Thaggede Le Review - 'తగ్గేదే లే' రివ్యూ : 'దండుపాళ్యం' గ్యాంగ్ తగ్గారా? లేదంటే మళ్ళీ మొదలు పెట్టారా?
Thaggede Le Movie Review : 'దండుపాళ్యం' ఫేమ్ శ్రీనివాస్ రాజు దర్శకత్వంలో వచ్చిన సినిమా 'తగ్గేదే లే'. ఇందులోనూ 'దండుపాళ్యం' గ్యాంగ్ ఉన్నారు. మరి, సినిమా ఎలా ఉందంటే?
శ్రీనివాస్ రాజు
నవీన్ చంద్ర, రవిశంకర్, రాజా రవీంద్ర, మకరంద్ దేశ్‌పాండే, పూజా గాంధీ తదితరులు
సినిమా రివ్యూ : తగ్గేదే లే
రేటింగ్ : 1.5/5
నటీనటులు : నవీన్ చంద్ర, రవిశంకర్, రాజా రవీంద్ర, దివ్యా పిళ్లై, అనన్యా సేన్ గుప్తా, మకరంద్ దేశ్‌పాండే, పూజా గాంధీ, నాగబాబు, డానీ కుట్టప్ప, రవి కాలే తదితరులతో పాటు ప్రత్యేక గీతంలో నైనా గంగూలీ
ఛాయాగ్రహణం : వెంకట్ ప్రసాద్
నేపథ్య సంగీతం: చిన్నా
స్వరాలు : చరణ్ అర్జున్
నిర్మాతలు : ప్రేమ్ కుమార్ పాండే, ఎన్. అఖిలేష్ రెడ్డి, పి.వి.సుబ్బా రెడ్డి
దర్శకత్వం : శ్రీనివాస్ రాజు
విడుదల తేదీ: నవంబర్ 4, 2022
కన్నడలో, తెలుగులో 'దండుపాళ్యం' సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత రెండు సీక్వెల్స్ వచ్చాయి. ఆ చిత్రాల దర్శకుడు శ్రీనివాస్ రాజు తెరకెక్కించిన తాజా సినిమా 'తగ్గేదే లే' (Thaggede Le Movie). ఇందులోనూ 'దండుపాళ్యం' కథకు కొనసాగింపు ఉంటుంది. కొత్త కథ ఉంది. డ్రగ్స్ మాఫియా ఉంది. మరి, ఈ సినిమా ఎలా ఉంది? (Thaggede Le Review)
కథ (Thaggede Le Story) : ఈశ్వర్ (నవీన్ చంద్ర) సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అక్క కుమార్తె దేవి (దివ్యా పిళ్ళై)ని పెళ్లి చేసుకుంటాడు. హడావిడిగా ఏడడుగులు వేయడంతో కొలీగ్స్ అందరిని ఇంటికి పిలిచి పార్టీ ఇస్తాడు. ఆ పార్టీలో లిజి (అనన్యా సేన్ గుప్తా)ను చూసి షాక్ అవుతాడు. దేవికి తనను తాను ఈశ్వర్ ఫ్రెండ్‌గా పరిచయం చేసుకున్న లిజి... ఆ తర్వాత ఈశ్వర్‌ను బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తుంది? వాళ్లిద్దరి రాసలీలల వీడియోస్ ఎక్కడివి? వాటి కథ ఏమిటి? ఈశ్వర్ ఇంటిలో లభించిన మహిళ శవం ఎవరిది? ఆమెను ఎవరు చంపారు? ఈశ్వర్ జీవితానికి, దండుపాళ్యం గ్యాంగుకు, డ్రగ్స్ మాఫియాకు సంబంధం ఏమిటి? పోలీస్ ఆఫీసర్ చలపతి (రవి శంకర్) ఏం చేశారు? పోలీసుల విచారణలో ఈశ్వర్ చెప్పిన నిజాలు ఏమిటి? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ (Thaggede Le Telugu Review) : 'తగ్గేదే లే' ట్రైలర్ క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. మర్డర్ మిస్టరీకి 'దండుపాళ్యం' గ్యాంగ్ యాడ్ కావడంతో మరింత ఇంట్రెస్ట్ కలిగింది. సినిమా కూడా ఆసక్తికరంగా ప్రారంభమైంది. కానీ, కాసేపటికి సినిమా పట్టాలు తప్పిన బండిలా అసలు కథ నుంచి పక్కకు వెళ్ళింది.
హీరో ఇంట్లో శవం ఉంటుంది. అతడు ఆధారాలు మాయం చేసి పోలీసులకు ఫోన్ చేస్తాడు. అతడిని తీసుకువెళ్లి ప్రశ్నలు అడగటం స్టార్ట్ చేస్తారు. ప్రేక్షకులకు థ్రిల్ ఇస్తూ కథను ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంది. కానీ, దర్శకుడు అలా చేయలేదు. తనకు అలవాటైన దారిలో వెళ్లకుండా కామెడీని యాడ్ చేశారు. 'గెటప్' శీను, 'ఆటో' రామ్ ప్రసాద్, '30 ఇయర్స్' పృథ్వీ డబుల్ మీనింగ్ డైలాగులతో చేసిన సీన్స్ ఏమాత్రం ఆకట్టుకోలేదు.
