Ram Setu Movie Review : - 'రామ్ సేతు' రివ్యూ : అక్షయ్ కుమార్‌కు శ్రీరాముడు విజయాన్ని అందించాడా? సత్యదేవ్ ఎలా చేశారు?
Ram Setu Telugu Movie Review : భారతీయ మూలాలు, భక్తి భావనతో కూడిన కథాంశాలతో రూపొందిన చిత్రాలు విజయాలు సాధిస్తున్నాయి. మరి, దీపావళి కానుకగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో వచ్చిన 'రామ్ సేతు' ఎలా ఉంది?
అభిషేక్ శర్మ
అక్షయ్ కుమార్, సత్యదేవ్, జాక్వలిన్, నుష్రత్, నాజర్ తదితరులు
సినిమా రివ్యూ : రామ్ సేతు
రేటింగ్ : 1.5/5
నటీనటులు : అక్షయ్ కుమార్, సత్యదేవ్, జాక్వలిన్ ఫెర్నాండేజ్, నుష్రత్ బరూచా, నాజర్, ప్రవేశ్ రాణా, శుభం జైకర్, జెన్నిఫర్ పిసినెటో తదితరులు
ఛాయాగ్రహణం : అశీమ్ మిశ్రా
సంగీతం: డేనియల్ బి జార్జ్
నిర్మాణ సంస్థలు : కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, లైకా ప్రొడక్షన్స్, ప్రైమ్ వీడియో, అబడాన్షియా ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాతలు : అరుణ్ భాటియా, విక్రమ్ మల్హోత్రా, సుభాస్కరన్!
రచన, దర్శకత్వం : అభిషేక్ శర్మ
విడుదల తేదీ: అక్టోబర్ 25, 2022
హిందీ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar)కు ఈ ఏడాది ఏమాత్రం కలిసి రాలేదు. ఇప్పటి వరకూ ఆయన నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 'బచ్చన్ పాండే', 'సామ్రాట్ ప్రుథ్వీరాజ్', 'రక్షా బంధన్'... థియేటర్లలో హ్యాట్రిక్ ఫ్లాప్స్ అందుకున్నారు. ఆఖరికి ఓటీటీలో విడుదలైన 'కట్‌పుత్లీ' కూడా విమర్శలు ఎదుర్కొంది. ఈ తరుణంలో నేడు 'రామ్ సేతు' (Ram Setu Movie) థియేటర్లలోకి వచ్చింది. టాలీవుడ్ హీరో, ఇటీవల 'గాడ్ ఫాదర్'లో విలన్‌గా నటించిన సత్యదేవ్‌కు తొలి హిందీ చిత్రమిది. లంకలోని సీతమ్మను చేరుకోవడం కోసం వానర సైన్యంతో శ్రీరాముడు వారధిని నిర్మించారు. ఆ రామ్ సేతు నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఎలా ఉంది? అక్షయ్‌కు విజయాన్ని అందించిందా (Ram Setu Review)? లేదా?
