Bomma Blockbuster Movie Review: ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ రివ్యూ: పాయింట్ కొత్తదే, కానీ..
నందు, రష్మీ గౌతమ్ జంటగా నటించిన ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ మూవీ ఎలా ఉంది? ప్రేక్షకులకు నచ్చుతుందా?
రాజ్ విరాట్
నందు, రష్మీ గౌతమ్, కిరీటి, దామరాజు, రఘు కుంచె తదితరులు
సినిమా రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్
రేటింగ్ 2.5/5
నటీనటులు : నందు, రష్మీ గౌతమ్, కిరీటి, దామరాజు, రఘు కుంచె తదితరులు
సమర్పణ: విజయీభవ ఆర్ట్స్
సినిమాటోగ్రఫీ: సుజాతా సిద్దార్థ్
సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి
ఎడిటింగ్: బీ.సుభాస్కర్
నిర్మాతలు: ప్రవీణ్ పగడాల, బోస్ బాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ
కథ-స్క్రీన్ ప్లే - దర్శకత్వం: రాజ్ విరాట్
విడుదల తేదీ: 04 నవంబర్ 2022
ఓటీటీ లు రాజ్యమేలుతున్న ఈ కాలంలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం అనే టాస్క్ పెద్ద పెద్ద బ్యానర్ల కు సైతం సాధ్యపడడం లేదు. ఎంత పెద్ద స్టార్ హీరోలు ఉన్నా కథలో కొత్తదనం లేకపోతే మాత్రం ఆడియన్స్ నిర్దాక్షిణ్యంగా ఎంత పెద్ద బడ్జెట్ తో తీసిన సినిమానైనా లెక్క చెయ్యని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో యువ నటుడు నందు ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి అతడి నమ్మకం నిలబడిందా?
కథ: ఈ సినిమా ప్రధానంగా ఇద్దరు వ్యక్తుల వేరు వేరు కథల సమాహారం అని చెప్పాలి. మత్య్సకారుడు పోతురాజు(నందు) సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ పై అభిమానం పెంచుకొని.. ఆయనకు చెప్పాలని ఒక సినిమా స్క్రిప్ట్ రాసుకుని హైదరాబాద్ వెళ్లే ప్రయత్నాల్లో ఉంటాడు. మరో వైపు నందు ఊళ్ళో పనీ పాటు లేని కుర్రాడు. రష్మీతో ప్రేమలో పడి ఆమె కోసం గొడవలు పడుతూ ఉంటాడు. ఆ క్రమంలో ఇద్దరూ ప్రేమలో పడతారు. పోతురాజు, నందుల కథలకు సంబంధం ఏమిటీ? వారు ఎలా కలుస్తారు? వాళ్లకి ఎదురైన చిక్కులు ఏంటి? వాటిని నందు ఎలా ఎదుర్కొన్నాడో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: ఈ సినిమాలో పూరి జగన్నాథ్ రిఫరెన్స్ లు చాలానే ఉన్నాయి. సినిమా అంతటా ఆయన ఫ్లేవర్ కనపడేలా కథ ఉంది. బహుశా దర్శకుడు రాజ్ విరాట్ స్వతహాగా ఆయన అభిమాని కావడం వల్ల ఆ లైన్ లోనే కథ రాసుకున్నట్టు కనిపిస్తుంది. లైన్ బాగుంది, విలేజ్ బ్యాక్ డ్రాప్ కావడంతో ఇటీవలి సినిమాలతో పోలిస్తే కొంత ఫ్రెష్ గా అనిపిస్తుంది. అయితే, కథ లోకి వెళ్లడానికి మాత్రం దర్శకుడు చాలా సమయం తీసుకున్నాడు. దీనివల్ల సినిమా మొదట్లో కాస్త స్లోగా నడచిన ఫీలింగ్ వస్తుంది. మెయిన్ ప్లాట్ లోకి వచ్చాక మాత్రం కథ, కథనాలు ఆశక్తి కలిగిస్తాయి. కానీ సెకండాఫ్ చివర్లో మళ్లీ కథ పక్కకు వెళ్లినట్లు అనిపిస్తుంది.
ఎవరు ఎలా చేశారు?: ఈ సినిమాలో నటించిన వాళ్ళలో చాలా మంది కొత్తవాళ్లే. అయినా.. వాళ్ళ నుంచి మంచి నటన రాబట్టాడు దర్శకుడు. ఇక మెయిన్ లీడ్ గ్ నటించిన నందు నటన ఈ సినిమాకి బ్యాక్ బోన్ అని చెప్పాలి. ఆయనకి సరైన హిట్ పడలేదేమో కానీ.. ఆయన మాత్రం బ్యాడ్ యాక్టర్ కాదు. అది ‘ఆటోనగర్ సూర్య’ నుంచి ‘సవారీ’ వరకూ చాలా సినిమాల్లో రుజువైంది. ఈ సినిమాకి మెయిన్ ఎట్రాక్షన్ ఆయన నటనే. సినిమా కాస్త డల్ అవుతున్నప్పుడల్లా తన నటన తో లేపాడు. గ్లామర్ డాల్ గా ముద్ర పడిన రష్మీ కూడా ఈ సినిమాలో బాగానే నటించింది. కిరీటి సహా ఇతర పాత్రల్లో నటించిన వారు వారి పాత్రల్లో బాగా సూట్ అయ్యారు. అయితే అందరి కంటే పోతురాజు పాత్ర సినిమా పూర్తయ్యాక కూడా గుర్తిండి పోతుంది.
విజయీభవ ప్రొడక్షన్ లో నిర్మాణ విలువలు బాగున్నాయి . నిర్మాతలుగా చాలా మంది పేర్లు ఉన్నా.. వారి వెనుక ఉంది నందునే అని ఆయనే స్వయంగా పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఇక సినిమాకి హైలెట్ సినిమాటోగ్రఫీ. సుజాతా సిద్దార్డ్ అందించిన కెమెరా వర్క్ ప్రతీ ఫ్రేమ్ కీ రిచ్ నెస్ అద్దింది. పాటలు అంతగా ఆకట్టుకోక పోయినా.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.
చివరిగా చెప్పేది ఏంటంటే.. హీరో నందు ఎన్నో కష్టనష్టాలకోర్చి నిర్మించిన ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ మూవీ.. కాన్సెప్టు బాగున్నా, కథనం మాత్రం అక్కడక్కడా నెమ్మదించింది. ఈ వీకెండ్ రిలీజ్ అయిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమా బెటర్ ఆప్షన్ అని ఆడియన్స్ అంటున్నారు. అయితే, మూవీ ప్రమోషన్స్ కు పెద్దగా టైమ్ లేకపోవడంతో ఈ సినిమా టీమ్ మౌత్ టాక్ పైనే ఆధారపడి ఉంది. ఇది కచ్చితంగా యూత్‌ను ఆకట్టుకుంటుంది.
Also Read : 'తగ్గేదే లే' రివ్యూ : 'దండుపాళ్యం' గ్యాంగ్ తగ్గారా? లేదంటే మళ్ళీ మొదలు పెట్టారా?