Lakshmi Manchu: బౌండరీలు దాటి నటించేందుకు.. ముంబైకి మకాం మార్చిన మంచు లక్ష్మి
టాలీవుడ్ నటి మంచు లక్ష్మి ప్రసన్న ముంబైకి మకాం మార్చింది. బాలీవుడ్లో విస్తృతమైన పాత్రలను అన్వేషించడానికి సిద్ధంగా ఉన్నట్లు లక్ష్మి తెలిపింది.

నటి, నిర్మాత మంచు లక్ష్మి ప్రసన్న గురించి పరిచయాలు అవసరం లేదు. సీనియర్ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె.. హీరోయిన్గా, విలన్‌గా, క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా, టీవీ హోస్ట్‌గా, ప్రొడ్యూసర్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం ఓవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు అవకాశం వచ్చినప్పుడల్లా వెబ్ సిరీసులు చేస్తోంది. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి మంచువారమ్మాయి హైదరాబాద్ నుంచి ముంబైకి మకాం మార్చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
టాలీవుడ్ లో స్థిరపడిపోయిన మంచు లక్ష్మి ఇప్పుడు తన కెరీర్ ను కొత్తగా ప్రారంభించడానికి, మరింత ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. కొన్నాళ్లుగా హైదరాబాద్ లో ఉంటున్న ఆమె, బాలీవుడ్ లో అవకాశాల కోసం ముంబైకి షిఫ్ట్ అవ్వాలని నిర్ణయించుకుంది. హిందీలో ఆడిషన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన లక్ష్మీ.. చెప్పిందే తడవుగా ముంబైకి చెక్కేసింది. ఆమె ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా స్వయంగా వెల్లడించింది.
తెలుగు యాక్టర్ మంచు లక్ష్మి హిందీ సినిమాలు, వెబ్ సిరీస్ లను అన్వేషించడానికి తన స్థావరాన్ని ముంబైకి మార్చిందనే ఓ బాలీవుడ్ మీడియా కథనంపై ఆమె ట్విట్టర్ Xలో స్పందించింది. 'ముంబై.. కొత్త నగరం, కొత్త ప్రపంచం.. ఈ జీవితానికి చాలా కృతజ్ఞతలు. ఎప్పుడూ నన్ను ఆదరిస్తున్నందుకు, నన్ను విశ్వసిస్తున్నందుకు నా అభిమానులందరికీ ధన్యవాదాలు" అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
ఇటీవల మంచు లక్ష్మి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నేను దక్షిణాదిలో చాలా రకాల పాత్రలు చేశాను. విస్తృతమైన విభిన్నమైన పాత్రల కోసం అన్వేషించాను. కానీ సౌత్ లో కొన్ని పరిమితులకు లోబడే పాత్రలు ఉంటాయి. ముంబైలో అయితే వర్క్ పరిధి విస్తృతంగా ఉంటుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేయడానికి నేను రెడీగా ఉన్నాను'' అని తెలిపింది. తన కెరీర్‌ను కొత్తగా ప్రారంభించాలని కోరుకుంటున్నట్లు చెప్పింది.
''నేను ఆడిషన్స్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. మీటింగుల కోసం ఆఫీసుకు రమ్మన్నా వస్తాను. ఎందుకంటే ముంబైలో నేను స్టార్ కిడ్ ని కాదు. ఇండస్ట్రీలో ఇప్పుడు గణనీయమైన పనులు జరుగుతున్నాయి. కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఇదే సరైన సమయమని నేను భావిస్తున్నాను'' అని మంచు లక్ష్మీ అన్నారు. తన తల్లి తనకు సపోర్ట్ సిస్టమ్ అని, తన తండ్రి మోహన్ బాబు మాత్రం ముంబైలో మాఫియా ఉంటుందని భయపడ్డారని వెల్లడించింది.
''నిజానికి నేను తిరిగి లాస్ ఏంజిల్స్ వెళ్లిపోదామని ఆలోచిస్తున్నానని ఇంట్లో చెప్పాను. ఒకరకంగా మా అమ్మ భయపడింది. అయితే ముంబైకి షిఫ్ట్ అవుతానని చెప్పడంతో సరేనంది. అమ్మ ఎప్పుడూ నా బిగ్గెస్ట్ ఛాంపియన్. నాన్న మాత్రం ముంబై అనగానే 'అక్కడ మాఫియా ఉంటుంది.. అక్కడికి ఎందుకు?' అని అడిగారు. కూతురు ఇల్లు వదిలి వెళ్లిపోతుందంటే ప్రతి తండ్రి ఎలా భయపడతాడో మా నాన్న కూడా అలాగే భయపడ్డాడు'' అని నవ్వుతూ చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి.
లక్ష్మీ ప్రసన్న చివరిగా మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'మాన్ స్టర్' మూవీలో కనిపించింది. ఇది ఆమెకు మలయాళ డెబ్యూ. ప్రస్తుతం 'ఆదిపర్వం' అనే సినిమాలో నటిస్తోంది. ఈ మధ్యనే ఫస్ట్ లుక్ కూడా వచ్చింది. 90లలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేస్తోంది. ఇందులో భాగంగా బాంద్రాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో మకాం పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. మరి మంచు లక్ష్మీకి హిందీలో ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి.
Also Read: చేతికి సెలైన్‌తో హాస్పిటల్ బెడ్ మీద సమంత - ఇన్‌స్టాగ్రామ్ ఫోటో వైరల్!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

