Love Me Movie Review - 'లవ్ మీ' మూవీ రివ్యూ: దెయ్యంతో ప్రేమకథ - బావుందా? భయపెడుతుందా?
Love Me Review In Telugu: ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన సినిమా 'లవ్ మీ'. ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
అరుణ్ భీమవరపు
ఆశిష్, వైష్ణవి చైతన్య, రవికృష్ణ, సంయుక్త తదితరులు
Love Me Movie Review In Telugu: 'దిల్' రాజు సోదరుడు శిరీష్ కుమారుడు ఆశిష్ హీరోగా నటించిన సినిమా 'లవ్ మీ'. ఇఫ్ యు డేర్... అనేది ఉపశీర్షిక. వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) హీరోయిన్. అరుణ్ భీమవరపు దర్శకుడు. ఎంఎం కీరవాణి సంగీతం, పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణం అందించారు. దెయ్యంతో ప్రేమకథ అనే కాన్సెప్ట్ ప్రేక్షకుల్లో సినిమాపై క్యూరియాసిటీ చూపించింది. మరి, సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథ (Love Me Movie Story): అర్జున్ (ఆశిష్) డిఫరెంట్ పర్సన్. బ్లాక్ డ్రస్ వేసుకుని చెప్పులు లేకుండా తిరుగుతాడు. ఎవరైనా ఏదైనా వద్దని చెబితే... అది చేయడం అతనికి అలవాటు. చేసి వీడియోలు తీసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తారు. సిటీకి దూరంగా పాడుబడిన బంగ్లాలో దివ్యవతి దెయ్యం అనే ఉందని, ఆ బంగ్లాలోకి వెళ్లిన వాళ్లందర్నీ చంపేస్తుందని ప్రచారంలో ఉంటుంది. దివ్యవతిని రెండోసారి చూడటం ఎవరి తరమూ కాదని చెబుతాడు ప్రతాప్ (విరూపాక్ష రవికృష్ణ). దాంతో ఆ బంగ్లాకు వెళతాడు అర్జున్.
అర్జున్ దివ్యవతిని చూశాడా? లేదా? అర్జున్ అంటే భయమని చెప్పే ప్రియా (వైష్ణవి చైతన్య) అతడితో ఎలా ప్రేమలో పడింది? దివ్యవతిని వెతికే క్రమంలో అర్జున్, ప్రతాప్ పరిశోధనలో బయటకు వచ్చిన పల్లవి (రుహానీ శర్మ), నూర్ (దివి వడ్త్యా), ఛరిష్మా (దక్షా నాగర్కర్) ఎవరు? ప్రతాప్ ఊరిలో చిన్నప్పుడు మరణించిన మహిళకు, ఈ కథకు ఏమైనా సంబంధం ఉందా? ఈ కథలో పింకీ (సిమ్రాన్ చౌదరి) పాత్ర ఏమిటి? అసలు దివ్యవతి ఎవరు? అనేది అర్జున్ తెలుసుకున్నాడా? లేదా? ఒకవేళ తెలుసుకుంటే... ఆ తర్వాత బతికాడా? లేదా? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ (Love Me Review Telugu): భయం... ప్రతి ఒక్కరినీ భయపెట్టే విషయం ఏదో ఒకటి ఉంటుంది. ఆ భయాన్ని బయటపెట్టకుండా ఏదో ఒక ముసుగు వేసి ప్రజల్లో తిరుగుతుంటారు. ఆ భయం గురించి, మనలో భ్రాంతి గురించి డిస్కస్ చేసే సినిమా 'లవ్ మీ - ఇఫ్ యు డేర్'. దీనికి హారర్ ముసుగు వేశారు దర్శకుడు అరుణ్ భీమవరపు.
అరుణ్ భీమవరపు కథలో విషయం ఉంది. కానీ, కథనంలో కాస్త గందరగోళం కూడా ఉంది. అంటే... హీరో హీరోయిన్స్ క్యారెక్టరైజేషన్స్ నుంచి సన్నివేశాల వరకు చాలా డీటెయిలింగ్ చేశారు. హీరో బ్లాక్ డ్రస్ ఎందుకు వేస్తున్నారు? చెప్పులు లేకుండా ఎందుకు తిరుగుతున్నాడు? అనే ప్రశ్నల నుంచి మొదలు పెడితే... ట్విస్టుల వరకు ఎక్స్‌ప్లెనేషన్ రాసుకున్నారు. కానీ, ఆయన డిటెయిలింగ్ రిజిస్టర్ కావడం కష్టం. ప్రేక్షకులకు ట్విస్ట్స్ ఎక్కువ ఇవ్వాలని స్టార్టింగ్ నుంచి ప్రశ్నల మీద ప్రశ్నలు వదులుతూ వెళ్లారు. దాంతో కన్‌ఫ్యూజన్ క్రియేట్ అయ్యింది.
'లవ్ మీ' ఫస్టాఫ్ చూసిన తర్వాత ఏం జరుగుతుంది? అనే సందేహం కలుగుతుంది. సెకండాఫ్ చూసేటప్పుడు ల్యాగ్ ఎక్కువైంది. ఐడియాగా చూసినప్పుడు 'లవ్ మీ - ఇఫ్ యు డేర్' ఎగ్జైట్ చేస్తుంది. కానీ, ఎగ్జిక్యూషన్ పరంగా మిస్టేక్స్ జరిగాయి. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ తర్వాత దెయ్యం ఎవరు? అనే విషయంలో మలుపులు తిప్పుతూ ఎక్కువ కన్‌ఫ్యూజన్ చేశారు. ఎండింగ్ బావుంది. సీక్వెల్ ఉందని హింట్ ఇచ్చారు. పాటలు, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బావున్నాయి.
Also Read: రాజు యాదవ్ రివ్యూ: సోలో హీరోగా గెటప్ శ్రీను నటించిన సినిమా... ఎలా ఉందంటే?
హీరోగా ఆశిష్ (Hero Ashish Reddy) రెండో చిత్రమిది. అర్జున్ పాత్రలో ఆయన హ్యాండ్సమ్‌గా కనిపించారు. యాక్టింగ్ పరంగా పరిణితి చూపించారు. పతాక సన్నివేశాల్లో ఎమోషనల్ సీన్స్ బాగా చేశారు. ప్రియా పాత్రలో 'బేబీ' ఫేమ్ వైష్ణవి చైతన్య లుక్స్, నటన ఓకే. రవికృష్ణకు 'విరూపాక్ష' తరహాలో యాక్టింగ్ చూపించే స్కోప్ ఉన్న రోల్ కాదు. ఉన్నంతలో బాగా చేశారు. మిగతా ఆర్టిస్టులు ఓకే.
'లవ్ మీ - ఇఫ్ యు డేర్'... ఒక యునీక్ హారర్ థ్రిల్లర్. రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్స్ మధ్యలో కొత్తగా ఉంటుంది. ఐడియా పరంగా సినిమా చాలా బావుంది. ఫస్టాఫ్ కూడా ఎగ్జైట్ చేస్తుంది. సెకండాఫ్‌లో ల్యాగ్ వల్ల కొంత సైడ్ ట్రాక్ వెళుతుంది. కానీ, మళ్ళీ ఎండింగ్‌లో సీక్వెల్ మీద క్యూరియాసిటీ పెంచారు. డిఫరెంట్ సినిమాల కోసం ఎదురు చూసే ప్రేక్షకులను మెప్పిస్తుంది. డిఫరెంట్ హారర్, లవ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.