Fiber Rich Foods: మనం తినే ఆహారంలో ఫైబర్ ఉండాల్సిందేనా? లేకపోతే ఏమవుతుంది?
ఆరోగ్యంగా ఉండేందుకు ఫైబర్ చాలా అవసరం. పప్పులు, విత్తనాలు వంటి వాటిలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది.
ఆరోగ్యంగా ఉండటం కోసం ఫైబర్ చాలా అవసరం. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి కరగని ఫైబర్, రెండోది కరిగే ఫైబర్. పండ్లు, కూరగాయలు, నట్స్, విత్తనాలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు, ఆకుకూరలు, బఠానీలు, కాయ ధాన్యాల్లో కరగని ఫైబర్ ఉంటుంది. ఇక కరిగే ఫైబర్ నీటిలో కరిగిపోతుంది. ఇది గట్ లోని మంచి బ్యాక్టీరియా ద్వారా విచ్చిన్నమవుతుంది. కరగని ఫైబర్ మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. ఇవి రెండూ ముఖ్యమైనవే. ఎందుకంటే ఫైబర్ రక్తంలో చక్కెరని నియంత్రిస్తుంది. కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పోషించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది. పొట్ట నిండుగా ఉండేలా చేస్తుంది. అంతే కాదు ప్రీ బయోటిక్ గా కూడా పని చేస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే ఫుడ్ తినకపోతే ఉదర సంబంధిత సమస్యలు ఏర్పడతాయి. ఈ ఆహార పదార్థాల్లో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది.
హోల్ గ్రెయిన్స్
భోజనంలో క్వినోవా, బ్రౌన్ రైస్, హోల్ వీట్ పాస్తా, బ్రెడ్, ఓట్స్ వంటి తృణధాన్యాలు చేర్చుకోవాలి. శుద్ధి చేసిన ధాన్యాలతో పోలిస్తే వీటిలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. పొట్ట నిండుగా రాత్రిపూట అతిగా తినకుండా నివారిస్తుంది. వీటితో పాటు కూరగాయలు, చికెన్ లేదా పనీర్ వంటి ప్రోటీన్ చేర్చుకోవచ్చు.
చిక్కుళ్ళు
బీన్స్, కాయధాన్యాలు, చిక్ పీస్(శనగలు), కిడ్నీ బీన్స్ వంటి చిక్కుళ్ళ జాతికి చెందిన వాటిలో ఫైబర్ లభిస్తుంది. శాఖాహారులకి మంచి ఆహార ఎంపికలు. సూప్, సలాడ్, ఇతర వంటకాలు చేసుకోవచ్చు. ఇవి తక్కువ కొవ్వు పదార్థం, ఎక్కువ ప్రోటీన్, ఫైబర్ ని కలిగి ఉంటాయి.
బెర్రీస్
అన్నీ బెర్రీలు ఆరోగ్యకరమైనవే. కానీ రాస్పెబేర్రీస్, బ్లూ బెర్రీస్ లో పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. అనారోగ్యాల ప్రమాదాన్ని నివారిస్తాయి. శరీరంలోని మంటను తగ్గిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి.
నట్స్, విత్తనాలు
బాదం, చియా గింజలు, అవిసె గింజలు, పొద్దు తిరుగుడు గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని నానబెట్టుకుని లేదా వంటలలో డ్రెస్సింగ్ మాదిరిగా వేసుకుని ఆరగించవచ్చు. ఇంట్లో తయారు చేసిన ఎనర్జీ బార్స్, ట్రైల్ మిక్స్ లో వీటిని చేర్చుకోవచ్చు.
కూరగాయలు
విటమిన్ సి, కె, బి కాంప్లెక్స్, యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ఇతర పోషకాలు బ్రకోలిలో లభిస్తాయి. ఇక క్యారెట్ లో బీటా కెరోటిన్ తో పాటు ఫైబర్ కూడా ఉంటుంది. పచ్చి బఠానీ లు పోషకమైనవి. ఫైబర్, ఐరన్, విటమిన్లు ఏ, సీ ఉన్నాయి. ఒక కప్పు స్వీట్ పొటాటోలలో 7 గ్రాములు ఫైబర్ లభిస్తుంది. వీటిని ముక్కలుగా చేసుకుని ఉడికించుకుని మసాలా చల్లుకుని లేదా వేయించుకుని తినొచ్చు.
సైలియం పొట్టు
ఒక టేబుల్ స్పూన్ సైలియం పొట్టులో 7 గ్రాముల కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణం కాదు కానీ కొద్ది పరిమాణంలో తీసుకునే అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. నానబెట్టి తీసుకుంటే గట్ సూక్ష్మజీవుల ద్వారా త్వరగా విచ్చిన్నమవుతుంది. రోగనిరోధక శక్తిని పెంచి, బరువు తగ్గిస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: చర్మం మెరిపించేలా చేసే నేచురల్ బ్లీచ్ టెక్నిక్స్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial