Andhra liquor scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - విజయసాయిరెడ్డికి సీఐడీ సిట్ నోటీసులు
Vijayasai Reddy: వైఎస్ఆర్‌సీపీ మాజీ నేత విజయసాయిరెడ్డికి సీఐడీ సిట్ నోటీసులు జారీ చేసింది. మద్యం స్కాం విషయంలో ఈ నోటీసులు జారీ చేసింది.

CID SIT issues notices to Vijayasai Reddy in liquor scam: ఏపీ లిక్కర్ స్కాం విషయంలో సీఐడీ సిట్ చకచకా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రాజ్ కసిరెడ్డి కోసం గాలింపులు జరుపుతున్న సీఐడీ అధికారులు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. పద్దెనిమిదో తేదీన విజయవాడ సీపీ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించారు. కొద్ది రోజుల కిందట కాకినాడ పోర్టు కేసులో సీఐడీ ఎదుట ఆయన హాజరైనప్పుడు మద్యం స్కాంలో కర్త, కర్మ, క్రియ రాజ్ కసిరెడ్డేనని విజయసాయిరెడ్డి ప్రకటించారు. తనను విచారణకు పిలిస్తే అన్ని విషయాలు చెబుతానన్నారు. ఇప్పుడు లిక్కర్ స్కాంలో సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది.
లిక్కర్ స్కాంలో విజయసాయిరెడ్డిపైనా గతంలో ఆరోపణలు
లిక్కర్ స్కామ్ పై సీఐడీ ఇప్పటికే కేసులు నమోదు చేసింది. అయితే ఆ కేసుల్లో నిందితుడిగా విజయసాయిరెడ్డి ఉన్నారో లేదో స్పష్టత లేదు. టీడీపీ విపక్షంలో ఉన్నప్పుడు అదాన్ డిస్టిలరీస్ అనే కంపెనీ గురించి ఎక్కువగా ఆరోపణలు చేసేవారు. ఆ సంస్థ విజయసాయిరెడ్డికి అల్లుడు శరత్ చంద్రారెడ్డికి బినామీదని చెప్పేవారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఈ లెక్కలన్నీ తేల్చేస్తామనేవారు. అయితే విజయసాయిరెడ్డి మాత్రం తన అల్లుడి కంపెనీలతో తనకు సంబంధం లేదని అంటున్నారు. రాజ్ కసిరెడ్డినే అంతా చేశారని ఆరోపిపించారు.
కోర్టు నుంచి ఊరట లభించకపోయినా పరారీలో రాజ్ కసిరెడ్డి
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టు నుంచి అరెస్టు కాకుండా రక్షణ తెచ్చుకున్నారు.రాజ్ కసిరెడ్డి అనే మరో కీలక నిందితుని కోసం పోలీసులు గాలింపులు జరుపుతున్నారు. హైదరాబాద్‌లో పలు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రాజ్ కసిరెడ్డినే ఈ స్కాంకు కర్త, కర్మ, క్రియ అని చెప్పినందున.. విజయసాయిరెడ్డి కీలక విషయాలు వెల్లడించే అవకాశం ఉంది. విజయసాయిరెడ్డి ఒక వేళ లిక్కర్ స్కాంలో తనకు తెలిసినవన్నీ సీఐడీకి చెబితే సంచలనాత్మక స్టేట్ మెంట్ అవుతుంది. ఇప్పటికే సీఐడీ కీలక విషయాలను దర్యాప్తులో కనిపెట్టిందన్న ప్రచారం జరుగుతోంది.
సీఐడీ సిట్ కీలక సమాచారం సేకరిచినట్లుగా ప్రచారం
వివిద డిస్టిలరీల నుంచి సేకరించిన సమాచారంతో పాటు ఆయా డిస్టిలరీలు వందలకోట్ల లంచాన్ని బంగారం రూపంలో రాజకీయ నేతలుకు ఇచ్చాయని చెబుతున్నారు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి విచారణ అత్యంత కీలకం కానుంది. వైసీపీతో విబేధించిన తర్వాత విజయసాయిరెడ్డి విచారణలకు హాజరవుతున్నారు. తాను రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నానని చెబుతున్నా ఆయన రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. జగన్ చుట్టూ ఉండే కోటరీ గురించి మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో సీఐడీ వరుసగా విచారణలకు పిలుస్తూండటం సంచలనంగా మారింది. లిక్కర్ స్కాంలో ఆయన విచారణ తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

