Earthquake Alerts on Mobile: మీ స్మార్ట్‌ఫోన్లకు భూకంపం అలర్ట్స్ రావాలా?- ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు ఇలా చేస్తే సరి
Nepal Earthquake Today | ఇటీవల తరచుగా ఏదో ప్రాంతంలో భూకంపాలు సంభవిస్తున్నాయి. అయితే ఓ మోస్తరు భూకంపాలు సంభవించే సమయలో మీ స్మార్ట్‌ఫోన్లలో అలర్ట్స్ పొందవచ్చు.
Earthquake Alerts On Smartphone | నేపాల్, టిబేట్ సరిహద్దులో సంభవించిన భారీ భూకంపం కారణంగా 53 మంది మృతిచెందారు. రిక్టర్ స్కేలుపై 6.8, 7.1 తీవ్రతతో డింగ్రీ కౌంటీలో భూకంపం సంభవించినట్లు చైనా మీడియా రిపోర్ట్ చేసింది. భూకంపం ప్రభావంతో భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. మృతుల సంఖ్య సైతం క్రమంగా పెరిగే అవకాశం ఉందని చైనా మీడియా తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీ సహా పరిసర ప్రాంతాలు, బిహార్ పశ్చి బెంగాల్ రాష్ట్రాల్లో భూమి కంపించింది.
అయితే భూకంపం సంభవించడానికి సంబంధించిన అలర్ట్స్ మీరు స్మార్ట్ ఫోన్‌లలో పొందవచ్చు.
స్మార్ట్‌ఫోన్‌లలో భూకంప హెచ్చరికలు ఎలా తెలుసుకోవాలి?
ప్రస్తుతం టెక్నాలజీ మరింతగా పెరిగింది. స్మార్ట్‌ఫోన్లలో యాక్సిలరోమీటర్‌లు అమర్చి ఉంటున్నాయి. దాంతో అవి భూకంపాన్ని, భూ ప్రకంపనలను కాస్త ముందుగానే గుర్తించే ఛాన్స్ ఉంది. సెంట్రల్ సర్వర్ ద్వారా భూకంప సంబంధిత ఈ సంకేతాలు ప్రాసెస్ అవుతాయి. ముఖ్యంగా భూకంప ప్రభావిత ప్రాంతంలోని వినియోగదారులను ఇవి హెచ్చరిస్తాయి. దాంతో ప్రాణనష్టం జరగకుండా చూడవచ్చు.
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో భూకంప అలర్ట్‌లను ఎలా సెటప్ చేయాలంటే
- ముందుగా ఫోన్లో సెట్టింగ్‌స్ యాప్ తెరవండి.
- అందులో భద్రత, అత్యవసర స్థితి (Safety and Emergency)కి నావిగేట్ చేయాలి
- అందులో భూకంప హెచ్చరికల (Earthquake Alerts) టోగుల్‌ని యాక్టివ్ చేయాలి
ఐఫోన్‌లో భూకంప అలర్ట్స్ ఎలా సెటప్ చేయాలంటే
- ముందుగా మీ ఐఫోన్ సెట్టింగ్స్‌కు వెళ్లండి.
- ఆపై నోటిఫికేషన్‌లను క్లిక్ చేయండి.
- కిందకు స్క్రోల్ చేసి అత్యవసర హెచ్చరికల (Emergency Alerts)పై టోగుల్ చేయాలి.
భూకంప అలర్ట్స్ కోసం MyShake యాప్ ఇన్‌స్టాల్
కొన్ని దేశాల్లో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. దాంతో సకాలంలో భూకంపానికి సంబంధించిన అలర్ట్స్ కోసం MyShake యాప్‌ని తీసుకొచ్చారు. Android మరియు iOS యూజర్లు సైతం మై షేక్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది అన్ని రకాల యూజర్లకు అందుబాటులో ఉంది.
గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store) లేక యాపిల్ ప్లే స్టోర్ (Apple App Store) నుంచి మీరు మై షేక్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
- ముందుగా యూజర్లు మీ స్మార్ట్ ఫోన్లో మై షేక్ యాప్ డౌన్ లోడ్ చేసుకోండి. ఫోన్లో యాప్ సెటప్ చేయడానికి కావలసిన సూచనలు పాటిస్తూ లోకేషన్ యాక్సెస్ సైతం ఇవ్వాలి. అంతా ఓకే అయితే మీ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 4.5 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో సంభవించే భూకంపాల అలర్ట్స్ పొందుతారు. గ్రౌండ్ సెన్సార్‌ల నెట్‌వర్క్ ద్వారా మై షేక్ యాప్ భూకంపం అలర్ట్స్ అందిస్తుంది.
Also Read: Aadhaar Card Sim Limit: మీ ఆధార్ నంబర్‌పై ఎన్ని సిమ్ కార్డులు ఉండవచ్చు? - ఎక్కువ ఉంటే ఏం అవుతుంది?
భూకంప అలర్ట్ సిస్టమ్ ఎలా పని చేస్తుంది..
గూగుల్ భూకంప హెచ్చరికల వ్యవస్థ (Earthquake Alet System) రెండు రకాల నోటిఫికేషన్‌లను ఉపయోగిస్తుంది.
అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్: తేలికపాటి భూకంపాలు వచ్చినప్పుడు (MMI 3 & 4) ద్వారా ట్రిగ్గర్ అవుతుంది. ఈ స్థాయిలో భూకంపం సంభవించినా ఏ ప్రమాదం ఉండదు. ఈ స్థాయిలో భూ ప్రకంపనలు వచ్చినప్పుడు ఇంట్లోని వస్తువులు, ఫ్యాన్లు కదలినట్లు కనిపిస్తాయి.
చర్యలు తీసుకోవాలనే అలర్ట్స్: రిక్టర్ స్కేలుపై అధిక తీవ్రత నమోదయ్యే భూకంపాల కోసం ఈ అలర్ట్స్ పంపుతుంది. MMI 5+ సంకేతాల అలర్ట్స్ వచ్చాయంటే ఇంటి నుంచి సాధ్యమైనంత త్వరగా బయటకు వెళ్లాలని సూచిస్తుంది. కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో, మనం వార్తలు చూడలేని సమయంలో మీ వెంట ఉండే స్మార్ట్ ఫోన్లు అలర్ట్స్ చూసి మీరు ఇబ్బందుల బారిన పడకుండా చూసుకునే వీలుంటుంది. అధికారుల ప్రకటన వచ్చే వరకు ఎదురుచూడకుండా ఈ తరహా వార్నింగ్ వచ్చినప్పుడు ప్రజలు సకాలంలో స్పందించి వారి ప్రాణాలు కాపాడుకోవచ్చు. ఆస్తి నష్టాన్ని మాత్రం మనం తప్పించలేం. విలువైన మన ప్రాణాలను రక్షించుకునే వీలుంటుంది.