(Source: ECI/ABP News/ABP Majha)
Zika Virus: మ్యుటేషన్ చెందుతున్న జికా వైరస్, ఎప్పుడైనా ప్రపంచంపై విరుచుకుపడే అవకాశం, హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు
కరోనా కల్లోలం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది ప్రపంచం. మరో మహమ్మారి విరుచుకుపడడానికి సిద్ధమవుతోందని చెబుతున్నారు పరిశోధకులు.
కొన్నాళ్ల క్రితం ప్రజల్లో అలజడి సృష్టించింది జికా వైరస్. కొన్ని రోజులకే పరిస్థితి అదుపులోకి రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. 2020 ప్రపంచమంతా కరోనా మహమ్మారి అల్లుకుని మిగతా వైరస్‌ల గురించి మర్చిపోయేలా చేసింది. ఇప్పుడిప్పుడు పరిస్థితులు చక్కబడుతున్నాయి. కరోనా సృష్టించిన కల్లోలం నుంచి దేశాలు తేరుకుంటున్నాయి, ఈలోపే శాస్త్రవేత్తలు జికా వైరస్ ఉత్పరివర్తనాలు చెందుతోందని, ఏ క్షణమైన వ్యాప్తి చెందడానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు. అంతేకాదు జికా వ్యాప్తి వేగంగా జరగకుండా తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. కరోనా తరువాత రాబోయే మహమ్మారి జికా వైరస్ కాబోతున్నట్టు తెలుస్తోంది.
అప్పట్లో వణికించింది
మనదేశంలో 2016లో జికా వైరస్ కేసులు భారీగా నమోదయ్యాయి. ముఖ్యంగా గర్భవతుల్లో మైక్రోసెఫాలీ, ఇతర నరాల సంబంధిత వ్యాధులతో బిడ్డలు జన్మించడానికి కారణమైంది జికా. మొదటి సారి 2015లో బ్రెజిల్ చర్మపు దద్దుర్లుకు కారణమవుతున్న జికా వైరస్ ను పోలిన కేసులు నమోదయ్యాయి. దాదాపు 7000 కేసులు నమోదైనప్పటికీ, అవన్నీ తేలికపాటివిగా గుర్తించారు. 2016లో ఇతర దేశాల్లోనూ ఆ వైరస్ మ్యూటేషన్లు కనిపించాయి. ప్రపంచవ్యాప్తంగా ఆందోళనను సృష్టించింది. దీనివల్ల మెడికల్ ఎమెర్జెన్సీ పరిస్థితులు తలెత్తాయి.
దోమ కాటు వల్లే..
జికా వైరస్ దోమకాటు వల్లే వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ తల్లి కాబోయే మహిళల కలలను ఛిద్రం చేసింది. గర్భిణులకు సోకిన ఈ వైరస్ గర్భస్థ శిశువులకు సోకి, వారి మెదళ్లను దెబ్బతీసింది. వారికి మైక్రోసెఫలీ అనే వ్యాధి వచ్చేలా చేసి, వారి మెదళ్లు ఎదగకుండా అడ్డుకుటుంది. ఈ వ్యాధితో పుట్టిన పిల్లలు చిన్న తలలతో పుట్టారు. కేరళలో ఎంతో మంది తల్లులకు 2016లో ఇలాంటి పిల్లలు పుట్టారు.
చికిత్స లేదు
జికా వైరస్‌కు నిర్ధిష్ట చికిత్స లేదు. ఇతర వైరల్ జబ్బులను ట్రీట్ చేసినట్టే చేస్తారు. శరీరం డీహైడ్రైషన్ గురికాకుండా చూసుకోవాలి. విశ్రాంతి తీసుకోవాలి. దీనికింకా వ్యాక్సిన్లు రాలేదు. వస్తాయో రావో కూడా తెలియదు. జ్వరం, ఒళ్లు నొప్పులు తగ్గేందుకు మాత్రం మందులిస్తారు. డెంగ్యూలాగే ఇది కూడా కొన్ని రోజులకు పోతుంది. జికా వైరస్ శరీరంలో చేరితే కనీసం వారం రోజులు ఉంటుంది.
వ్యాక్సిన్?
హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ జికా వైరస్ కు వ్యాక్సిన్ తయారు చేస్తున్నట్టు ప్రకటించింది. అది ఇంకా క్లినికల్ ట్రయల్ దశలోనే ఉంది. రెండేళ్లుగా వ్యాక్సిన్ పై పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి.సానుకూల ఫలితాలే వస్తున్నాయని, మరో రెండేళ్లలో వ్యాక్సిన్ రావచ్చని చెబుతున్నారు.
Also read: ఇవన్నీ ఆహార ఫోబియాలు, మీకున్నాయేమో చెక్ చేసుకోండి