L2 Empuraan Box Office Collections: బాక్సాఫీస్ వద్ద ఎంపురాన్ రికార్డు కలెక్షన్లు - మంజుమ్మల్ బాయ్స్‌ను బ్రేక్ చేసేసిందిగా..
Empuraan Collections: మోహన్ లాల్ ఎంపురాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి చరిత్ర సృష్టించింది.

Mohanlal's Empuraan Movie World Wide Box Office Collections: మలయాళ స్టార్ మోహన్ లాల్ (Mohanlal) లేటెస్ట్ మూవీ 'L2: ఎంపురాన్' (Lucifer 2: Empuraan) బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ మార్చి 27న విడుదలై ఇప్పటికే రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరుకోగా తాజాగా మరో రికార్డు సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వసూళ్లు చేసింది.
విడుదలైన 8 రోజుల్లోనే..
సినిమా విడుదలైన 8 రోజుల్లోనే ఈ స్థాయిలో కలెక్షన్లు సాధించినట్లు మోహన్ లాల్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల షేర్ కలెక్షన్లు సాధించినట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ క్రేజీ రికార్డు సొంతం చేసుకున్న తొలి మలయాళ చిత్రంగా నిలిచినట్లు తెలిపారు. ఈ సినిమా ఇండియాలో రూ.88.25 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. పన్నులు, థియేటర్ నిర్వహణ, రెంట్ ఇతరత్రా ఖర్చులు తీసేయగా మిగిలే వాటిని షేర్ కలెక్షన్లుగా వ్యవహరిస్తారు.
100 crores+ world wide theatrical share!
— Mohanlal (@Mohanlal) April 4, 2025
First time in the history of Malayalam cinema!#L2E #Empuraan pic.twitter.com/t6VoHKABl4
అయితే.. గతేడాది చిదంబరం దర్శకత్వంలో వచ్చిన మంజుమ్మల్ బాయ్స్ రూ.242 కోట్ల కలెక్షన్లు సాధించి మలయాళ మూవీ ఇండస్ట్రీలో రికార్డు సృష్టించింది. తాజాగా ఆ రికార్డును లూసిఫర్ 2 అధిగమించింది. దీంతో మూవీ టీంతో పాటు మోహన్‌లాల్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆ రికార్డు కూడా..
ఎంపురాన్ మూవీ చుట్టూ వివాదాలు ఉన్నా త్వరలోనే రూ.300 కోట్ల మార్క్ అందుకుంటుందని మేకర్స్ తెలిపారు. అదే జరిగితే ఇంత స్థాయిలో కలెక్షన్లు సాధించిన తొలి మలయాళ మూవీ కూడా ఇదే అవుతుందని చెప్పారు.
థియేటర్లలో రివైజ్డ్ వెర్షన్
ఈ మూవీ చుట్టూ వివాదాలు నెలకొనగా సెన్సార్ బోర్డు సూచనల మేరకు దర్శక నిర్మాతలు మార్పులు చేశారు. తాజాగా రివైజ్డ్ వెర్షన్ థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. సెన్సార్ బోర్డు సూచనల మేరకు సినిమాలో కీలక పాత్ర బాల్‌రాజ్ భజరంగీ పేరును బలదేవ్‌గా మార్చారు. థ్యాంక్స్ కార్డులోని కేంద్ర మంత్రి సురేశ్ గోపి పేరును తొలగించి.. జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు సంబంధించి సీన్స్ మ్యూట్ చేశారు. ఇలా సెన్సార్ బోర్డ్ మొత్తం 24 కట్స్ చెప్పింది. దీంతో సినిమా నిడివి 2.8 నిమిషాలు తగ్గింది.
వివాదం అక్కడే మొదలైంది..
2002లో గుజరాత్‌లో చోటు చేసుకున్న అల్లర్ల నేపథ్యంలో మూవీలో కొన్ని సీన్స్ ఉన్నట్లు తెలుస్తుండగా.. ఆ టైంలో ఓ కుటుంబాన్ని మరో వర్గానికి చెందిన నాయకుడు దారుణంగా హత్య చేయడం.. కొంతకాలానికి అతనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం వంటి వాటిపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓ వర్గాన్ని తక్కువ చేసేలా ఈ సీన్స్ ఉన్నాయని వీటిని తొలగించాలని డిమాండ్ చేశారు. దర్శకుడిపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. 2019లో వచ్చి మంచి సక్సెస్ అందుకున్న 'లూసిఫర్' మూవీకి సీక్వెల్‌గా 'లూసిఫర్ 2: ఎంపురాన్' తెరకెక్కింది.






















