PM Modi: వక్ఫ్ చట్టం తరువాత మోదీ సర్కార్ నెక్ట్స్ టార్గెట్ అదే..! త్వరలోనే గెజిట్ నోటిఫికేషన్
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బిల్లు (Waqf Amendment Bill) తరువాత యూనిఫాం సివిల్ కోడ్ పై మరోసారి ఫోకస్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Uniform Civil Code: న్యూఢిల్లీ: దేశంలో వక్ఫ్ సవరణ చట్టంపై పలు రాష్ట్రాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ముస్లిం సంఘాలు వక్ఫ్ బోర్డులు, ముస్లిం మత పెద్దలు, నేతలు నూతన చట్టం అమలును వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడంతో చట్టంగా మారింది. అంతుకుముందు లోక్‌సభ, రాజ్యసభలలో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందింది. ఓవైపు వక్ఫ్ సవరణ చట్టం అమలుపై, కేంద్ర ప్రభుత్వంపై అటు ముస్లిం సంఘాలు, వక్ఫ్ సంఘాల నుంచి, విపక్ష కూటమి నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
లా కమిషన్ చేతిలో ముసాయిదా
మరోవైపు కేంద్ర ప్రభుత్వం మరో అంశంపై ఫోకస్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మోదీ ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టం తరువాత ఉమ్మడి పౌరస్మృతిపై కీలక అడుగులు వేస్తోంది. 23వ లా కమిషన్ యూసీసీ కోసం తుది ముసాయిదాను సిద్ధం చేయనుంది. అందుకోసం త్వరలో లా కమిషన్ చైర్మన్, సభ్యులను కేంద్రం నియమించనున్నట్లు సమాచారం. రిటైర్డ్ జడ్జి జస్టిస్ రితురాజ్ అవస్థి నేతృత్వంలోని 22వ లా కమిషన్ ఇదివరకే యూసీసీ ముసాయిదాను రూపొందించింది. దాదాపు కోటి మంది నుండి అభిప్రాయాలను సైతం పాత కమిషన్ స్వీకరించింది. దాదాపు 30 సంస్థలతో 22వ లా కమిషన్ చర్చలు జరిపింది. కమిషన్ పదవీకాలం ముగియడంతో యూసీసీ ముసాయిదా చివరి దశలో నిలిచిపోయింది. కేంద్ర ప్రభుత్వ సూచనతో 23వ లా కమిషన్ యూసీసీ ముసాయిదాకు తుది రూపు తీసుకొచ్చినట్లు దైనిక్ భాస్కర్ రిపోర్ట్ చేసింది.
కొత్త లా కమిషన్
వక్ఫ్ సవరణ బిల్లు లాంటి కీలక అంశంలో మోదీ సర్కార్ విజయం సాధించింది. తాజాగా UCCపై ముందుకు సాగడానికి 23వ లా కమిషన్‌ను కేంద్రం అలర్ట్ చేస్తోంది. 23వ లా కమిషన్ నోటిఫికేషన్ సెప్టెంబర్ 2, 2024న జారీ కాగా.. దాదాపు 7 నెలల తర్వాత, ఛైర్మన్, సభ్యుల నియామకంపై నిర్ణయం తీసుకుంటోంది. మే 2023లో జస్టిస్ దినేష్ మహేశ్వరి సుప్రీంకోర్టు నుంచి పదవి విరమణ చేశారు. ఆయనకు లా కమిషన్ నూతన చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ప్రముఖ లాయర్ హితేష్ జైన్, ప్రొఫెసర్ డిపి వర్మ కమిషన్ సభ్యులుగా ఉంటారు. లా కమిషన్ కొత్త చైర్మన్ సహా సభ్యుల నియామకానికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
భారతదేశంలో ఉమ్మడి పౌరస్మతి యూనిఫాం సివిల్ కోడ్ - యూసీసీని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలకు కట్టుబడి ఉత్తరాఖండ్ ప్రభుత్వం యూసీసీని అమలు చేస్తోంది. ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్‌ను అమలు చేస్తామని 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ హామీ ఇచ్చింది. ఆ హామీని నిలబెట్టుకునేందుకు సన్నాహాలు పూర్తి చేసిన పుష్కర్ సింగ్ ధామి ప్రభుత్వం.. జనవరిలో యూసీసీని అక్కడ అమలు చేసింది. మిగతా రాష్ట్రాలు తమను అనుసరించాలని పుష్కర్ సింగ్ ధామి అదే సమయంలో పిలుపునిచ్చారు. అయితే బీజేపీ రాష్ట్రాలు యూసీసీకి మొగ్గుచూపగా, విపక్ష కూటమి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు పూర్తిగా వ్యతిరేకించాయి.






















