Jhansi Web Series Review - 'ఝాన్సీ' వెబ్ సిరీస్ రివ్యూ : లేడీ గజినీలా మారిన అంజలి - సిరీస్ ఎలా ఉందంటే?
OTT Review - Jhansi Web Series : డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్ 'ఝాన్సీ'. ఫస్ట్ సీజన్‌లో మొత్తం ఆరు ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ సిరీస్ ఎలా ఉందంటే?
తిరు
అంజలి, ఆదర్శ్ బాలకృష్ణ, చాందిని చౌదరి, ముమైత్ ఖాన్ తదితరులు
వెబ్ సిరీస్ రివ్యూ : ఝాన్సీ
రేటింగ్ : 2.5/5
నటీనటులు : అంజలి, ఆదర్శ్ బాలకృష్ణ, సంయుక్తా హొర్నాడ్, చాందిని చౌదరి, రాజ్ అర్జున్, రామేశ్వరి తాళ్లూరి, రుద్ర ప్రతాప్, ముమైత్ ఖాన్, దేవి ప్రసాద్ తదితరులు
రచన : గణేష్ కార్తీక్ (జీకే)
మాటలు : రామ్ వంశీకృష్ణ
ఛాయాగ్రహణం : ఆర్వీ
సంగీతం: శ్రీచరణ్ పాకాల
నిర్మాతలు : కృష్ణ కులశేఖరన్, కె.ఎస్. మధుబాల
దర్శకత్వం : తిరు
విడుదల తేదీ: అక్టోబర్ 27, 2022
ఓటీటీ వేదిక : డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ఎన్ని ఎపిసోడ్స్ : ఆరు
అంజలి (Anjali), చాందిని చౌదరి (Chandini Chowdary) ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ 'ఝాన్సీ' (Jhansi Web Series). అంజలి యాక్షన్ అవతార్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Hotstar Original Jhansi) ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్ ఇది. మహిళల అక్రమ రవాణా (Women Trafficking), చిన్నారులపై అఘాయిత్యాలు, మాఫియా నేపథ్యంలో రూపొందింది. ఈ సిరీస్ ఎలా ఉంది? (Jhansi Review)
కథ (Jhansi Web Series Story) : ఝాన్సీ (అంజలి), సంకీత్ (ఆదర్శ్ బాలకృష్ణ) సహా జీవనంలో ఉంటారు. అయితే... ఝాన్సీ అసలు పేరు ఝాన్సీ కాదు. ఆరేళ్ళ క్రితం కేరళలో సంకీత్‌కు కనిపిస్తుంది. గతం మర్చిపోయిన ఆమెను తనతో పాటు తీసుకొచ్చి బంగారంలా చూసుకుంటాడు. మధ్య మధ్యలో ఝాన్సీకి పీడకలలా ఏవేవో ఘటనలు గుర్తుకు వస్తుంటాయి. అవేమిటి? గతం మర్చిపోవడానికి ముందు ఝాన్సీపై ఎటాక్ చేసిన మోడార్ (రుద్ర ప్రతాప్) ఎవరు? విదేశాల్లో మాఫియా డాన్ కాలేబ్ (రాజ్ విజయ్), అతనికి అండగా ఉంటున్న బార్బీ (చాందిని చౌదరి)కి, ఝాన్సీకి సంబంధం ఏమిటి? అసలు, ఝాన్సీ అసలు పేరేమిటి? గతం ఏమిటి? గతం తెలుసుకోవాలని చేసిన ప్రయత్నంలో ఝాన్సీ ఏం తెలుసుకుంది? ఏం చేసింది? అనేది వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Jhansi Web Series Telugu Review) : సినిమాల్లో చెప్పలేని కథలు, ఎన్నో విషయాలను ఓటీటీలో చెప్పడానికి వీలు అవుతుందనేది ఫిల్మ్ మేకర్స్ చెప్పే మాట. ఎందుకంటే... ఓటీటీలో నిడివి సమస్య లేదు. కథను ఎన్ని గంటల పాటైనా ఆసక్తికరంగా చెప్పవచ్చు. పాత కథలను కొత్తగా చెప్పవచ్చు. 'ఝాన్సీ' విషయానికి వస్తే... ఇది కొత్త కథ కాదు. కొత్తగానూ చెప్పలేదు. కొంత వరకు ఆసక్తిగా చెప్పారంతే!
విమెన్ ట్రాఫికింగ్, మాఫియా, చైల్డ్ అబ్యూజ్, డివోర్స్, ఉద్యోగం ముఖ్యమని భర్తను, పిల్లలను వదులుకున్న మహిళ, అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేయడం, యాసిడ్ దాడులు... ఇప్పటికే కొన్ని సినిమాల్లో ప్రేక్షకులు చూసేశారు. హాలీవుడ్ సిరీస్‌లలో కూడా! వాటన్నిటినీ దర్శకుడు తిరు ఒక్క సిరీస్‌లోకి తీసుకొచ్చారు. ఆ కథలను మలుపులు తిప్పుతూ చెప్పాలని చూశారు. ఆ విషయంలో ఆయన పూర్తిగా సక్సెస్ కాలేదు.
