Prem Kumar Review - 'ప్రేమ్ కుమార్' రివ్యూ : పీటల మీద పెళ్లి ఆగితే? ఈసారైనా సంతోష్ శోభన్‌కు హిట్ వస్తుందా?
Prem Kumar Review in Telugu : యువ హీరో సంతోష్ శోభన్ నటించిన తాజా సినిమా 'ప్రేమ్ కుమార్'. రాశి సింగ్, రుచితా సాధినేని హీరోయిన్లు. కృష్ణ చైతన్య ప్రధాన పాత్ర చేశారు. ఈ సినిమా ఎలా ఉందంటే?
అభిషేక్ మహర్షి
సంతోష్ శోభన్, కృష్ణ తేజ, రాశి సింగ్, రుచితా సాధినేని తదితరులు
సినిమా రివ్యూ : ప్రేమ్ కుమార్
రేటింగ్ : 2/5
నటీనటులు : సంతోష్ శోభన్, రాశి సింగ్, రుచితా సాధినేని, కృష్ణ చైతన్య, కృష్ణ తేజ, సుదర్శన్, అశోక్ కుమార్, శ్రీ విద్య, రాజ్ మాదిరాజు, సురభి ప్రభావతి తదితరులు
కథ : అభిషేక్ మహర్షి, అనిరుధ్ కృష్ణమూర్తి
పాటలు : కిట్టూ విస్సాప్రగడ
ఛాయాగ్రహణం : రాంపీ నందిగాం
సంగీతం : ఎస్. అనంత్ శ్రీకర్
నిర్మాత : శివప్రసాద్ పన్నీరు
రచన, దర్శకత్వం : అభిషేక్ మహర్షి
విడుదల తేదీ: ఆగస్టు 18, 2023
నటుడిగా పలు చిత్రాల్లో మెరిసిన రచయిత అభిషేక్ మహర్షి (Abhishek Maharshi). ఆయన దర్శకుడిగా పరిచయమైన సినిమా 'ప్రేమ్ కుమార్' (Prem Kumar Movie). ఇందులో సంతోష్ శోభన్ కథానాయకుడు. రాశి సింగ్, రుచితా సాధినేని హీరోయిన్లు. ప్రేమ, పెళ్లి నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. మరి, సినిమా ఎలా ఉంది (Prem Kumar Review)? సంతోష్ శోభన్ (Santosh Shoban)కు హిట్ ఇచ్చిందా? లేదా?
కథ (Prem Kumar Story) : ప్రేమ్ కుమార్ (సంతోష్ శోభన్), నేత్ర (రాశి సింగ్) పెళ్లి మండపంలో ఉన్నారు. కాసేపట్లో మూడు ముడులు పడతాయనగా... రోషన్ బాబు (కృష్ణ చైతన్య) వచ్చి పెళ్లి ఆపేస్తాడు. తానూ, నేత్ర ప్రేమించుకున్నామని... తమకు పెళ్లి చేయమని కోరతాడు. నేత్ర తండ్రి (రాజ్ మాదిరాజు) ఓకే అని పిల్లను ఇచ్చి పంపించేస్తాడు. ఆ తర్వాత ప్రేమ్ కుమార్ మరో పెళ్లికి రెడీ అవుతాడు. అదీ క్యాన్సిల్! పెళ్లి చూపులకు అయితే లెక్క లేదు. ఆ ట్రాక్ రికార్డు అలా కంటిన్యూ అవుతుంది. పెళ్లి కావడం లేదని ఫ్రస్ట్రేషన్‌లో ప్రేమ్ కుమార్.... స్నేహితుడు సుందర్ లింగం (కృష్ణ తేజ)తో కలిసి డిటెక్టివ్ ఏజెన్సీ పెడతాడు. ప్రేమ లేదా పెళ్లి జంటలను విడగొట్టడం వీళ్ళ స్పెషాలిటీ. డబ్బులు బాగా వస్తుండటంతో హ్యాపీగా ఉంటారు. అటువంటి సమయంలో ప్రేమ్ కుమార్ దారికి నేత్ర అడ్డు వస్తుంది. దానికి కారణం ఏమిటి?
సినిమా ఇండస్ట్రీలో హీరో(రైజింగ్ స్టార్)గా ఎదిగిన రోషన్, నేత్రను కాకుండా అంగనా (రుచితా సాధినేని)ని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు రెడీ అయ్యాడు? ఆ విషయం తెలిసిన తర్వాత నేత్ర ఏం చేసింది? ప్రేమ్ కుమార్ దగ్గరకు అంగనా మనుషులు ఎందుకు వచ్చారు? చివరకు ఏమైంది? అనేది వెండితెరపై చూడాలి.
విశ్లేషణ (Prem Kumar Review) : 'ప్రేమ్ కుమార్'లో హీరోకి స్నేహితుడు ఐడియా ఇస్తుంటే... 'ఒరేయ్! ఇప్పటి వరకు నువ్వు ఇచ్చిన ఐడియా ఒక్కటైనా వర్కవుట్ అయ్యిందా?' అని అడుగుతాడు. సినిమా తీసేటప్పుడు సన్నివేశాలు వర్కవుట్ అవుతున్నాయా? లేదా? అని దర్శక, రచయితలు చెక్ చేసుకుని ఉంటే... 'ప్రేమ్ కుమార్' పరిస్థితి వేరేలా ఉండేది. బహుశా... పేపర్ మీద కామెడీ స్క్రీన్ మీదకు షిఫ్ట్ కాలేదేమో!దాంతో పీటల మీద పెళ్లి ఆగితే ఏం చేయాలో తెలియని పెళ్లి కొడుకులా తయారైంది ప్రేక్షకుల పరిస్థతి.
