Mahesh Babu: వెకేషన్ నుంచి మహేష్ బాబు వచ్చేశారు - 'SSMB29' షూటింగ్ ఇక షురూ!
SSMB29 Movie Updates: సూపర్ స్టార్ మహేష్ బాబు రోమ్ నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. 'SSMB29' మూవీ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి కాగా కాస్త విరామం తీసుకున్న ఆయన ఫ్యామిలీతో సహా వెకేషన్‌కు వెళ్లారు.

Mahesh Babu Return From Vacation: సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) కాంబోలో వస్తోన్న క్రేజీ మూవీ 'SSMB29' కోసం ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి కాగా.. మూవీ టీం కాస్త విరామం తీసుకుంది. రాజమౌళి జపాన్ పర్యటనలో ఉండగా.. మహేష్ బాబు రోమ్ వెళ్లారు. అలాగే, ప్రియాంక చోప్రా అమెరికా వెళ్లారు.
హైదరాబాద్ చేరుకున్న మహేష్ బాబు
తన ఫ్యామిలీతో కలిసి ఇటలీ వెకేషన్‌కు వెళ్లిన మహేష్ బాబు.. తాజాగా హైదరాబాద్ తిరిగొచ్చారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్న ఆయన.. అభిమానులతో కలిసి ఫోటోలు దిగారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆయన తిరిగి రావడంతో 'SSMB29' మూవీ షూటింగ్ సెకండ్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
SUPER STAR @urstrulyMahesh is back in Hyderabad!!#SSMB29 #MaheshBabu pic.twitter.com/kazyybI6d0
— SSMB Fan Trends ™ (@SSMBTrendsTeam) April 15, 2025
Also Read: అంతర్జాతీయ భాషలో 'బాహుబలి: ది బిగినింగ్' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
జపాన్‌లో రాజమౌళి
ప్రస్తుతం రాజమౌళి జపాన్ పర్యటనలో ఉన్నారు. 'ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్' డాక్యుమెంటరీ ప్రమోషన్స్ కోసం ఆయన కుటుంబ సమేతంగా జపాన్ వెళ్లారు. ఈ సినిమాకు సంబంధించి మూడేళ్ల ప్రయాణంలో ది బెస్ట్ మూమెంట్స్‌ను 1:38 గంటల నిడివితో ఈ డాక్యుమెంటరీ రూపొందించారు. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్స్ దృశ్యాలు, నటీనటులు, మూవీ టీం అభిప్రాయాలు ఇందులో చూపించారు. ఈ ప్రమోషన్లలో దర్శకధీరుడు బిజీగా మారారు. ఆయన టూర్ సైతం ముగించుకుని వచ్చాక 'SSMB29' మరో షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.
ఇటీవలే ఒడిశాలో 'SSMB29' మూవీ షూటింగ్ ఓ షెడ్యూల్ పూర్తైంది. సిమిలిగుడ సమీపంలోని మాలి, పుట్ సీల్, బాల్డ ప్రాంతాల్లో కీలక సీన్స్ చిత్రీకరించారు. ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
జక్కన్న రూల్స్ దాటి..
రాజమౌళి సినిమా అంటేనే ఓ క్రేజ్. ఆయన సినిమాల్లో నటించే వారికి స్ట్రిక్ట్ రూల్స్ పెడతారనే టాక్ ఎప్పటి నుంచో ఉంది. ఒక్కో సినిమాకు 3 నుంచి ఐదేళ్లు టైం తీసుకునే జక్కన్న.. సినిమా షూటింగ్ స్టార్ట్ అయితే మధ్యలో వెకేషన్స్, బ్రేక్స్ వంటివి ఏమీ ఉండవు. సినిమాలో నటిస్తున్న హీరో మూవీ పూర్తయ్యే వరకూ బహిరంగంగా కనిపించకూడదనే షరతులు వర్తిస్తాయని సమాచారం. ఇందులో భాగంగా 'SSMB29' మూవీ షూటింగ్ స్టార్టింగ్ సమయంలో మహేష్ బాబు పాస్ పోర్టును తీసుకుని సింహాన్ని బోనులో బంధించాను అనే అర్థం వచ్చేలా రాజమౌళి చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.
అయితే, గతం కంటే భిన్నంగా తన రూల్స్ బ్రేక్ చేసుకుని మరీ రాజమౌళి మహేష్ బాబును వెకేషన్‌కు అనుమతించారు. ఈ క్రమంలోనే వెకేషన్‌కు వెళ్లేటప్పుడు మహేష్ బాబు ఎయిర్ పోర్టులో తన పాస్ పోర్టును ఫోటోగ్రాఫర్లకు చూపిస్తూ బోను నుంచి బయటకొచ్చానని హింట్ ఇచ్చారు. ఇప్పుడు వెకేషన్ పూర్తి చేసుకుని తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. 'SSMB29' మూవీ 2027లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.






















