CM Chandrababu: సత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Andhra Pradesh News శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతిచెందడంపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Sri Sathya Sai district | అమరావతి : సత్యసాయి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరిగి మండలం, ధనాపురం వద్ద ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో అలివేలమ్మ, ఆదిలక్ష్మీ, సుంకమ్మ అనే ముగ్గురు మహిళలు మృత్యువాత పడటంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వీరు రొద్దం మండలం, దొడగట్ట గ్రామానికి చెందినవారు. మృతుల కుటుంబాలకు చంద్రబాబు సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. ప్రమాదంలో గాయపడిన మరో 10 మంది క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. హిందూపురం రూరల్ మండలం కోటిపి చౌడేశ్వరిదేవి జాతరకు వెళ్లి తిరిగి వస్తుండగా హిందూపురం-సిరా హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.
ఆటోను ఢీకొన్న గుర్తుతెలియని వాహనం, ముగ్గురు మహిళలు మృతి
పరిగి: శ్రీసత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ముగ్గురు మహిళలు మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. పరిగి మండలం ధనపురం క్రాస్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.
గాయపడిన వారిని హిందూపురం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను అలివేలమ్మ (45), ఆదిలక్ష్మమ్మ, సుంకమ్మగా గుర్తించారు. హిందూపురంలోని కోటిపి చౌడేశ్వరి ఆలయానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 14 మంది వరకు ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. వీరంతా రొద్దం మండం దొడగట్ట వాసులుగా పోలీసులు గుర్తించారు.






















