Waqf Amendment Bill 2025: రెండు సభలు వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదించిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటీ? చట్టం ఎలా పని చేస్తుంది?
Waqf Amendment Bill 2025: అర్ధరాత్రి దాటాక వరకు జరిగిన సుదీర్ఘ చర్చ లోక్‌సభ, రాజ్యసభల్ వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందింది. ఇప్పుడు నెక్ట్స్ స్టెప్ ఏంటీ? చట్టం ఆమోదం పొందిన తర్వాత పేరు మారుతుందా?

Waqf Amendment Bill 2025 : గురువారం (ఏప్రిల్ 3) జరిగిన సుదీర్ఘ చర్చ తర్వాత రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లు 2025కు ఆమోద ముద్ర పడింది. ఇక్కడ బిల్లుకు అనుకూలంగా 128 ఓట్లు వస్తే ప్రతికూలంగా 95 ఓట్లు పడ్డాయి. అంతకు ముందు రోజు అంటే బుధవారం రాత్రి లోక్‌సభలో ఈ బిల్లుకు ఆమోద ముద్ర పడింది. ఈ సమాజంలోని మహిళలతోపాటు పేద ముస్లింల పరిస్థితిని మెరుగుపరచడంలో ఈ బిల్లు కీలక పాత్ర పోషిస్తోందని ప్రభుత్వం తెలిపారు.
వక్ఫ్ (సవరణ) బిల్లు 2025ను ఆమోదించిన పార్లమెంట్ పాత బిల్లును రద్దుకు ఆమోద ముద్ర వేసింది. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అనేక సవరణలను రెండు సభలు తిరస్కరించాయి. రెండు సభల్లో ఆమోదం పొందిన తర్వాత బిల్లు రాష్ట్రపతికి వెళ్తుంది. ఇందులో ఏమైనా న్యాయపరమైన చిక్కులు ఉన్నాయో లేదో చూసుకొని రాష్ట్రపతి దాన్ని ఆమోదిస్తారు. అనంతరం బిల్లు చట్టంగా మారుతుంది.
రాజ్యసభలో 13 గంటల పాటు చర్చ
రాజ్యసభలో వక్ఫ్ (సవరణ) బిల్లు 2025 పై 13 గంటలకుపైగా జర్చ జరిగింది. ఆఖరిపై దీనిపై స్పందించిన మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు, 2006లో దేశంలో 4.9 లక్షల వక్ఫ్ ఆస్తులు ఉన్నాయని, వాటి నుంచి వచ్చే మొత్తం ఆదాయం కేవలం రూ.163 కోట్లు మాత్రమేనని తెలిపారు. 2013లో మార్పులు చేసిన తర్వాత కూడా ఆదాయం రూ. 3 కోట్లే పెరిగిందని అన్నారు. ఇప్పుడు దేశంలో 8.72 లక్షల వక్ఫ్ ఆస్తులు ఉన్నట్టు సభ దృష్టికి తీసుకొచ్చారు. వక్ఫ్ ఆస్తిని నిర్వహించే ముతవల్లి, దాని పరిపాలన, పర్యవేక్షణకు బిల్లులో నిబంధన ఉందని రిజిజు అన్నారు. "ప్రభుత్వం వక్ఫ్ ఆస్తిలో జోక్యం చేసుకోదని పునరుద్ఘాటించారు.
బిల్లుపై జరుగుతున్న ప్రచారమంతా అపోహే: రిజిజు
ఈ బిల్లు ద్వారా ముస్లింలు తప్ప మరెవరూ వక్ఫ్ విషయాల్లో జోక్యం చేసుకోరని రిజిజు స్పష్టం చేశారు. దీనిపై దుష్ప్రచారం జరుగుతోందని అన్నారు. జెపిసి నివేదిక ప్రకారం ప్రభుత్వం బిల్లులో అనేక మార్పులు చేసిందని, అందులో జిల్లా మేజిస్ట్రేట్ కంటే ఎక్కువ ర్యాంకు ఉన్న అధికారి వక్ఫ్‌గా ప్రకటించిన ప్రభుత్వ భూమిని దర్యాప్తు చేయాలనే సూచన ఉందని ఆయన అన్నారు.
ఈ వ్యక్తి ముస్లిం అవునా కాదా అనేది ఇప్పటి వరకు నిర్ణయించినట్లే, ఇకపై కూడా నిర్ణయం జరుగుతుందని తెలిపారు. దేశాన్ని ఎక్కువ కాలం ఎవరు పాలించారో అందరికీ తెలుసని, ముస్లింల పేదరికాన్ని తొలగించడానికి వారు ఏమీ చేయలేదని విమర్శించారు. గత ప్రభుత్వాలు ఈ పని చేసి ఉంటే, నేడు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ చర్యలన్నీ తీసుకోవలసిన అవసరం ఉండేది కాదన్నారు.
ఛారిటీ కమిషనర్ పని పర్యవేక్షణే
బిల్లులో నియమించే ఛారిటీ కమిషనర్ వక్ఫ్ బోర్డు, దాని కింద ఉన్న భూములను సరిగ్గా ఉన్నాయో లేదో మాత్రం నిర్వహిస్తాని రిజిజు అన్నారు. ప్రభుత్వం, వక్ఫ్ బోర్డు మసీదుతో సహా ఏ మత సంస్థ మతపరమైన వ్యవహారాల్లో జోక్యం చేసుకోవని క్లారిటీ ఇచ్చారు. కొత్త బిల్లులో ఇస్లాం అన్ని ఆలోచనా పాఠశాలల సభ్యులకు వక్ఫ్ బోర్డులో స్థానం కల్పిస్తుందని వివరించారు.
