Mango: మామిడి పండు మంచిదే, కానీ వీటితో కలిపి తినకూడదు
మామిడి పండులో కలిపి తినకూడని పదార్థాలు కొన్ని ఉన్నాయి. వీటి వల్ల చిన్న చిన్న ఆరోగ్యసమస్యలు వచ్చే అవకాశం ఉంది.
వేసవి కాలం వచ్చిందంటే మామిడి పండ్ల సీజన్ వచ్చినట్టే. మామిడి పండ్లు తినడం కోసమే ఎండాకాలం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసే వాళ్లు ఎంతో మంది. ఈ పండ్లు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా అధికమే. కానీ ఈ పండ్లతో కొన్ని రకాల ఆహారాలు కలిపి తినడం వల్ల మాత్రం సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మామిడి పండ్లను తిన్న వెంటనే నీళ్లను తాగుతారు చాలా మంది. అది మంచి పద్ధతి కాదు. అలా తాగడం వల్ల విరేచనాలు కావడం లేదా కడుపు నొప్పి రావడం జరుగుతుంది. మామిడి పండు తిన్నాక కనీసం అరగంటపాటూ ఏమీ తినకూడదు, నీళ్లు తాగకూడదు.
చాలామందికి మజ్జిగలో, పెరుగులో మామిడి పండు గుజ్జు కలుపుకుని తినడం చేస్తుంటారు. లేదా మజ్జిగ అన్నంతో పాటూ నంజుకుని తింటుంటారు. ఈ పద్ధతి మంచిది కాదు. పెరుగు, మామిడి పండు గుజ్జు రెండూ వేడి చేసేవే కాబట్టి, ఆ రెండింటినీ కలిపి తినడం వల్ల శరీరంలో మరీ వేడికి గురయ్యే ప్రమాదం ఉంది. అలాగే అతి చల్లని పదార్థాలతో కలిపి కూడా మామిడి పండుని తినకూడదు. ఇలా చేయడం వల్ల శరీరంలో టాక్సిన్లు ఏర్పడే అవకాశం ఉంది.
కాకరకాయ వద్దు
మామిడి పండు తిన్న వెంటనే కాకరకాయ లేదా కాకరకాయతో అన్నం తిన్నాక మామిడి పండుని తినకూడదు. ఇలా తినడం వల్ల కొందరిలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మధుమేహం ఉన్న మామిడి పండును అన్నం తిన్నాక తినకూడదు. వాంతులయ్యే అవకాశం కూడా ఉంది.మామిడి పండు, కూల్ డ్రింక్స్ ఏకకాలంలో తినకూడదు. ఈ రెండూ ఒకే సమయంలో పొట్టలో కలిస్తే షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరుగుతాయి. దీని వల్ల కళ్లు తిరిగిపడి పోవడం వంటివి జరగొచ్చు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు ఉన్న సమయంలో మామిడి పండ్లు కూడా మరీ అధికంగా తినకూడదు. దీని వల్ల శరీరానికి మరింత వేడి సెగ తగిలే అవకాశం ఉంది. కాబట్టి రోజుకు రెండు మామిడి పండ్ల కన్నా అధికంగా తినకపోవడమే మంచిది.
ఆరోగ్య ప్రయోజనాలెన్నో...
మామిడిపండులో బీటా కెరాటిన్ పుష్కలంగా ఉంటుంది.ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ పండు తినడం వల్ల ఇనుము కూడా సమృద్ధిగా లభిస్తుంది. రక్తహీనత సమస్య దరి చేరదు. విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది కనుక కంటి సమస్యలు రావు. కంటి శుక్లాలు వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఎముకకు బలాన్నందిస్తుంది. దీనిలో మెగ్నిషియం, పొటాషియం, విటమిన్ సి, ఫైబర్ మామిడిలో అధికంగా ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి మేలు చేసేవి. శరీరంలో కొలెస్ట్రాల్ ని కూడా ఇవి తగ్గిస్తాయి. మామిడపండును తినడం ఒక్క సారిగా షుగర్ లెవెల్స్ పెరగవు. కాబట్టి ఒక పండును ఆనందంగా తినవచ్చు. కానీ ఒకేసారి రెండు మూడు పండ్లు మాత్రం తినకూడదు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంది.
Also read: మధుమేహం ఉన్న వారికి పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువా?
Also read: గర్భనిరోధక మాత్రలను వాడుతున్నారా? ఈ చెడు ప్రభావాలు తప్పకపోవచ్చు