నవీన్ చంద్ర, దివ్యా పెళ్ళై సీన్స్ రొటీన్‌గా అనిపిస్తాయి. బావ అంటే మరదలకు అంత ప్రేమ ఎందుకో అర్థం కాదు. ఇటువంటి లాజిక్స్ సినిమా చూసేటప్పుడు మైండ్‌లో వస్తే తీసేయండి. చాలా సినిమాల్లో చూశారు కాబట్టి ఆడియన్స్ అర్థం చేసుకుంటారని అనుకున్నారేమో!? కట్ పేస్ట్ టైపులో ఫస్టాఫ్ అంతా తీసేశారు. ఆ బ్లాక్ మెయిల్ కాన్సెప్ట్ కొత్తది ఏమీ కాదు. రెగ్యులర్ న్యూస్‌లో చూస్తున్నాదే. 'దండుపాళ్యం' తీసిన శ్రీనివాస్ రాజు అటువంటి కాన్సెప్ట్‌ను మరింత రెగ్యులర్ రొటీన్ స్టైల్‌లో డీల్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
కథగా చూస్తే 'తగ్గేదే లే'లో ఇంట్రెస్టింగ్ పాయింట్స్, ట్విస్ట్స్ ఉన్నాయి. కానీ, స్క్రీన్ మీదకు సరిగా తీసుకు రాలేదు. నేపథ్య సంగీతం, నిర్మాణ విలువలు బావుంది. కానీ, చరణ్ అర్జున్ చేసిన 'మాటే మంత్రము' సాంగ్ రీమిక్స్, దానిని తెరకెక్కించిన తీరు ఇళయరాజా - భారతిరాజా అభిమానులను ఇబ్బంది పెడుతుంది.
నటీనటులు ఎలా చేశారు? : సినిమాలో అసలు సిసలైన హీరో అంటే రవిశంకర్. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పాత్రలో నవీన్ చంద్ర బాగా చేశారు. అయితే... ఒక్క ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్‌తో అందరి చూపు రవిశంకర్ మీద పడుతుంది. 'దండుపాళ్యం' గ్యాంగుతో ఫైటులో ఆయన అంతలా చెలరేగిపోయారు. పోలీస్‌గా రాజా రవీంద్ర రెగ్యులర్ రోల్ చేశారు. 'దండుపాళ్యం' గ్యాంగ్ క్యారెక్టర్లలో మకరంద్ దేశ్‌పాండే, పూజా గాంధీ, రవి కాలె మరోసారి మెరిశారు. వాళ్ళ యాక్టింగులో సేమ్ ఇంటెన్సిటీ ఉంది. దివ్యా పిళ్ళై ట్రెడిషనల్ వైఫ్‌గా, అనన్యా సేన్ గుప్తా గ్లామర్ డాల్‌గా కనిపించారు. వాళ్ళిద్దరూ ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపిస్తుంది. హీరో స్నేహితులుగా 'గెటప్' శీను, 'ఆటో' రామ్ ప్రసాద్ నవ్వించడంలో ఫెయిల్ అయ్యారు. సమరం లాంటి డాక్టర్ రోల్ చేశారు '30 ఇయర్స్' పృథ్వీ.
Also Read : 'ఝాన్సీ' వెబ్ సిరీస్ రివ్యూ : లేడీ గజినీలా మారిన అంజలి - సిరీస్ ఎలా ఉందంటే?
ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే? : 'దండుపాళ్యం' సిరీస్ అభిమానులకు 'తగ్గేదే లే' సినిమాలో ప్రీ క్లైమాక్స్ నచ్చుతుంది. రవిశంకర్ నటన కూడా! డాబాలో యాక్షన్ సీక్వెన్సును ఆ సినిమాల స్థాయిలో శ్రీనివాస్ రాజు తెరకెక్కించారు. ప్రీ క్లైమాక్స్ తప్పిస్తే... మిగతా సినిమా ఆకట్టుకోవడం చాలా అంటే కష్టం. కొన్ని సీన్స్, మాటే మంత్రము పాట తలనొప్పి తెప్పిస్తాయి. కథలో కంటెంట్ ఉన్నప్పటికీ... స్క్రీన్ మీదకు తీసుకు రావడంలో, ఆసక్తిగా చెప్పడంలో శ్రీనివాస్ రాజు ఫెయిల్ అయ్యారు. రొమాన్స్ (రొమాంటిక్ సీన్స్) సినిమాను డ్రైవ్ చేయలేదు.