కథ (Ram Setu Movie Story) : ఆర్కియాలజిస్ట్ ఆర్యన్ (అక్షయ్ కుమార్) నాస్తికుడు. ప్రభుత్వ మద్ధతుతో ప్రారంభమైన ప్రాజెక్టులో భాగంగా రామ్ సేతును ధ్వంసం చేయాలని అనుకోవడం వివాదాస్పదం కావడం, శ్రీరాముని దైవంగా కొలిచే దేశంలో ప్రజల మనోభావాలు దెబ్బతినేలా సేతు సముద్రం ప్రాజెక్ట్ ఉండటంతో... రామ్ సేతు శ్రీరాముడు కట్టినదని కాదని, సముద్రంలో సహజసిద్ధంగా ఏర్పడినదని రిపోర్ట్ ఇస్తే ఎటువంటి వివాదం ఉండదని ఆ బాధ్యతను ఆర్యన్ చేతిలో పెడతారు. తన రిపోర్టులో రామ్ సేతు గురించి రాయడంతో పాటు రామాయణం ఒక మహా కావ్యమని, అది నిజమని చెప్పే ఆధారాలు ఏవీ లేవని ఆర్యన్ పేర్కొంటాడు. అది మరింత వివాదానికి దారి తీస్తుంది. ప్రభుత్వంపై విపరీతమైన ఒత్తిడి రావడంతో ఆర్యన్‌ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తారు. ఇంటా బయటా ఆర్యన్ అంటే ప్రజలు మండిపడతారు. తన రిపోర్టు వల్ల మొదలైన వివాదానికి తాను ముగింపు పలకాలని ఆర్యన్ సంకల్పిస్తాడు. రామ్ సేతుపై అతడి పరిశోధనకు ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త ఇంద్రకాంత్ (నాజర్) సహాయం చేస్తాడు. ఆయన ఎవరు? ఎందుకు సహాయ సహకారాలు అందిస్తున్నారు? నాస్తికుడైన ఆర్యన్, రామ్ సేతును కట్టింది రాముడేనని ఎలా నిర్ధారణకు వచ్చాడు? ఈ క్రమంలో అతడికి ఎన్ని ప్రమాదాలు ఎదురయ్యాయి? ఈ ప్రయాణంలో అతడికి సహాయం చేసిన ఏపీ (సత్యదేవ్) ఎవరు? అనేది వెండితెరపై చూడాలి.
విశ్లేషణ (Ram Setu Movie Review Telugu) : 'రామ్ సేతు'లో కొంత నిజం ఉంది, మరి కొంత ఫిక్షన్ ఉంది. నిజం ఏంటంటే... రామ్ సేతు! కోర్టులో దానిపై కేసు ఉండటం! ఇంకా తుది తీర్పు రాలేదు. ఫిక్షన్ ఏంటంటే... కేసుకు తీర్పు ఇవ్వడం! అందుకోసం ఒక ఆర్కియాలజిస్ట్ సాహసం చేసినట్లు చూపించడం!
'రామ్ సేతు' ప్రచార చిత్రాల్లో తీవ్రవాదుల్ని కూడా చూపించారు. అయితే... వాళ్ళు కనిపించేది సినిమా ప్రారంభంలో మాత్రమే! వాళ్ళకు, అసలు కథకు ఎటువంటి సంబంధం లేదు. ఇక, అసలు కథ విషయానికి వస్తే... హిందువుల మనోభావాల్ని గౌరవిస్తూ 'రామ్ సేతు' సహజ సిద్ధంగా ఏర్పడినది కాదని, సాక్షాత్ శ్రీరాముడు సంకల్పిత నిర్మాణమని సినిమాలో చెప్పారు.
కథ ప్రారంభమైన పావుగంట తర్వాత క్లైమాక్స్ ఏంటో చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. అప్పుడు కథనం ఎంత బలంగా ఉండాలి? ప్రతి సన్నివేశంలో ఎంత బలమైన సంభాషణలు, కంటెంట్ ఉండాలి? అటువంటివి ఎక్కడా ఉండవు. ఏదో ముందుకు వెళుతుందంటే వెళుతుందంతే! అసలు ఏమాత్రం ఆకట్టుకోని సన్నివేశాలు, కథనానికి తోడు నాసిరకం వీఎఫ్ఎక్స్, వింత నేపథ్యం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. శ్రీరాముని సినిమాలో శివుడి నేపథ్యంలో గీతం ఏమిటో అర్థం కాదు.
ఒకానొక దశలో సినిమాలో దర్శకుడు ఏం చెప్పాలని అనుకుంటున్నాడో అర్థం కాదు. ఇంటర్వెల్ ముందు, తర్వాత రెండు మూడు సీన్లు... క్లైమాక్స్ తర్వాత సత్యదేవ్ క్యారెక్టర్ రివీల్ చేసే సీన్ మినహా ఆయన ఆసక్తికరంగా తీసిన సన్నివేశాలను వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరో సినిమాలో అటువంటి వీఎఫ్ఎక్స్ ఏంటో అర్థం కాదు. సినిమాను చుట్టేశారని అడుగడుగునా తెలుస్తుంది. ఇటువంటి సినిమాలు తీసేటప్పుడు అయితే సైన్స్... లేదంటే కామన్ పబ్లిక్ నమ్మకాలను ఫాలో కావాలి. ఈ సినిమాలో ఆ రెండూ ఫాలో కాలేదు. ఒక అడుగు అటు, మరో అడుగు ఇటు వేస్తూ ఎటెటో వెళ్ళారు.
