Vijay Sethupathi: 'ఫామ్‌లో లేని డైరెక్టర్‌తో మూవీ ఎందుకు?' - అదిరిపోయే రిప్లై ఇచ్చిన విజయ్ సేతుపతి
Puri Jagannadh Movie: పూరి జగన్నాథ్‌తో సినిమా ఎందుకు చేస్తున్నారనే కామెంట్స్‌కు తమిళ స్టార్ విజయ్ సేతుపతి తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. తాను దర్శకులను సినిమా ఫలితం ఆధారంగా జడ్జ్ చేయనని చెప్పారు.

Vijay Sethupathi Reaction On Puri Jagannadh Movie: డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh), తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కాంబోలో ఓ మూవీ రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభం అయినప్పటి నుంచీ రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఫామ్‌లో లేని పూరితో స్టార్ హీరో సినిమా ఏంటంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ హల్చల్ చేశాయి. ఆయన స్క్రిప్ట్ ఎందుకు ఎంచుకున్నారంటూ విజయ్‌ను ట్యాగ్ చేస్తూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. వీటిపై తనదైన శైలిలో నటుడు విజయ్ సేతుపతి స్పందించారు.
'అలా జడ్జ్ చేయను'
దర్శకులు గతంలో చేసిన సినిమాలు, వాటి ఫలితాల ఆధారంగా తాను జడ్జ్ చేయనని నటుడు విజయ్ సేతుపతి స్పష్టం చేశారు. స్క్రిప్ట్ నచ్చితే సినిమా చేస్తానని.. పూరి చెప్పిన కథ తనకు బాగా నచ్చిందని అందుకే అంగీకరించినట్లు చెప్పారు. ఇలాంటి కథ ఇప్పటివరకూ చేయలేదని.. తాను కొత్త వాటిని ఎప్పుడూ ప్రాధాన్యమిస్తానని అన్నారు. గతంలో చేసిన స్టోరీలు రిపీట్ కాకుండా చూసుకుంటానని తెలిపారు. పూరి జగన్నాథ్‌తో తన సినిమా షూటింగ్ జూన్‌లో ప్రారంభం అవుతుందని విజయ్ వెల్లడించారు.
Also Read: 'దాని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా' - శివశక్తి పాత్రపై మిల్కీ బ్యూటీ తమన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
'ఆమెతో నటించడం ఆనందంగా ఉంది'
ఈ సినిమాలో టబు కీలక పాత్రలో కనిపించనున్నట్లు విజయ్ సేతుపతి తెలిపారు. 'టబు గొప్ప నటి. టాలెంటెడ్ కోస్టార్. గతంలో ఎప్పుడూ ఆమెతో కలిసి స్క్రీన్ పంచుకోలేదు. ఈ సినిమాలో ఆమెతో కలిసి నటించడం ఆనందంగా ఉంది.' అని అన్నారు.
అప్పుడు వణికిపోయాను
తాను ఇప్పటివరకూ చేసిన చిత్రాల్లో 'మహారాజ' తనకు ప్రత్యేకమైనదని విజయ్ తెలిపారు. 'అందులోని రోల్ చాలా కష్టమైనది. పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలకు సంబంధించి కొన్ని సీన్స్ ఉన్నాయి. వాటిలో నటించేటప్పుడు వణికిపోయాను. 'సూపర్ డీలక్స్', 'ఉప్పెన'లోని పాత్రలు కూడా చాలా కష్టమైనవే. కానీ 'మహారాజ' నా హృదయాన్ని హత్తుకుంది. ఎందుకంటే నేను నిజ జీవితంలో ఓ కుమార్తెకు తండినే కదా. నేను బలమైన మెసేజ్ ఉన్న సినిమాలు ఎంచుకుంటాను. అదే నా బలం. సినిమాలో వినోదంతో పాటు సందేశం కూడా ఉండాలి.' అని అన్నారు.
పూరి సినిమాతో పాటు మరో రెండు తమిళ ప్రాజెక్టులు చేస్తున్నట్లు విజయ్ తెలిపారు. మిస్కిన్ దర్శకత్వంలో 'ట్రైన్' చిత్రంలో నటిస్తున్నానని వెల్లడించారు. ఇది ఓ యాక్షన్ మూవీ. దీంతో పాటే మరో మర్డర్ మిస్టరీలో నటిస్తున్నట్లు చెప్పారు.
మరో బాలీవుడ్ హీరోయిన్?
పూరి, విజయ్ కాంబోలో సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచీ క్రేజీ రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ టబు నటించనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. మరో బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే కూడా ఇందులో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాలో స్టోరీ డిఫరెంట్‌గా ఉండబోతోందనే టాక్ వినిపిస్తోంది. పూరి కమ్ బ్యాక్ కావాలని ఆయన ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.






















