Good Luck Sakhi Movie Review - 'గుడ్ లక్ సఖి' మూవీ రివ్యూ: కీర్తీ సురేష్ సినిమా ఎలా ఉందంటే?
Keerthy Suresh & Aadhi Pinisetty's Good Luck Sakhi Movie Review: కీర్తీ సురేష్ ప్రధాన పాత్రలో, క్రీడా నేపథ్యంలో రూపొందిన సినిమా 'గుడ్ లక్ సఖి'. నేడు థియేటర్లలో విడుదల అయ్యింది. మరి, సినిమా ఎలా ఉంది?
Nagesh Kukunoor
Keerthy Suresh, Aadhi Pinisetty, Jagapati Babu, Rahul Ramakrishna and Others
సినిమా రివ్యూ: గుడ్ లక్ సఖి
రేటింగ్: 2/5
నటీనటులు: కీర్తీ సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ తదితరులు
సినిమాటోగ్రఫీ: చిరంతాన్ దాస్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నిర్మాణ సంస్థ: వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ సహ నిర్మాత: శ్రావ్యా వర్మ సమర్పణ: 'దిల్' రాజు (శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్)
నిర్మాత: సుధీర్ చంద్ర పదిరి
దర్శకత్వం: నగేష్ కుకునూర్
విడుదల తేదీ: జనవరి 28, 2022
'మహానటి'తో ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం అందుకున్న కథానాయిక కీర్తీ సురేష్. 'హైదరాబాద్ బ్లూస్', 'తీన్ దీవారే', 'ఇక్బాల్', 'లక్ష్మి', 'ధనక్' వంటి అవార్డు విన్నింగ్ ఫిల్మ్స్ తీసిన దర్శకుడు నగేష్ కుకునూర్. వీళ్లిద్దరి కలయికలో రూపొందిన సినిమా 'గుడ్ లక్ సఖి'. ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది? కీర్తీ సురేష్ ఎలా నటించారు? నగేష్ కుకునూర్ సినిమా ఎలా తీశారు?
కథ: దేశం గర్వించదగ్గ షూటర్స్ ను తయారు చేయాలని ఒక కల్నల్ (జగపతి బాబు) సొంతూరు వస్తాడు. ఆ ఊరిలో, తండాలో సఖి (కీర్తీ సురేష్) అని ఓ అమ్మాయి ఉంటుంది. అందరూ ఆమెను బ్యాడ్ లక్ సఖి అంటుంటారు. సఖి అంటే బ్యాడ్ అనే సెంటిమెంట్ జనాల్లో ఉంటుంది. అదే సమయంలో చిన్ననాటి స్నేహితుడు గోలి రాజు (ఆది పినిశెట్టి) మళ్లీ ఊరు వస్తాడు. ఆమెను కల్నల్ దగ్గరకు తీసుకు వెళతాడు. సఖిలో ప్రతిభ గుర్తించిన కల్నల్ ఆమెకు శిక్షణ ఇస్తాడు. రాష్ట్ర స్థాయి షూటింగ్ పోటీలకు ఆమె వెళుతుంది. అక్కడ గెలిచిందా? లేదా? సఖి మీద ఎప్పటి నుంచో కన్నేసిన సూరి (రాహుల్ రామకృష్ణ) ఏం చేశాడు? సఖి కల్నల్ దగ్గరకు కావడంతో గోలి రాజు ఎందుకు బాధ పడ్డాడు? సఖిని బ్యాడ్ లక్ సఖి అని ఆమె మనసుకు ఎందుకు గాయం చేశాడు? సఖి ఎవరిని ప్రేమించింది? గోలి రాజు... కల్నల్... ఇద్దరిలో ఎవర్ని 'నన్ను పెళ్లి చేసుకుంటావా' అని అడిగింది? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ: 'గుడ్ లక్ సఖి' సినిమా కంటే ముందు... సినిమాలో నటీనటుల గురించి మాట్లాడుకోవాలి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం గురించి మాట్లాడుకోవాలి. కీర్తీ సురేష్, జగపతి బాబు, ఆది పినిశెట్టి, రాహుల్ రామకృష్ణ... వీరంతా గతంలో తమ ప్రతిభను నిరూపించుకున్నారు. ఈ 'గుడ్ లక్ సఖి'లో కీర్తీ సురేష్‌కు తండాలో అమ్మాయి పాత్ర దక్కింది. లుక్స్, కాస్ట్యూమ్స్ పరంగా కొత్తగా కనిపించారు. నటిగా పాత్రకు పరిధి మేరకు చేశారు. అమ్మాయకపు పల్లెటూరి పాత్రలో కీర్తీ సురేష్ సరిగ్గా సరిపోయారు.
