యులు ఉంటారని చెప్పారు. సమస్యలు త్వరగా పరిష్కరించుకోవాలని నిర్ణయించామని అన్నారు. కమిటీ పరిష్కరించలేని సమస్యలపై మంత్రులతో కమిటీ వేస్తామని వెల్లడించారు.
'ఆ 5 గ్రామాలు తెలంగాణకు ఇవ్వండి' - చంద్రబాబు ముందు రేవంత్ డిమాండ్!
AP And TG CMs Meeting: విభజన తర్వాత భద్రాచలం నుంచి ఏపీలో కలిసిన 7 మండలాల్లోని 5 గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి.. చంద్రబాబును కోరినట్లు తెలుస్తోంది. ఎటపాక, గుండాల, పురుషోత్తపట్నం, పిచ్చుకలపాడు, కన్నాయగూడెం పంచాయతీలను ఇవ్వాలని అడిగినట్లు సమాచారం. అటు, హైదరాబాద్‌లోని కొన్ని భవనాలను ఏపీ ప్రభుత్వం అడగ్గా.. సీఎం రేవంత్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. కాగా, ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా పరిష్కారాలు ఉండాలని సమావేశంలో నిర్ణయించారు.
చంద్రబాబుకు రేవంత్ డిన్నర్
AP And TG CMs Meeting: ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారులకు సీఎం రేవంత్ ప్రజాభవన్‌లో డిన్నర్ ఏర్పాటు చేశారు. చర్చల అనంతరం ఇరు రాష్ట్రాల నేతలు విందులో పాల్గొన్నారు. కాగా, భేటీ వివరాలను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాకు వెల్లడించనున్నారు.
ప్రజా భవన్ నుంచి వెళ్లిపోయిన చంద్రబాబు
రేవంత్ తో భేటీ ముగిసిన అనంతరం చంద్రబాబు డిన్నర్ చేశారు. డిన్నర్ అయ్యాక ఏపీ సీఎం చంద్రబాబు ప్రజా భవన్ నుంచి వెళ్లిపోయారు.
డిన్నర్ అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించనున్న భట్టి విక్రమార్క
ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ ముగిసింది. విభజన సమస్యల పరిష్కారానికి రెండు కమిటీలు వేయాలని సీఎంలు నిర్ణయం తీసుకున్నారు. మీటింగ్ లో పాల్గొన్న నేతలు, అధికారులు డిన్నర్ చేస్తున్నారు. డిన్నర్ అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు.