TG EAPCET - 2025: తెలంగాణ ఎప్‌సెట్ దరఖాస్తుల స్వీకరణ వాయిదా, దరఖాస్తు ప్రారంభం ఎప్పుడంటే?
తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న 'టీజీఎప్‌సెట్ 2025 ' దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 25న ప్రారంభమైంది. ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

TG EAPCET 2025 Notification Details: తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల కోసం నిర్వహించనున్న 'టీజీఎప్‌సెట్ 2025' నోటిఫికేషన్‌ను జేఎన్‌టీయూ-హైదరాబాద్ ఫిబ్రవరి 20న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఫిబ్రవరి 25 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకావాల్సి ఉండగా.. టెక్నికల్ సమస్యల కారణంగా వాయిదా పడింది. ఈ విషయాన్ని జేఎన్‌టీయూహెచ్ వెబ్‌సైట్ ద్వారా ప్రకటించింది.
మార్చి 1 నుంచి దరఖాస్తుల స్వీకరణ..
సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్, బుక్‌లెట్ మార్చి 1 నుంచి అందుబాటులో ఉండనుంది. అదేరోజు నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. విద్యార్థులు ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎప్‌సెట్‌కు రూ.250 ఆలస్య రుసుమతో ఏప్రిల్ 9 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 14 వరకు, రూ.2500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 18 వరకు, రూ.5000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 24 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. దరఖాస్తు వివరాల్లో ఏమైనా తప్పులుంటే ఏప్రిల్ 6 నుంచి 8 వరకు ఎడిట్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ సమయంలోనే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు తమ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు ఎంతంటే?
➥ ఇంజినీరింగ్ లేదా అగ్రికల్చర్ & ఫార్మాలో ఏదో ఒకదానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.900 చెల్లించాలి.
➥ ఇంజినీరింగ్ లేదా అగ్రికల్చర్ & ఫార్మాలో ఏదో ఒకదానికి దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.500 చెల్లించాలి.
➥ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మా రెండు విభాగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.1800 చెల్లించాలి.
➥ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మా రెండు దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1000 చెల్లించాలి.
ఏప్రిల్ 29 నుంచి పరీక్షలు..
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు టీజీఎప్‌సెట్(TG EAPCET 2025) పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను విద్యార్థులు ఏప్రిల్ 19 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు; మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ విభాగాలకు ప్రవేశ పరీక్ష జరగనుంది. ఆయాతేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం, చివరి సంవత్సరం నుంచి 100 శాతం సిలబస్‌తో పరీక్ష నిర్వహించనున్నారు. ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ మూడు భాషల్లో ఎప్‌సెట్ పరీక్ష నిర్వహించనున్నారు.
ఆ కేటగిరీ కింద ఏపీ విద్యార్థులు అర్హులే..
ఎప్‌సెట్ ప్రవేశ పరీక్షకు సంబంధించి.. స్థానికత నిర్ధారణ అంశంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు వెలువడకపోవడం, ఇప్పటివరకు ఉన్న నాన్ లోకల్ కోటా 15 శాతంపైనా తుది నిర్ణయం తీసుకోకపోవడం తదితర కారణాల వల్ల ఏపీ విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. అయితే, ఇతరుల కేటగిరీ కింద మాత్రం ఏపీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని, వారికి విజయవాడ, కర్నూలులో పరీక్షా కేంద్రాలు ఉంటాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. నిపుణుల కమిటీ 95% సీట్లు స్థానికులకు, మిగిలిన 5% ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ వాసులకు లేదా అన్ని రాష్ట్రాల వారికి అంటూ ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
కన్వీనర్ కోటా కింద కాకుండా.. హైదరాబాద్ నగరంతోపాటు నగరం చుట్టుపక్కల ఉన్న ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఏపీ విద్యార్థులు మేనేజ్‌మెంట్ కోటా కింద ఎక్కువగా చేరుతుంటారు. నిబంధనల ప్రకారం ఆ సీట్లను జేఈఈ మెయిన్ ర్యాంకుతో, ఎప్‌సెట్ ర్యాంకుతోగానీ, ఇంటర్ మార్కుల మెరిట్ ఆధారంగాగానీ కేటాయించాల్సి ఉంటుంది. జేఈఈ మెయిన్ రాయకున్నా, మెరుగైన ర్యాంకు రాకున్నా.. రాష్ట్ర పరీక్ష అయిన ఎప్‌సెట్ ర్యాంకును పరిగణనలోకి తీసుకుంటారు. ఇప్పటికే కొన్ని కళాశాలల యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా సీట్లను అమ్ముకుంటున్నాయని, ఎప్‌సెట్ ర్యాంకు లేకుంటే దాన్ని సాకుగాచూపి అభ్యర్థుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. రాష్ట్రంలోని కళాశాలల్లో మేనేజ్‌మెంట్ (బీ-కేటగిరీ) కోటా కింద చేరాలనుకునే ఇతర రాష్ట్రాల వారు తెలంగాణ ఎప్‌సెట్ రాయడం మంచిదన్న నిపుణలు అభిప్రాయపడుతున్నారు.
