Myanmar Earthquake: మయన్మార్‌లో మరో భారీ భూకంపం, వరుస భూ ప్రకంపనలతో వణికిపోతున్న ప్రజలు
Earthquake In Myanmar: వరుస భూకంపాలతో మయన్మార్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏప్రిల్ 13న ఉదయం మయన్మార్‌లో మరోసారి భారీ భూకంపం సంభవించింది.

Myanmar Earthquake: మయన్మార్‌లో మరో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం 5.6 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూరోపియన్ మెడిటేరియన్ సిస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది. 35 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మయన్మార్ లో 5.1 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని పేర్కొంది.
ఇటీవల 7కి పైగా తీవ్రతతో భారీ భూకంప సంభవించడంతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఆ భూకంపంలో 4 వేలకు పైగా మృతిచెందారు. వేలాది మంది గాయపడ్డారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిధిలాల కింద నాలుగైదు రోజుల తరువాత సైతం కొందరు ప్రాణాలతో బయటపడ్డ వీడియోలు వైరల్ అయ్యాయి. తాజాగా మరోసారి పలుచోట్ల భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందోనని బిక్కిచిక్కుమంటూ గడుపుతున్నారు.
EQ of M: 5.1, On: 13/04/2025 07:54:58 IST, Lat: 21.13 N, Long: 96.08 E, Depth: 10 Km, Location: Myanmar.
— National Center for Seismology (@NCS_Earthquake) April 13, 2025
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjcVGs @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/Fr8qprdNdt
మయన్మార్ ప్రజలకు పీడకల ఆ భూకంపం..
మార్చి 28న మయన్మార్‌లో 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఆ భూకంపం తరువాత దాదాపు 100 సార్లకు పైగా మయన్మార్ వ్యాప్తంగా భూ ప్రకంపనలు సంభవించాయని ఆ దేశ వాతావరణ శాస్త్ర, జల శాస్త్ర విభాగం అధికారులు తెలిపారు. కనిష్టంగా రిక్టర్ స్కేలుపై తీవ్రత 2.8 నుండి 7.5 వరకు తీవ్రతతో భూకంపాలు సంభవించాయని మయన్మార్ ప్రభుత్వం చెబుతోంది. సాగింగ్, మండలే, మాగ్వే లాంటి పట్టణాలలో 80 శాతానికి పైగా భవనాలు దెబ్బతిన్నాయి. ఇటీవల సంభవించిన భారీ భూకంపంలో 4 వేలకు పైగా మయన్మార్ పౌరులు ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది గాయపడి ఆస్పత్రుల్లో, సహాయక శిబిరాలలో చికిత్స పొందుతున్నారు.
దేశవ్యాప్తంగా 500,000 కంటే ఎక్కువ మంది ప్రజలు ఆరోగ్య సంరక్షణ పొందలేకపోతున్నారని ఐక్యరాజ్యసమితి మానవతా వ్యవహారాల సమన్వయ కార్యాలయం నివేదించింది. మయన్మార్ లో భారీ విపత్తు అనంతరం భారత్ సహాలు మరికొన్ని దేశాలు ఆ దేశానికి ఆపన్నహస్తం అందించాయి. వారికి ఆహారం, నీళ్లు, మెడికల్ కిట్లు లాంటివి పంపి సహాయం చేశారు.
మయన్మార్‌కు భారత్ ఆపన్నహస్తం.. ఆపరేషన్ బ్రహ్మతో సహకారం
భారతదేశం, యూరోపియన్ యూనియన్, అమెరికా, ఐక్యరాజ్యసమితి, అనేక అంతర్జాతీయ సంస్థలు మయన్మార్‌లో భూకంప బాధితుల కోసం సహాయం చేశాయి. రెస్క్యూ బృందాలను పంపుతూనే, మరోవైపు వారికి ఆహారం, నిత్యావసర సరుకులు పంపారు. భారతదేశం ఆపరేషన్ బ్రహ్మను చేపట్టి, భూకంప బాధితులకు సహాయం కొనసాగించింది. 'నైబర్‌హుడ్ ఫస్ట్', 'యాక్ట్ ఈస్ట్' విధానాలకు అనుగుణంగా మయన్మార్ కు ఆపన్నహస్తం అందించిన తొలి దేశంగా భారత్ నిలిచింది. భారతదేశం మయన్మార్‌కు టన్నుల కొద్దీ మెడికల్ సామాగ్రి, ఆహారం, నీళ్లు, ఇతర సహాయ సామగ్రిని పంపి తమ వంతు సహకారం అందించింది.




