కొన్ని సన్నివేశాలు ఎక్కడో చూసినట్టు ఉంటాయి. ఆ ట్విస్టులు కూడా కొత్తగా ఏమీ ఉండవు. కొన్ని పాత్రల్లో ఉన్నట్టుండి వచ్చే మార్పులు అర్థం కావు. కోర్టులో న్యాయం కోసం పోరాడాలని చెబుతూ, ప్రయత్నించే ఓ యువకుడు... పలుకుబడి, డబ్బుతో కేసు నుంచి బయటపడిన దోషులు కొట్టేసరికి మారిపోతాడు. హింస వైపు అడుగులు వేస్తాడు. ఎన్నో ఏళ్ళు అరాచకాలకు అండగా నిలబడిన ముమైత్ ఖాన్ పాత్రలో మార్పు కూడా! దర్శకుడు చాలా స్వేచ్ఛ తీసుకున్నారు. లాజిక్స్ వంటివి పక్కన పెట్టేసి ఎస్కెప్ రూట్ ఫాలో అయ్యారు. పోలీసుల ఇన్వెటిగేషన్ పక్కన పెట్టేయండి. చంపేయడం మరీ ఈజీ అన్నట్టు చూపించారు. పోలీసులు ఉన్నారంటే ఉన్నారని అన్నట్టు చూపించారు.
సిరీస్ స్టార్టింగ్ కాస్త ఇంట్రెస్టింగ్‌గా ఉన్నప్పటికీ... తర్వాత సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. అసలు విషయం చెప్పకుండా కథను మలుపులు తిప్పిన భావన వచ్చేస్తుంది. అసలు కథకు తోడు మధ్య మొదలైన ఉపకథలు ఏవీ ఆసక్తిగా లేవు. అంజలి క్యారెక్టర్ లేడీ గజినీ తరహాలో ఉంటుంది. ఆ మాటను సిరీస్‌లో కూడా చెప్పించారు. టెక్నికల్ విషయాలకు వస్తే... అందరూ చక్కగా చేశారు. శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం కథతో పాటు సాగింది. సినిమాటోగ్రఫీ బావుంది.
నటీనటులు ఎలా చేశారు? : ఝాన్సీ క్యారెక్టర్‌కు అంజలి పర్ఫెక్ట్ ఛాయస్. ఝాన్సీలో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. గతం ఏమిటో తెలుసుకోవాలనే తపన, సహ జీవనం చేస్తున్న వ్యక్తికి ఏమీ తెలియనివ్వకూడదని పడే మథనం, అమ్మాయికి అన్యాయం జరుగుతుంటే సహించలేని గుణం... ప్రతి భావోద్వేగాన్ని అంజలి చూపించారు. ఝాన్సీగా జీవించారు. అన్నిటి కంటే ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ బాగా చేశారు. చాందిని చౌదరి స్క్రీన్ మీద కనిపించింది తక్కువ సేపే. ఆమె లుక్ డిఫరెంట్‌గా బావుంది. మాఫియాలో షార్ప్ షూటర్ రోల్ అని అర్థమవుతుంది. అయితే... మాఫియాలోకి ఎలా వెళ్లారనేది ఇంకా రివీల్ చేయలేదు. ఆదర్శవంతమైన తండ్రి, భర్త తరహాలో పాత్రలో ఆదర్శ్ బాలకృష్ణ కనిపించారు. ముమైత్ ఖాన్ లుక్, ఆ క్యారెక్టర్‌లో ఆమె నటన ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ అండ్ షాక్ ఇస్తాయి. ఆమె ఇమేజ్‌కు డిఫరెంట్ లుక్‌లో సెటిల్డ్‌గా కనిపించారు. మిగతా వాళ్ళు తమ తమ పాత్రలకు తగ్గట్టు చేశారు. సర్‌ప్రైజ్ చేసే రోల్స్ లేవు.
Also Read : 'అమ్ము' రివ్యూ : చిత్రహింసలు పెట్టే, కొట్టే భర్తను భార్య భరించాల్సిందేనా? ఐశ్వర్య లక్ష్మీ సినిమా ఎలా ఉందంటే?
ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే? : 'ఝాన్సీ' గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే... ఆమె ఒక లేడీ గజినీ! ఇదొక కమర్షియల్ ప్యాకేజ్డ్ వెబ్ సిరీస్! ఆల్రెడీ మనం కొన్ని సినిమాల్లో చూసిన అంశాలను సిరీస్‌లో తీసుకొచ్చారు. ఒక్క కథలో చాలా విషయాలు చెప్పాలని చూశారు. అంజలి నటన, ప్రొడక్షన్ వేల్యూస్, శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం బావున్నాయి. తొలి మూడు ఎపిసోడ్స్ వరకు తర్వాత ఏం జరుగుతుందోననే ఆసక్తి ఉంటుంది. ఆ తర్వాత మెల్ల మెల్లగా ఆసక్తి పోతుంది. పాత కథను చెబుతున్నారనే ఫీలింగ్ మొదలవుతుంది. కథలో కొత్త పాత్రలను పరిచయం చేస్తూ వెళ్లారు తప్ప... క్లోజ్ ఫ్రెండ్స్ ఝాన్సీ, బార్బీ వేర్వేరు దారుల్లోకి ఎందుకు వెళ్లారు? అనేది చూపించలేదు. ఆ మెయిన్ ట్విస్ట్ కోసం సీజన్ 2 వచ్చే వరకు ఆడియన్స్ వెయిట్ చేయాలి.
Also Read : 'రామ్ సేతు' రివ్యూ : అక్షయ్ కుమార్‌కు శ్రీరాముడు విజయాన్ని అందించాడా? సత్యదేవ్ ఎలా చేశారు?