Israel Iran War: యుద్ధం మొదలైన మరుసటిరోజు అమెరికాతో చర్చలకు ఇరాన్ రెడీ? నివేదికలో సంచలన విషయాలు
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. యుద్ధం మొదలైన తర్వాత అమెరికా చర్చలకు రావాలని ఇరాన్ ప్రతిపాదించినట్లు న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ చేయగా.. ఇరాన్ దాన్ని ఖండించింది.

యుద్ధం ప్రారంభమైన ఒకరోజు తరువాత ఇరాన్ ఇంటెలిజెన్స్ కు చెందిన కొందరు వ్యక్తులు రహస్యంగా అమెరికా, ఇజ్రాయెల్ తో చర్చలకు సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది. న్యూయార్క్ టైమ్స్ బుధవారం ఒక నివేదికలో ఈ విషయాన్ని పేర్కొంది. యుద్ధాన్ని ముగించేందుకు చర్చల కోసం అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులను సంప్రదించాలని ఈరాన్ లోని కొందరు ప్రముఖులు కోరుకున్నారని నివేదిక పేర్కొంది. అయితే, ఈ నివేదికలో ఉన్న విషయాన్ని ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.
తస్నీమ్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం, ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన ఒక అధికారి మాట్లాడుతూ, యుద్ధాన్ని ముగించడానికి CIAతో చర్చలలో పాల్గొనడానికి తమ ఇంటెలిజెన్స్ మంత్రిత్వ శాఖ సిద్దంగా ఉందని సంకేతాలు ఇచ్చింది. యుద్ధం ప్రారంభమైన ఒక రోజు తర్వాత ఈ ప్రతిపాదన వచ్చిందన్నారు.
ఇరాన్ సార్వభౌమత్వంపై దాడి
ప్రస్తుతానికి ఈ విషయంపై పూర్తి వివరాలు అందుబాటులో లేవు. వైట్ హౌస్ లేదా CIA దీనిపై స్పందించలేదు. ఈ అంశంపై ఇరాన్ అధికారులు కూడా స్పందించడం లేదని ఆ నివేదిక పేర్కొంది. CIA ఈ ఆరోపణలపై స్పందించడానికి నిరాకరించింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేస్తున్న దాడిని తమ దేశ సార్వభౌమత్వంపై దాడిగా ఇరాన్ అభివర్ణించింది. యుద్ధం ఆపేందుకు అమెరికాతో చర్చలకు తమ ప్రభుత్వం ప్రయత్నించిందన్న విషయాన్ని జెనీవాలోని ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ రాయబారి ఖండించారు.
అమెరికా కూడా ఇరాన్ ఇంటెలిజెన్స్ అధికారుల అభిప్రాయాలను నమ్మలేదు. ఇరాన్ కొత్త నాయకత్వం తనతో చర్చలకు సిద్ధంగా ఉండగా, తాను అందుకు ఓకే చెప్పినట్లు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పేర్కొన్నారు. అయితే ఇరాన్ పోరాడుతుందని, అమెరికాతో చర్చలకు కొత్త నాయకత్వం సిద్ధమనేది కట్టుకథ అని తాత్కాలికంగా ఇరాన్ ప్రభుత్వాన్ని నడుపుతున్న వారు స్పందించారు.
మాట మార్చిన ట్రంప్..
ఇరాన్‌తో చర్చలకు చాలా ఆలస్యమైందని ట్రంప్ అన్నారు. చాలా మంది ఇరాన్ నేతలు, అధికారుల మృతితో పరిస్థితి మరింత దిగజారిందన్నారు. ‘మేం ఎవరి గురించి అయితే అనుకుంటున్నామో, వారిలో చాలా మంది ఇప్పటికే చనిపోయారు. దాడుల తరువాత మనం ఎవరినీ గుర్తించలేకపోవచ్చు. ఇరాన్ ను అణ్వస్త్ర ప్రయోగాలు చేయకుండా అడ్డుకునేందుకు మరికొన్ని రోజులపాటు యుద్ధం కొనసాగించి తీరతామని’ ట్రంప్ తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్ చేపట్టిన డ్రోన్ దాడులు, ఎయిర్ స్ట్రైక్స్‌లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇదివరకే మృతిచెందారు. ఆయన వారసుడిని ఎన్నుకోవడానికి ఇరాన్ కౌన్సిల్ సమావేశం నిర్వహించింది.
ట్రెండింగ్ వార్తలు