ఎప్‌సెట్-2025 ద్వారా ప్రవేశాలు కల్పించే కోర్సులు..
➥ బీఈ, బీటెక్/బీటెక్(బయోటెక్)/బీటెక్(డెయిరీ టెక్నాలజీ)/ బీటెక్(అగ్రికల్చరల్ ఇంజినీరింగ్)/ బీఫార్మసీ/ బీటెక్(ఫుడ్ టెక్నాలజీ(FT)) / బీఎస్సీ(హానర్స్) అగ్రికల్చర్/ బీఎస్సీ(హానర్స్) హార్టికల్చర్/ బీఎస్సీ (ఫారెస్ట్రీ) /బీవీఎస్సీ & ఏహెచ్/ బీఎఫ్‌ఎస్సీ.
➥ ఫార్మా-డి.
➥ బీఎస్సీ(నర్సింగ్).
అర్హతలు: ఈ ఏడాది ఇంటర్ (ఎంపీసీ/ బైపీసీ) లేదా తత్సమాన పరీక్షలకు హాజరవుతున్నవారు, ఇంటర్ అర్హత ఉన్న విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. ఇంటర్‌లో కనీసం 45 శాతం మార్కులు ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
వయోపరిమితి: 31.12.2024 నాటికి ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సులకు 16 సంవత్సరాలలోపు ఉండాలి. అగ్రికల్చర్ సంబంధిత కోర్సులకు 17 - 22 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 3 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా.
పరీక్ష విధానం: మొత్తం 160 మార్కులకు ఆన్‌లైన్ విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో మ్యాథమెటిక్స్/ బయాలజీ నుంచి 80 ప్రశ్నలు- 80 మార్కులు, ఫిజిక్స్ నుంచి 40 ప్రశ్నలు-40 మార్కులు, కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు-40 మార్కులు. ప్రతిప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉండవు. ఇంటర్ మొదటి సంవత్సరం, చివరి సంవత్సరం నుంచి 100 శాతం సిలబస్‌తో పరీక్ష నిర్వహించనున్నారు. ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ మూడు భాషల్లో ఎప్‌సెట్ పరీక్ష నిర్వహించనున్నారు.
పరీక్ష కేంద్రాలు:
ఎప్‌సెట్ పరీక్షల నిర్వహణకోసం తెలంగాణతోపాటు ఏపీలోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణలో 16 పట్టణాలు/నగరాల్లో, ఏపీలో రెండు నగరాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. తెలంగాణలో నల్లగొండ, కోదాడ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేటలో కేంద్రాలను ఏర్పాటుచేయనున్నారు. ఇక ఏపీలో కర్నూలు, విజయవాడలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
ముఖ్యమైన తేదీలు..
| విషయం | తేదీ |
| నోటిఫికేషన్ వెల్లడి | 20-02-2025 |
| ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం | 01-03-2025 |
| ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది | 04-04-2025 |
| దరఖాస్తుల సవరణ | 06-04-2025 - 08-04-2025. |
| రూ.250 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది | 09-04-2025 |
| రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది | 14-04-2025 |
| రూ.2500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది | 18-04-2025 |
| రూ.5000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది | 24-04-2025 |
| హాల్‌టికెట్ డౌన్‌లోడ్ | 19-04-2025 |
|
పరీక్ష తేది (అగ్రి, ఫార్మా) |
29-04-2025 - 30-04-2025. 02-05-2025 - 05-05-2025 |





