నాటకాలు వేసే యువకుడిగా ఆది పినిశెట్టికి వైవిధ్యమైన పాత్ర లభించింది. అర్జునుడిగా, ఘటోత్కచుడిగా గెటప్స్ వేసే అవకాశం వచ్చింది. గెటప్పుల్లో బావున్నారు. అయితే... యాక్టింగ్‌కు వస్తే ఆ గెటప్స్ ఇంపార్టెన్స్ తక్కువ. సగటు ప్రేమికుడి పాత్ర ఆయనది. జగపతిబాబు కోచ్ రోల్ చేశారు. ఆయన వల్ల పాత్రకు హుందాతనం వచ్చింది. ఆ డైలాగులకు వేల్యూ పెరిగింది. రాహుల్ రామకృష్ణ సహజంగా నటించారు. షూటర్ పాత్రలో శ్రావ్యా వర్మ, హీరోయిన్ స్నేహితురాలిగా దివ్య శ్రీపాద, ఇతర పాత్రల్లో రఘుబాబు వంటి నటులు కనిపించారు. కానీ, ఎవరి పాత్రలూ గుర్తుంచుకునే విధంగా ఉండవు.
దేవి శ్రీ ప్రసాద్ అందించిన స్వరాల్లో 'ఇంత అందంగా ఉంటుందా లోకం' పాట బావుంది. 'బ్యాడ్ లక్ సఖి' సాంగ్ డిఫరెంట్ గా ఉంటుంది. మిగతావి కథకు తగ్గట్టు ఉన్నాయి. పాటల కంటే నేపథ్య సంగీతం బావుంది. పల్లెటూరి వాతావరణం ప్రతిబింబించేలా లొకేషన్స్ ఎంపిక చేసుకున్నారు. అందుకు ఆర్ట్ డిపార్ట్మెంట్‌ను అభినందించాలి. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటింగ్ నీట్ గా ఉంది. కీర్తీ సురేష్, ఆది పినిశెట్టి కాస్ట్యూమ్స్ విషయంలో సహ నిర్మాత శ్రావ్యా వర్మ తీసుకున్న శ్రద్ధ తెరపై కనిపించింది.
నటీనటులు, సంగీతం, మిగతా సాంకేతిక నిపుణుల పనితీరును పక్కన పెడితే... కథ, కథనం, దర్శకత్వం విషయంలో సినిమా నిరాశ పరుస్తుంది. క్రీడా నేపథ్యంలో ఇటీవల కొన్ని సినిమాలు వచ్చాయి. ప్రేక్షకులను ఆకట్టుకున్నవి తక్కువ, బోల్తా కొట్టినవి ఎక్కువ. బోల్తా కొట్టిన సినిమాలపై ప్రేక్షకుల నుంచి వచ్చిన ఏకైక కంప్లయింట్... స్టోరీ, స్క్రీన్ ప్లే రొటీన్‌గా ఉన్నాయని! 'గుడ్ లక్ సఖి' విషయంలో కూడా ఆ కంప్లయింట్ వినిపిస్తుంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు తీసేటప్పుడు హీరో/హీరోయిన్ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ... విజయాలు సాధించడం, ఆ తర్వాత ఆశించిన రీతిలో ఆడకుండా కిందకు పడి మళ్లీ విజయం సాధించడం అనేది కామన్ అయ్యింది. ఈ సినిమా కూడా సేమ్ రూటులో వెళుతుంది. ఆ వెళ్లే రూట్ కూడా ఆసక్తికరంగా కాకుండా చప్పగా సాగుతుంది. దాంతో ప్రేక్షకుడిలో విసుగు మొదలవుతుంది. కోచ్ - స్టూడెంట్ మధ్య లవ్ విషయంలో వెంకటేష్ 'గురు'ను ఫాలో కాకుండా కొంచెం కొత్తగా తీద్దామని ప్రయత్నించారు. ప్రేమ, గౌరవం అంటూ వివరించే ప్రయత్నం చేశారు. అయితే... ఆ సన్నివేశాలు కన్‌ఫ్యూజ్ క్రియేట్ చేస్తాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే... ఇదొక రొటీన్ స్పోర్ట్స్ డ్రామా. నగేష్ కుకునూర్ ట్రాక్ రికార్డ్ చూసి థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులను నిరాశ పరిచే సినిమా.