చట్టానికి కొత్త పేరు
ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఈ చట్టాన్ని 'ఉమీద్' (ఏకీకృత వక్ఫ్ నిర్వహణ సాధికారత, సామర్థ్యం అండ్ అభివృద్ధి) చట్టం అనే కొత్త పేరుతో పిలుస్తారు. దీనికి ఎవరూ అభ్యంతరం చెప్లలేదని మంత్రి అన్నారు. ఈ బిల్లులోని రూల్స్ పేద ముస్లింల సంక్షేమానికి ఉపయోగ పడతాయని, వక్ఫ్ బోర్డు కింద ఉన్న ఆస్తుల మెరుగైన నిర్వహణ వారి అభ్యున్నతికి దోహద పడతాయని అన్నారు. ఒక వ్యక్తి తన భూమిని వక్ఫ్ చేయాలనుకుంటే తప్ప వితంతువు లేదా విడాకులు తీసుకున్న స్త్రీ లేదా అనాథ పిల్లల ఆస్తిని వక్ఫ్ చేయలేమని మంత్రి పేర్కొన్నారు. స్మారక చిహ్నాలు లేదా జాతీయ ఆస్తి లేదా భారత పురావస్తు సర్వే (ASI) కింద ఉన్న భూమిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించలేమని వెల్లడించారు.
వక్ఫ్‌కు సంబంధించిన 31 వేలకుపైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, అందువల్ల వక్ఫ్ ట్రైబ్యునల్‌ను బలోపేతం చేశామని కిరణ్ పేర్కొన్నారు. బిల్లులో అప్పీలు చేసుకునే హక్కు కల్పించామని రిజిజు అన్నారు. వక్ఫ్ ట్రైబ్యునల్‌లో తనకు న్యాయం జరగలేదని ఎవరైనా భావిస్తే, వారు సివిల్ కోర్టుల్లో అప్పీలు చేసుకోవచ్చని తెలిపారు.
జాతీయస్థాయి కౌన్సిల్‌లో ఎవరు ఉంటారు?
సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్‌లో 22 మంది సభ్యులు ఉంటారని రిజిజు అన్నారు. ఇందులో నలుగురు ముస్లిమేతర సభ్యులు ఉంటారు. వారిలో ముగ్గురు పార్లమెంటు సభ్యులు, ముస్లిం సమాజం నుంచి 10 మంది సభ్యులు, సుప్రీంకోర్టు, హైకోర్టు మాజీ న్యాయమూర్తులు ఇద్దరు, జాతీయ స్థాయి న్యాయవాది, వివిధ రంగాల్లో పేరున్న నలుగురు వ్యక్తులు, అడిషనల్ ప్రభుత్వ కార్యదర్శి సంయుక్త కార్యదర్శి ఉంటారు. ముస్లిం సమాజం నుంచి ఉండే 10 మంది సభ్యుల్లో ఇద్దరు మహిళలు కచ్చితంగా ఉండాలని బిల్లులో పెట్టారు.
రాష్ట్ర వక్ఫ్ బోర్డు సభ్యులు ఎవరు?
రాష్ట్ర వక్ఫ్ బోర్డులో 11 మంది సభ్యులు ఉంటారని రిజిజు అన్నారు. వారిలో ముగ్గురు కంటే ఎక్కువ మంది ముస్లిమేతర సభ్యులు ఉండరు. వారిలో ఒకరు ఎక్స్-అఫిషియో సభ్యుడు. బోర్డులో చైర్మన్, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ముస్లిం సమాజం నుంచి నలుగురు సభ్యులు, వృత్తిపరమైన అనుభవం ఉన్న ఇద్దరు సభ్యులు, బార్ కౌన్సిల్ సభ్యుడు, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి ఉంటారు. ముస్లిం సమాజం నుంచి నలుగురు సభ్యులలో ఇద్దరు మహిళలు ఉంటారు.
వక్ఫ్ (సవరణ) బిల్లు ప్రకారం వక్ఫ్ ట్రైబ్యునల్ బలోపేతం చేయనున్నారు. దీనికి కూడా నిర్ధిష్టమైన ఎంపిక ప్రక్రియ ఉంటుంది. దీనికి స్థిర పదవీకాలం ఉంటుంది. బిల్లులోని నిబంధనల ప్రకారం, ట్రైబ్యునల్ నిర్ణయాలను సివిల్ కోర్టుల్లో సవాల్ చేయవచ్చు.
పోర్టల్ ఏర్పాటు
వక్ఫ్ సంస్థలు వక్ఫ్ బోర్డుకు ఇవ్వాల్సిన తప్పనిసరి సహకారాన్ని ఏడు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించారు. లక్ష రూపాయల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వక్ఫ్ సంస్థలు రాష్ట్ర ప్రాయోజిత ఆడిట్ చేయించుకోవాలి. వక్ఫ్ నిర్వహణ సమర్థవంతంగా, పారదర్శకంగా పనిచేయడానికి సహాయపడే కేంద్రీకృత పోర్టల్‌ను అందించారు. 'కనీసం ఐదు సంవత్సరాలు' 'ప్రాక్టీస్ చేస్తున్న ముస్లిం' మాత్రమే తన ఆస్తిని వక్ఫ్ చేయగలరని కూడా ఈ బిల్లులో పేర్కొన్నారు.
ఆస్తిని వక్ఫ్‌గా ప్రకటించే ముందు మహిళలకు వారసత్వం ఇవ్వాల్సింది ఇవ్వాలి. వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలు, అనాథలకు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. జిల్లా మేజిస్ట్రేట్ కంటే ఎక్కువ స్థాయి అధికారి వక్ఫ్‌గా ప్రకటించిన భూమిని తనిఖీ చేయాల్సి ఉంటుంది.





















