Double Ismart Song: వివాదంలో ‘డబుల్ ఇస్మార్ట్’ సాంగ్, పూరీ జగన్నాథ్ పై బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం? కారణం ఏంటో తెలుసా?
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రం నుంచి తాజాగా విడుదలైన పాటలో కేసీఆర్ మాటలను వాడటంపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Maar Muntha Chod Chinta Song In Trouble: స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, యంగ్ హీరో రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి కావొచ్చింది. తాజాగా చిత్రం నుంచి ‘మార్ ముంత చోడ్ చింత..’ అనే పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ సాంగ్ పేరుతో విడుదల చేసిన ఈ సాంగ్ కల్లు కంపౌండ్ లో కొనసాగుతోంది. ఇందులో హీరో, హీరోయిన్లు రామ్, కావ్యా థాపర్ కల్లు సీసాలు పట్టుకుని చిందులేస్తారు. పాట మధ్యలో ‘ఏం జేద్దామంటవ్ మరీ..’ అనే కేసీఆర్ మాటను వాడారు. ఈ సాంగ్ విడుదలైన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఈ పాటపై గులాబీ పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వివాదంలో ‘డబుల్ ఇస్మార్ట్’ సాంగ్
‘మార్ ముంత చోడ్ చింత..’ పాటలో కేసీఆర్ హుక్ లైన్ ను కావాలనే పూరి జగన్నాథ్ పెట్టారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ ను ఉద్దేశపూర్వకంగానే కించపరిచే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇక ఈ పాటను కాసర్ల శ్యామ్ రాయగా, మణిశర్మ సంగీతం అందించారు. పాట రచయిత కాసర్ల శ్యామ్ పైనా సోషల్ మీడియాలో టీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వాడైన ఉండి, కేసీఆర్ హుక్ లైన్ పెట్టించడం ఏంటని మండిపడుతున్నారు.
‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా సమయంలోనూ వివాదం
తెలంగాణ ఉద్యమం సమయంలోనూ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా ఓ రాజకీయ నాయకుడికి, రిపోర్టర్ కు మధ్య జరిగే కథ అని పూరీ వెల్లడించారు. కానీ, సినిమా విడుదలయ్యాక, తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలా ఉందని పలువురు తెలంగాణవాదులు అప్పట్లో ఆందోళన చేశారు. ఈ సినిమాలో విలన్ పాత్రలకు తెలంగాణ నాయకులను అన్వయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ హీరోగా, తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అప్పట్లో డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల దగ్గర తెలంగాణవాదులు ఆందోళనలు చేయడంతో పెద్ద రచ్చ జరిగింది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత కూడా పూరి జగన్నాథ్ తీరు మారలేదని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ‘డబుల్ ఇస్మార్ట్’తో మరోసారి తన పైత్యాన్ని చాటుకున్నాడని మండిపడుతున్నారు.
పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన #DoubleIsmart సినిమాలోని పాటలో బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ గారి " ఏం జేద్దమంటవు మరి" అనే డైలాగ్ హుక్ లైన్ గా వాడడం పై బిఆర్ఎస్ నాయకురాలు పావని గౌడ్ తీవ్ర ఆగ్రహం #RamPothineni #PuriJagannadh pic.twitter.com/dIL5IC3LlP
— Sarita Avula (@SaritaAvula) July 17, 2024
క్షమాపణలు చెప్పాలంటున్న బీఆర్ఎస్ శ్రేణులు
‘డబుల్ ఇస్మార్ట్’ సాంగ్ లో పెట్టిన కేసీఆర్ మాటలను వెంటనే తొలగించాలని టీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. చేసిన తప్పుకు కేసీఆర్ కు క్షమాపణలు చెప్పాలంటున్నారు. లేదంటే ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో ఈ సినిమా ఆడకుండా చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు.
Also Read: శేఖర్ మాస్టర్ ఛాన్స్ ఎక్కడ ఇస్తున్నాడు - ఆయనే అమ్మాయిలతో పులిహోర కలిపేస్తున్నాడు!