ఈ తరహా కథలను ఎలా ఆసక్తికరంగా చెప్పవచ్చు అనేదానికి రీసెంట్ 'కార్తికేయ 2' ఒక ఉదాహరణ. సినిమాలో హెలికాఫ్టర్ / ఛాపర్ క్రాష్ సీన్ ఒకటి ఉంది. అప్పుడు జాక్వలిన్, నుష్రత్ చేసిన సీన్ కంటే సీరియల్స్‌లో సీన్స్ చాలా బెటర్. మేకప్ పరంగా కూడా సీరియల్స్‌లో క్వాలిటీ బావుంటోంది. కథలో మంచి కంటెంట్ ఉంది. రైటింగ్, మేకింగ్‌లో దాన్ని బయటకు తీసుకు రావడంలో దర్శక రచయితలు ఫెయిల్ అయ్యారు.
నటీనటులు ఎలా చేశారు? : అక్షయ్ కుమార్ నటనలో సహజత్వం కరువైంది. ఏదో ఆర్టిఫీషియల్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తున్నట్లు అనిపించింది. ఆయన లుక్ కంటిన్యూటీ కూడా మైంటైన్ చేయలేదు. పతాక సన్నివేశాల్లో, కోర్టులో నటన కొంతలో కొంత బెటర్. ఆయన భార్యగా నుష్రత్ చక్కగా నటించారు. కానీ, క్యారెక్టర్‌కు పెద్ద ఇంపార్టెన్స్ లేదు. జాక్వలిన్, జెన్నిఫర్, నాజర్ తదితరులు పాత్రలకు అనుగుణంగా నటించారు.
'రామ్ సేతు'లో సర్‌ప్రైజ్ అంటే సత్యదేవ్. ఏపీ పాత్రలో అదరగొట్టారు. ఆయన బాడీ లాంగ్వేజ్, ఎక్స్‌ప్రెషన్స్, యాక్టింగ్... అన్నీ బావున్నాయి. క్లైమాక్స్‌లో ట్విస్ట్ వల్ల సత్యదేవ్ క్యారెక్టర్ బాగా ఎలివేట్ అవుతుంది.
Also Read : 'అమ్ము' రివ్యూ : చిత్రహింసలు పెట్టే, కొట్టే భర్తను భార్య భరించాల్సిందేనా? ఐశ్వర్య లక్ష్మీ సినిమా ఎలా ఉందంటే?
ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే? : సినిమాలో కంటెంట్ ఉండటం ఎంత ముఖ్యమో... కంటెంట్‌ను సరిగ్గా తెరకెక్కించే దర్శక, నిర్మాతలు కూడా అంతే ముఖ్యం. డైలీ సీరియల్స్ కంటే నాసిరకం వీఎఫ్ఎక్స్, స్క్రీన్ ప్లే, సీన్స్, రీ రికార్డింగ్‌తో సినిమాలు తీస్తే అక్షయ్ కుమార్‌కు ఎవరూ హిట్ ఇవ్వలేరు. రామ్ సేతును ధ్వంసం చేస్తానని అన్నప్పుడు ప్రజలు మనోభావాలు ఎంత దెబ్బ తిన్నాయో... ఇటువంటి సినిమా చూశాక ప్రేక్షకుల మనోభావాలు కూడా అంతే దెబ్బ తింటాయి. 'రామ్ సేతు' థియేటర్లకు దూరంగా ఉండటం మంచిది.
Also Read : 'కవి సమ్రాట్' రివ్యూ : బాలకృష్ణ చూడాలనుకుంటున్న విశ్వనాథ వారి సినిమా