Andhra Pradesh Latest News: మద్యం కుంభకోణంలో కీలక మలుపు-వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి నోటీస్‌లు
Andhra Pradesh Liquor Scam: ఆంధ్రప్రదేశ్‌లో వెలుగు చూసిన మద్యం కుంభకోణం అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పుడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది సిట్. ఇవాళ మరో మాజీ ఎంపీని విచారించనుంది.

Andhra Pradesh Liquor Scam: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా సంచలనం సృష్టిస్తోన్న మద్యం కుంభకోణంలో అధికారుల విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో కసిరెడ్డి రాజ్‌శేఖర్ రెడ్డి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ఇవాళ విజయసాయిరెడ్డి విచారణకు హాజరవుతున్నారు. ఇదే టైంలో వైసీపీ ఎంపీకి నోటీసులు ఇవ్వడం కేసులో కీలక మలుపుగా చెప్పవచ్చు.
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి మద్యం కుంభకోణంలో సిట్ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. రేపు(శుక్రవారం, 18 ఏప్రిల్ 2025) విజయవాడలోని సిట్ ఆఫీస్‌లో జరిగే విచారణకు హాజరవ్వాలని ఆదేశించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈయన్ని విచారిస్తే కీలక సమాచారం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. మద్యం ఉత్పత్తిదారులు, సరఫరాదారులు, వ్యాపారలను కూడా విచారణకు పిలుస్తున్నారని బాగొట్టా. అందర్నీ కలిపి విచారించబోతున్నారని సమాచారం.
మద్యం కుంభకోణంలో ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే విచారణకు సహకరించాలని మాత్రం మిథున్ రెడ్డిని ఆదేశించింది. అందుకే ఆయన హాజరు అవుతారా లేదంటే వేరే కారణాలు చెప్పి మరోసారి హాజరవుతానని దాటవేస్తారా అనేది ఆసక్తిగా మారింది.
నేడు విచారణకు రానున్న విజయసాయిరెడ్డి
ఈ కుంభకోణంలో ఇప్పటికే కీలక సమాచారం సేకరించిన దర్యాప్తు అధికారులు నేడు విజయసాయిరెడ్డిని విచారించనున్నారు. ఇప్పటి వరకు వివిధ వర్గాల నుంచి సేకరించిన సమాచారాన్ని ముందు పెట్టి విజయసాయిరెడ్డిని ప్రశ్నించనున్నారు. వాస్తవంగా శుక్రవారం మిథున్, సాయిరెడ్డిని కలిసి విచారించాలని భావించారు. కాని తనకు వేర్వేరు పనులు ఉన్నందున ముందుగానే వచ్చి విచారణకు హాజరవుతానని విజయసాయిరెడ్డి చెప్పడంతో ఇవాళ ప్రశ్నిస్తున్నారు.
ఇంకా అజ్ఞాతంలోనే కసిరెడ్డి
ఈ మద్యం కేసులో కీలకంగా వ్యవహరించారని భావిస్తున్న కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి మాత్రం అజ్ఞాతం వీడలేదు. విచారణకు పదే పదే గైర్హాజవుతూ అధికారుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నారు. మూడు సార్లు విచారణకు డిమ్మాకొట్టిన కసిరెడ్డికి శనివారం విచారణకు రావాలని మరోసారి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.
రెండు రోజుల పాటు కసిరెడ్డి ఇళ్లు, ఆఫీస్‌లు, బంధువుల ఇళ్లు, ఆయన భార్య పెట్టుబడి పెట్టి ఆసుపత్రిలో తనిఖీలు చేశారు. అక్కడ సిబ్బందిని ప్రశ్నించారు. బంధువులను ప్రశ్నించి వారి నుంచి కూడా కీలక సమాచారం రాబట్టారు. కసిరెడ్డి తండ్రిని కూడా విచారించారు. అయినా కసిరెడ్డి ఆచూకీ మాత్రం అధికారులకు లభించలేదు. తనను ఎందుకు విచారణ చేయాలనుకుంటున్నారో కారణం చెప్పాలని అధికారులను ఎదురు ప్రశ్నించారు. ఈ కేసు డిస్మిస్ చేయాలని హైకోర్టును ఆశ్రయించినా కసిరెడ్డికి ఊరట లభించలేదు. విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. అయినా కసిరెడ్డి మాత్రం విచారణకు హాజరుకాకుండా అజ్ఞాతంలో ఉన్నారు. దీంతో ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేస్తున్నట్టు గుర్తించిన అధికారులు ఆయన కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.
మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారి కసిరెడ్డి అని ప్రభుత్వాధికారులు ఆధారాలు సేకరించినట్టు సమాచారం. హైదరాబాద్‌లో ప్రత్యేక ఆఫీస్ ఏర్పాటు చేసి దందా చేసినట్టు అధికారులు గుర్తించారు. ఇలా చేసిన దందాలో వచ్చిన నగదును సినిమాల్లో కూడా పెట్టుబడి పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాలు రాబట్టేందుకు ఆ సినిమా తీసినవాళ్లకి కూడా నోటీసులు జారీ చేయనున్నట్టు తెలుస్తోంది.





















