Finn Allen Century: 33 బంతుల్లో సెంచరీతో ఫిన్ అలెన్ చరిత్ర.. 5 రికార్డులు బద్దలు కొట్టిన కివీస్ బ్యాటర్
Finn Allen Records: టీ20 ప్రపంచ కప్ తొలి సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికా జట్టుపై న్యూజిలాండ్‌కు చెందిన ఫిన్ అలెన్ 33 బంతుల్లో సెంచరీ చేయడంతో 5 పెద్ద రికార్డులను బద్దలు కొట్టాడు.

Finn Allen Century Records: టీ20 వరల్డ్ కప్ 2026 మొదటి సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ (Finn Allen) 33 బంతుల్లోనే సెంచరీ బాది ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఫిన్ అలెన్ ఆడిన ఈ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. నాకౌట్ మ్యాచులో అతడి స్ట్రైక్ రేట్ ఏకంగా 303.03గా నమోదైంది. ఫిన్ అలెన్ ఇన్నింగ్స్ కారణంగా న్యూజిలాండ్ జట్టు కేవలం 12.5 ఓవర్లలోనే 173/1 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఈ ఇన్నింగ్స్‌తో అలెన్ 5 రికార్డులను బద్దలు కొట్టాడు.
టీ20 వరల్డ్ కప్ అత్యంత వేగవంతమైన సెంచరీ
33 బంతుల్లో సెంచరీ చేయడం ద్వారా టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన బ్యాటర్‌గా ఫిన్ అలెన్ నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ క్రిస్ గేల్ పేరిట ఉండేది. గేల్ 2016 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై 47 బంతుల్లో సెంచరీ సాధించాడు.
ఫుల్ మెంబర్ టీమ్‌పై T20I లో వేగవంతమైన సెంచరీ
సాధారణంగా టీ20 ఇంటర్నేషనల్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ 27 బంతుల్లోనే పూర్తి చేశారు. కానీ ఆ సెంచరీని ఒక అసోసియేట్ టీమ్ ఆటగాడు మరో అసోసియేట్ టీంపై సాధించడంతో అంతగా ప్రయారిటీ ఉండదు. సెమీఫైనల్లో ఫిన్ అలెన్ చేసిన సెంచరీ ఫుల్ మెంబర్ టీమ్‌పై కనుక అత్యంత వేగవంతమైన సెంచరీగా రికార్డు నమోదైంది.
T20I లో మూడవ ఫాస్టెస్ట్ సెంచరీ
ఓవరాల్‌గా టీ20 ఇంటర్నేషనల్‌లో ఇది సంయుక్తంగా 3వ అత్యంత వేగవంతమైన సెంచరీ. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ 27 బంతుల్లో, రెండోది 29 బంతుల్లో నమోదయ్యాయి. ఈ జాబితాలో కివీస్ ఓపెనర్ ఫిన్ అలెన్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. అలెన్ కాకుండా, నమీబియాకు చెందిన జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, జింబాబ్వేకు చెందిన సికిందర్ రజా కూడా కేవలం 33 బంతుల్లో సెంచరీ సాధించారు.
ఫుల్ మెంబర్ టీం ప్లేయర్ అత్యంత వేగవంతమైన సెంచరీ
ఫుల్ మెంబర్ టీమ్ తరపున అత్యంత వేగవంతమైన టీ20 ఇంటర్నేషనల్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా ఫిన్ అలెన్ సంయుక్తంగా మొదటి స్థానంలో నిలిచాడు. ఇంతకుముందు ఫుల్ మెంబర్ టీమ్ (జింబాబ్వే) తరపున సికిందర్ రజా 33 బంతుల్లో సెంచరీ సాధించాడు.
టీ20 వరల్డ్ కప్ నాకౌట్‌లో మొదటి సెంచరీ
టీ20 వరల్డ్ కప్ నాకౌట్ దశలో సెంచరీ చేసిన ఫస్ట్ బ్యాటర్‌గా ఫిన్ అలెన్ నిలిచాడు. అంతకుముందు నాకౌట్ దశలో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు శ్రీలంకకు చెందిన తిలకరత్నే దిల్షాన్ పేరిట ఉండేది. లంక ఓపెనర్ దిల్షాన్ 2009 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో వెస్టిండీస్‌పై 96 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు.
ట్రెండింగ్ వార్తలు




