వినోదమే ప్రధానంగా తెరకెక్కిన చిత్రాలకు ప్రేక్షకులు విజయాలు అందిస్తున్నారు. కనుక, కథగా చూస్తే... 'ప్రేమ్ కుమార్' ఐడియా బావుందని చెప్పవచ్చు. ఈ రోజుల్లో పెళ్లి కాని యువతీ యువకులు, తమ ప్రేయసి / జీవిత భాగస్వామిపై అనుమానం ఉన్న జంటలు ఎక్కువ. అటువంటి వాళ్ళు కనెక్ట్ అయ్యే సన్నివేశాలు రాసుకునే వీలు ఉంది. బోలెడంత వినోదం పండించే ఆస్కారం ఉంది. అయితే, ఏ దశలోనూ ఆశించిన స్థాయిలో వినోదం పండలేదు. ఈ సన్నివేశానికి ఇంత చాలులే అన్నట్లు, తూతూ మంత్రంగా కథను నడిపించారు. ఎమోషనల్ సన్నివేశాలు ఏవీ కనెక్ట్ అయ్యేలా రాసుకోలేదు.
అభిషేక్ మహర్షి తీసిన సినిమాలోని కథలో విషయం ఉంది. కానీ, కథనం ఏమాత్రం ఆసక్తి కలిగించకుండా ముందుకు సాగింది. సినిమా మొదలైన కాసేపటికి ముగింపు, విశ్రాంతి తర్వాత కాసేపటికి కథనం ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. పాటలు పర్వాలేదు. హీరో ఫీలయ్యే సందర్భంలో వచ్చే పాట బావుంది. కానీ, అప్పటి వరకు నడిచిన కథనం వల్ల ప్రేక్షకులు గుర్తించడం కష్టం. నేపథ్య సంగీతం జస్ట్ ఓకే. ఇది ప్రయోగాత్మక లో బడ్జెట్ సినిమా. బిజినెస్ పరంగా పరిమితులు ఉన్నప్పటికీ నిర్మాత బాగానే ఖర్చు చేశారు.
నటీనటులు ఎలా చేశారంటే : ప్రేమ్ కుమార్ పాత్రకు సంతోష్ శోభన్ న్యాయం చేశారు. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ మిడిల్ క్లాస్ యువకుడిలా ఉంటుంది. ఆయన ఎంపిక చేసుకునే కథలకు అది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఈ సినిమాకు కూడా! ప్రేమ్ కుమార్ అలియాస్ పీకేగా పాత్రలో సంతోష్ శోభన్ ఒదిగిపోయారు. అంగనా పాత్రలో రుచితా సాధినేని ఉన్నంతలో చక్కగా చేశారు.
సంతోష్ శోభన్, రాశి సింగ్ మధ్య కెమిస్ట్రీ కంటే సంతోష్ శోభన్, నటుడు కృష్ణ తేజ మధ్య కామెడీ సీన్లలో కెమిస్ట్రీ బావుంది. వాళ్ళిద్దరూ కొన్నిసార్లు నవ్వించారు. హీరో మేనేజర్ డాడీ పాత్రలో సుదర్శన్ సైతం తనవంతు నవ్వించే ప్రయత్నం చేశారు. హీరో రోషన్ బాబు పాత్రలో నటించిన కృష్ణ చైతన్యకు విగ్రహ పుష్టి ఉంది. నటనపై ఇంకా దృష్టి పెట్టాలి. సంతోష్ శోభన్ తల్లిగా సురభి ప్రభావతి, రాశి సింగ్ తండ్రిగా రాజ్ మాదిరాజు పాత్రల పరిధి మేరకు నటించారు.
Also Read : మిస్టర్ ప్రెగ్నెంట్ రివ్యూ: సొహెల్ ‘పురుష గర్భం’ ప్రయోగం ఎలా ఉంది? డెలివరీ హిట్టా? ఫట్టా?
చివరగా చెప్పేది ఏంటంటే... : సినిమా ప్రారంభం బావుంది. ఆసక్తి కలిగించింది. ఆ తర్వాత క్రమక్రమంగా ఆసక్తి సన్నగిల్లుతూ శుభం కార్డుకు చేరుకుంది. విజయం కోసం సంతోష్ శోభన్ మరో ప్రయత్నం చేయక తప్పదు. నటుడిగా ఆయన వైపు నుంచి ఎటువంటి లోపం లేదు. కృష్ణ తేజతో కలిసి నవ్వించారు. కానీ... కామెడీ ఫుల్లుగా, ఆశించిన రీతిలో వర్కవుట్ కాలేదు. కొంత వరకు ఓకే. ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చెయవచ్చు.
Also Read : 'భోళా శంకర్' రివ్యూ : మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన సినిమా - ఎలా ఉందంటే?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial